‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రథమ బహుమతి రూ.50 వేలు పొందిన కథ.
గట్టిగా ఒక కూత కూస్తూ, ఇక చాలు బయలుదేరుదాం పద.. అన్నట్లు ప్లాట్‌ఫామ్ మీదకొచ్చింది మెట్రో. చెవికీ, భుజానికీ మధ్య ఫోన్ ఉంచి, అడుగు లోపల పెట్టాను. జనం పల్చగా ఉన్నారు, కూర్చోవడానికి చోటు దొరికింది. ఫోన్ రింగవుతూనే ఉంది. ఎత్తితే బావుణ్ను. ఇది మూడవ సారి, కాస్త టెన్షన్‌గా అనిపించింది. మనసులో ఏవేవో భయాలు మొదలవుతున్నప్పుడు, లిఫ్ట్ చేశాడు..
“చెప్పు హర్ష!” అంటూ.
“ఫోన్ ఏం అన్నా లిఫ్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు చేశాను నీకు!” అన్నాను కోపంగా.
“పడుకున్నాను రా! ఏమయింది, ఏమయినా ఎమర్జెన్సీ ఆ..?” అడిగాడు.
ఓ క్షణంపాటు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత నెమ్మదిగా చెప్పాను..
“హైదరాబాద్ వచ్చాను, బిజినెస్ పని మీద. నిన్నుకూడా చూసి వెళ్దామని చేశాను” అని.
“నేను సెలవు పెట్టాను, కాస్త నీరసంగా ఉందని. నీ పని చూసుకుని నేరుగా నా రూంకి వచ్చేయ్” చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అద్దాల కిటికీ నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. ఆలోచనలు మెట్రో కన్నా వేగంగా పరిగెడుతున్నాయి, వెనక్కి! పెరుగుతున్న వయసు, వందల కిలోమీటర్ల దూరం, వేరు అయిపోయిన జీవన ప్రయాణాలు..! ఏవేవి అన్న నుంచి దూరాన్ని పెంచాయి? ఎన్ని జ్ఞాపకాలు అన్నతో! ఆటలు, పోట్లాటలు, ఏటిలో ఈతలు, పట్టి మంచంపై చేరబడి చెప్పుకొన్న కథలు..! ఒక జీవితకాలపు నేస్తం అన్న, నా అల్లరంతటికీ ఆదిగురువు అన్న.
ఆరేడేళ్లేమో నాకు, పదేళ్లలోపే అన్నకు.
మామిడితోటలో చూసిన ఏడురంగుల సీతాకోకచిలుకను, అచ్చు గుద్దినట్లు, అలానే గీసి చూపించాడు. ఇప్పటికీ మనసు కాన్వాస్‌పై ఆ బొమ్మ రంగులు అలానే ఉన్నాయి. మరి దానిని చూసి నాన్నేమన్నాడు..
“ఎవ్వరికీ కనిపించని వింతలన్నీ నీకే కనిపిస్తాయి. ఏడో ఎక్కం రాదుగానీ, ఏడు రంగులతో బొమ్మలేయడమొచ్చు” అని కసురుకోలేదా..!
అది మొదలు.. జ్ఞాపకాల కాగితాలపై ఏనాడూ అన్నని నాన్న మెచ్చుకున్నట్లు ముద్రింపబడలేదు.
ఎవరో ఇంటికొచ్చినాయన..
“మీ పెద్దోడు చాలా తెలివైన వాడండి” అని అంటే..
“అబ్బే! వాడొట్టి మొద్దండి. మా చిన్నోడు తెలివైన వాడు” అన్నారు.
అన్నని తిట్టి నన్ను చేరిన పొగడ్త, నాన్న తిట్లకన్నా ఎక్కువే బాధ పెట్టించిందా రోజు.
ఓసారి ఎప్పుడో అడిగాను..
“అన్నా! అమ్మ తిట్టదనేగా అమ్మంటే ఇష్టం. నాన్న కొడుతాడు గనుక, నాన్నంటే కోపం” అని.
వాడన్నాడూ..
“అమ్మ మాటే కదరా మనకి ఓదార్పు. అమ్మ లేకుంటే ఇంటికి రావాలని కూడా అనిపించదు రా” అని. అలాంటిది..!
కళ్లంట జలజలా రెండు నీటి చుక్కలు రాలాయి. కర్చీఫ్‌తో తుడుచుకొని తలెత్తి చూశాను. నీ ఆలోచనలతో నాకు సంబంధం లేదన్నట్లు పరుగెడుతున్నది మెట్రో. తలలు మొబైళ్లలో ముంచి జోగుతున్నారు జనం. పదేళ్లేమో అప్పుడు..! నవోదయలో సీటు తెచ్చుకోలేదని నాన్న అన్న చెంపను చెళ్లుమనిపిస్తే, నా గుండెలదిరాయి. తర్వాత ఏడుపులు, ఓదార్పులు, బుజ్జగింతలు.. అన్నని కాదు, నాన్నని.
“నా జీవితం ఇలా అయిపోయింది. మీవి ఇలా కాకూడదనే కదరా చదవమనేది” అని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్.
ఆ రోజు అర్థం కాని చాలా విషయాలు, వయసు పెరుగుతున్న కొద్దీ, కొద్దికొద్దిగా అర్థమవ్వసాగాయి. మన దేశంలో ముప్పై ఐదు, నలభై సంవత్సరాల వయసు దాటాక, మనిషికి ఎదిగేందుకు కష్టపడదామన్నా, కొత్తగా ప్రయత్నిద్దామన్నా, ఏ అవకాశమూ కనిపించదు. స్కిల్గానీ, పెట్టుబడిగానీ లేని మనిషిక్కడ వ్యర్థ మానవుని కిందే లెక్క. అతనికి అడుగు ముందుకు కదిపే అవకాశమే ఉండదు.
ఆపై.. ఏ కలుగులోని ఎలుక ఆ కలుగులోలా బతకాల్సిందే! మరో దారిలేదు. ఆ కలుగుల్లో కనిపించే వెలుగు రేఖలు పిల్లలు. డబ్బు కాదు, కీర్తి కాదు, కేవలం మా జీవితాల్లా వాళ్లవి కాకూడదన్న భయం. మాకు దక్కని గెలుపు మా పిల్లలకు దక్కాలన్న వెర్రి ఆశ. మీ ఆశల బరువులకు వాళ్ల రెక్కలు విరిగిపోతున్నాయన్నా వినరు, వినిపించుకోరు. ఇదో సాంఘిక దురాచారం, అయినా దానిని గుర్తించే నాథుడూ ఉండడు. ఎందుకంటే, ప్రతి వందలో తొంభై మందిది ఇదే బతుకు కనుక. ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతంలో, ఇంకా ఎదుగుదలకు మొదటి మెట్లుగా కనిపించే పిల్లలే, ప్రతి ఇంటా..!
అటువంటి బతుకే మా ఇంటిదీ, మా జీవితాలదీ..! ఆశల మేడల్లో నాన్న, అందుకోలేని అగాథంలో మేము! మిషన్ నవోదయ ఫెయిలయ్యాక, మరికొన్ని మిస్ ఫైర్లూ, మరికొంత మెలోడ్రామా..! చూసి, విని, కాసి ఎక్కడలేని మొండితనం వచ్చేసింది నాలో.
“కనీసం నువ్వయినా…” అన్న మాట వినిపిస్తే చాలు, అందనంత దూరం పరిగెత్తేవాడిని. ఈ చదువు అనే దానికి ఎంత దూరంగా ఉంటే, మనమంత సేఫ్ అని అనిపించేది నాకు. అన్న మాత్రం వేరు. ఐఐటీ సీటు దక్కనప్పుడు నాన్న ఏడుపులే కాదు, అన్నలోనూ ఏదో మార్పు గమనించాను. అప్పటినుండీ వాడు పుస్తకాలే ప్రపంచంగా మారిపోయాడు. చిన్నప్పుడు నాతో పోటీపడి అల్లరి చేసే అన్న.. ఒక్కసారిగా ఓ మౌనయోగిలా మారిపోయాడు. ఒక్కోసారి అనిపించేది, నేను కాకుండా మరో స్నేహితుడైనా ఉన్నాడా? వీడికి అని. ఎన్ఐటీలో బీటెక్ చేశాడు. తర్వాత నాన్న సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవమంటే మరో మాట మాట్లాడకుండా సరేనన్నాడు. దిల్లీ ట్రైన్ ఎక్కేముందు అడిగాను వాడిని..
“అన్నా! నిజంగా ఇష్టంగానే చేస్తున్నావా? లేక నాన్న కోసమే ఒప్పుకొన్నావా?” అని.
అప్పుడన్నాడు..
“మన చదువులు మారాలిరా హర్ష! ఏ ఒత్తిడీ లేకుండా, భవిష్యత్తు మీద భయం లేకుండా పిల్లలు చదువుకొనే రోజులు రావాలి. అందుకు నా వంతుగా ఏమైనా చేయగలనా? అనిపిస్తే, ఇదే మంచి అవకాశంగా కనిపించింది” అని. భలే అనిపించింది వాడి జవాబు. గట్టిగా కౌగిలించుకుని.. ‘ఆల్ ద బెస్ట్’ చెప్పాను. రెండు సంవత్సరాలు..! అన్న ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు.
“అశోక్.. స్థాయికి మించి ఖర్చు పెడుతున్నాను రా! అందొచ్చిన కొడుకు ఉద్యోగం ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు అందరూ. సమయం వృథా చేసుకోకు, త్వరగా ఏదో ఒకటి సాధించు..” ఇవే మాటలు ఫోన్ లో. ఇవేనా మాట్లాడాల్సిన మాటలు..? అనిపించేది నాకు. మూడో ప్రయత్నంలో అన్న ఒక్కో మెట్టూ దాటుతూ ముందుకెళ్తుంటే, మా మనసులు ఉద్వేగంతో నిండిపోయాయి. అన్న ఇంటర్వూకి ఎంపికైనప్పుడు ఇంట్లో ముగ్గురం చిన్న పండుగులా చేసుకున్నాం. ఆ క్షణం అన్న కూడా ఇంట్లో ఉండుంటే, ఈ ఇంట్లో తను ఎంత గొప్ప విజయం సాధించాడో తనకు అర్థమై ఉండేది.
ఇంటర్వ్యూ రోజుకోసం, ఒక్కో రోజు లెక్కపెడుతూ ఉండేవాళ్లం. అయితే మేము అనుకున్నట్లు జరగలేదు. ఇంటర్వ్యూకి ఇంకా వారం రోజులు ఉందనగా, అమ్మకు ఛాతీలో మంటగా ఉందంటే హాస్పిటల్‌కి తీసుకువెళ్లాం. మందులేవో తీసుకుని తిరిగొచ్చాం. కాస్త బాగానే ఉందని చెప్పే, అమ్మ పడుకుంది. కానీ ఉదయానికి తనలో ప్రాణం లేదు. ఒక్కసారిగా మా జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయి అనిపించింది. దుఃఖం తన్నుకొచ్చింది. అన్నకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు.
“నేను చెప్తాను” అన్నారు నాన్న. తెలిసిన వాళ్లూ, బంధువులూ వచ్చారు, ఏర్పాట్లేవో చేశారు. సాయంత్రానికి ఏడ్చీ, ఏడ్చీ ఎర్రబారిన నా కళ్లకు అందరూ మాయగా కనిపించారు. అలాగే శ్మశానానికీ తీసుకువెళ్లారు. నన్ను కర్మకాండలు చేయమన్నారు ఎవరో. ఒక్కసారిగా వీపు మీద చరిచినట్లయింది.
“అన్నేడి?” చుట్టూ చూస్తూ అడిగాను. నాన్న కళ్లలో అపరాధ భావం. విషయం అర్థమవుతున్నది. మెల్లగా నా తలకెక్కుతుంది.
“వాడికి జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం రా ఇది” అన్నారు నా చేయి పట్టుకుని. చేయి విదిలించుకున్నాను విసురుగా. బంధువులెవరో ఫోన్ చేసి తెచ్చి చేతికిచ్చారు. అవతల అన్న.. వెక్కివెక్కి ఏడుస్తూ, మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.
“ఏరా! ఎవరో చెబితే గానీ, అమ్మ చనిపోయిందని కూడా నాకు తెలియలేదు. అమ్మను కడసారి చూడటానికీ నా చదువే అడ్డు వచ్చిందా రా!” అని.
“అన్నా..! తప్పు జరిగిపోయింది! క్షమించు, క్షమించు” ఏడుస్తూనే చెప్పాను. ఆ రోజు అన్న వీడియో కాల్లో అమ్మని చూస్తుంటే, నేను కర్మకాండలు పూర్తిచేశాను. ఇంటర్వ్యూ అయిన మరుసటి రోజు అన్న ఊరొచ్చాడు. ఒకరినొకరం పట్టుకుని ఏడ్చేశాం. దాదాపు నెలరోజుల పాటు అన్న ఇంట్లోనే ఉండిపోయాడు. తన రిజల్ట్స్ వచ్చాయి. సెలెక్ట్ అవలేదు. “ఏం చేద్దాం అనుకుంటున్నావు” అని అడిగాను. తెలియదన్నట్లు చేయి ఊపుతూ, విరక్తిగా ఓ చిన్న నవ్వు నవ్వాడు. రెండు రోజుల తర్వాత ఢిల్లీకి మళ్లీ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు.
ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, సోలార్ ప్యానళ్ల ఇన్స్టలేషన్ పనికి ఒప్పుకొన్నాను. కాలేజ్ ప్రాజెక్ట్ నాటి పరిచయాలు అందుకు పనికొచ్చాయి. ఒక్కో ఇన్స్టలేషన్ పూర్తి చేస్తుంటే, ఈ పని గురించి, దీని వెనుక ఉన్న ప్రభుత్వ పథకాల గురించీ కొద్దికొద్దిగా అర్థమవసాగింది.
ఇందులో భవిష్యత్తు ఉందనిపించింది. మాడ్యూల్స్ ప్రొక్యూర్మెంట్ కూడా మనమే చేసుకుంటే, స్థిరమైన వ్యాపారంగా అభివృద్ధి చేయవచ్చు అనిపించింది. నాలాంటి ఆలోచనలే ఉన్న కొంతమంది స్నేహితులతో కలిసి ఆ విధంగా అడుగులు వేయడం మొదలుపెట్టాను. అమ్మ మరణం తర్వాత ఇదంతా నాకొక పాజిటివ్ మార్పు. అన్న కూడా ఇలానే తన దృష్టంతా తర్వాత ఏడాది పరీక్షపై పెట్టి సన్నద్ధం అవుతున్నాడని అనుకున్నాను. ఎప్పుడో ఓసారి మాట్లాడినా, రెండు మూడు మాటలతో ఫోన్ పెట్టేసేవాడు.
మూడు నెలల తర్వాత అన్న రూమ్మేట్ ఒకతను ఫోన్ చేసి.. అన్నయ్య పరిస్థితేమీ బాలేదు, ఒకసారి రమ్మని చెబితే, ఎకాఎకిన ఢిల్లీ బయలుదేరి వెళ్లాను. ఎర్రని కళ్లతో, చింపిరి జుట్టుతో పిచ్చోడిలా కనిపించాడు అన్న. వాడిని చూస్తేనే అర్థమయింది, వాడు ఎన్నో రోజులుగా నిద్రపోలేదని. నన్ను చూసి అన్నాడు..
“హర్షా! అమ్మ నాతో మాట్లాడుతుంది రా!” అని. ఒళ్లు జలదరించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
“అమ్మ మాట్లాడటమేమిటి అన్న, అమ్మ చనిపోయింది కదా!” అన్నాను.
“లేదు.. అమ్మ మాటలు నాకు వినిపిస్తున్నాయి. తను చాలా బాధ పడుతోంది. నా ఎగ్జామ్ క్లియర్ అవలేదని, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది…” చెప్పుకొంటూ పోతున్నాడు వాడు.కాలికింద నేల కూలిపోతున్నట్లు అనిపించింది నాకు. “ఇలానే మాట్లాడుతున్నాడు. ఒక మాటతో మరో మాటకు సంబంధం ఉండట్లేదు. ఎవరితోనూ కలవట్లేదు” చెప్పాడు తన రూమ్మేట్. మౌనముని మనోఫలకం బద్దలయింది. లోపలున్న వేదనేదో బయటకొచ్చి తననే కాల్చేస్తోంది. నిస్సహాయంగా చూడటం తప్ప, నేనేమీ చేయలేనా!? అనిపించింది.
ఊరు తీసుకొచ్చి, మంచి సైకియాట్రిస్ట్‌కి చూపించాను. పరీక్షించి ‘స్కిజోఫ్రెనియా’ అనే మానసిక రుగ్మత అన్నారు. నాన్న మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆయన వల్లే అన్నకు ఈ పరిస్థితి వచ్చిందని అనిపించింది. డాక్టర్ మాత్రం.. “నిర్దిష్టంగా అదే కారణమని చెప్పలేం” అన్నారు. కానీ, తలమీద ఒత్తిడి పెట్టి కూర్చుంటే, ఆ మనిషి ఎంత ఎదిగాడో బయటకు కనిపిస్తుంది గానీ, లోపలెంత కృంగిపోయాడో ఎవరికీ కనిపించదు కదా..!
యాంటీ డిప్రెసెంట్ మందులేవో ఇచ్చారు. వాటి ప్రభావంతో అన్న, దాదాపుగా రోజంతా నిద్రలోనే ఉండేవాడు. తినడం, పడుకోవడం, ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండటం, ఇదే వాడి దినచర్య. నన్ను మినహా అందరినీ అనుమానంగా చూసేవాడు. తనకేదో హాని చేయబోతున్నారని అనేవాడు. అర్థంకాని మాటలేవో మాట్లాడేవాడు, అమ్మ ఏదో చెబుతుందనేవాడు. వాడు ఏం అన్నా, ఎలా ఉన్నా.. ఎప్పుడూ వాడిని ఏమైనా అంటే బాగోదని నాన్నకు చెప్పాను. ఆయన కంట్లో ఓ నీటి చార..
‘ఇంకేమనగలను?’ అన్నట్లు.
“స్థిరమైన ఉద్యోగమో, ఆదాయమో లేకపోతే, జీవితంలో ఎన్ని అవమానాలూ, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయో చూశాను రా! అందుకే మీ జీవితాలు అలా అవకూడదనుకున్నాను. అంతే గానీ ఇలా..!” మాట తడబడింది. భుజం మీద చేయి వేశాను, ఓదార్పుగా.
దాదాపుగా, ఆరునెలల పాటు అన్న జీవితం అలానే గడిచింది. మందులు, కౌన్సెలింగ్ సెషన్లతో కొంత మెరుగైనా.. అది మునుపటి అన్నను మాకు తిరిగి ఇవ్వలేదు. మందుల ప్రభావమో, శారీరక శ్రమ లేకపోవడమో, ఆరు నెలల్లో దాదాపు పాతిక కిలోల బరువు పెరిగాడు. మాటలో, ఆలోచనలలో వేగం పోయింది. ఎవరేమైనా చెప్పినా, అర్థం చేసుకోవడానికి తనకు సమయం పట్టేది. మందులన్నీ చెప్పిన సమయానికి కచ్చితంగా వేసుకోవల్సిందే. లేదంటే, తల తిరుగుతుంది అనేవాడు.
ఇది ఇలానే కొనసాగుతుందా..? ఏమిటీ పరిస్థితి అనిపించేది. ఒకరోజు ఓ పోస్ట్ వచ్చింది ఇంటికి, అన్న ఎప్పుడో ఏడాది క్రితం రాసిన ఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడని, హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వమని. ఓ చిన్నస్థాయి ఉద్యోగమది. కానీ, ఇప్పుడు అన్న ఉన్న పరిస్థితికి అదయినా చేయగలడా? అనిపించింది. వాడి జీవితానికి ఇదే చిరువెలుగేమో అన్న ఆశతో ముగ్గురం హైదరాబాద్ వెళ్లాం. అన్న జాయిన్ అయ్యాక, అన్న పై అధికారిని కలిసి చెప్పాను, అన్నకు ఆరోగ్య సమస్యలున్నాయని.ఎప్పుడైనా అవసరమైతే, నా నంబరుకి ఫోన్ చేసి చెప్పమని. సరేనన్నారు.
అద్దెకో చిన్న రూం తీసుకున్నాం. కావలసిన సామాన్లేవో కొన్నాం. నాన్న అన్నతోపాటు ఉండిపోయారు, వాడి బాగోగులు చూసుకోవడానికి. ఉదయాన్నే లేచి వంట చేసి, లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, చిన్న పిల్లాడిని స్కూలుకి తీసుకువెళ్లినట్లు అన్నను ఆఫీసుకు తీసుకువెళ్లేవారు. తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి.. వాడు తిని, మందులేసుకుని పడుకునేవరకూ అన్నీ తానై చూసుకునేవారు. ఆఫీస్‌లోనూ అన్నతో పాటు జాయిన్ అయిన ఒకరిద్దరు కొలిగ్స్‌కు, అన్నకు పనిలో సాయం చేయమని రిక్వస్ట్ చేసి చెప్పారు. ఇవన్నీ చూసి, ఒక్క కుదుపు జీవితాలను ఎంతగా మార్చేస్తుందో కదా!? అనిపించింది.
నా జీవితమూ చాలా మారిపోయింది, మరోలా… చిన్నగా ఇంటి మేడలపై ప్యానల్స్ అమర్చే స్థాయినుంచి, పాతికమంది పనివాళ్లను పెట్టుకుని కాంట్రాక్ట్‌లకు, ఆఫీస్‌లకు, స్ట్రీట్ లైటింగ్కూ, సోలార్ పార్క్‌లకూ ఇన్స్టలేషన్లు చేసే స్థాయికి.. నేను కోరుకున్న స్థిరమైన వ్యాపార స్థాయికి. మానస పరిచయం అయ్యాక జీవితంలో ఇంకో మలుపు. తాను అనుకున్నప్పుడు జీవితంలోకి వచ్చి, తాను కోరుకున్నట్లుగా మనిషిని మార్చేసేదే ప్రేమ. అది జరిగింది. కళ్లల్లోని మెరుపు, మనసులోని రూపమై, బంధమై, బాధ్యతయింది. పెళ్లికి అడుగు దూరంలో నిల్చున్నాం.
మూడో ఆలోచన లేనంతగా ఇవి రెండూ నా జీవితాన్ని నింపేశాయి. నాన్న ఉన్నంతవరకూ అన్న గురించి నేను ఆలోచించాల్సిన అవసరమూ పడలేదు. అన్నీ తానై చూసుకున్నారు. ఏడాది క్రితం ఆయన చనిపోయారు, వయసుతోపాటు వచ్చిన ఆరోగ్య సమస్యలతో.. చివరి వరకూ, అన్న గురించి విచారం ఆయన మనసులో ఉండిపోయిందని అనిపించింది. పన్నెండు రోజులు ముగిశాక అన్నను అడిగాను..
“నువ్వు ఒంటరిగా ఉండగలవా..?” అని.
“ఫర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలను” అన్నాడు.
ఆ తర్వాత ఈ ఏడాదిలో ఎన్నిసార్లు కలిశాం! మహా అయితే, రెండు మూడు సార్లేమో కదా..!
ఆలోచనల ప్రయాణానికి ఆఖరి స్టేషన్ వచ్చేసింది, నేను దిగాల్సిన స్టేషన్. స్టేషన్ నుంచి బయటకు వచ్చి, అన్న రూం వైపుగా నడక మొదలుపెట్టాను. అర కిలోమీటర్ దూరమేమో.. చాలా కాలమైనట్లుంది ఈ చోటుకొచ్చి. నడుస్తుంటే మానస ఫోన్ చేసింది.
“ఏమైంది వెళ్లిన పని? మీ అన్నయ్యని కలిశావా?” అని.
“ఇదిగో వెళ్తున్నాను” అన్నాను.
“సరే! ఏ విషయమో ఫోన్ చేసి చెప్పు.
మా అమ్మ నా తల తింటుందిక్కడ” అని చెప్పి పెట్టేసింది. మానస వాళ్ల ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. వాళ్లకి మా సంగతి తెలుసు. అన్నకి కాకుండా నేనెలా చేసుకోగలనని నేను.
“అసలు మీ అన్నయ్యకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో, లేదో కనుక్కో! చేసుకుంటాడంటే.. మనమే ఓ మంచి అమ్మాయిని వెతుకుదాం” అంది మానస. అదే కారణం, హైదరాబాద్ రావడానికి. కాలింగ్ బెల్, మూడు నాలుగుసార్లు మోగాక, వచ్చి తలుపు తీశాడు. అప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నాడు, ముఖం మత్తుగా ఉంది. లోపలికి వచ్చాక, కూర్చోమంటూ కుర్చీ వైపు చూపించాడు. రూం అంతా అస్తవ్యస్తంగా ఉంది. గాలి లేదు, వెలుతురు లేదు. ఇంటి నిండా ధూళి, వింత వాసన.
“మంచి నీళ్లేమైనా తాగుతావా..?” నా ఎదురుగా కూర్చుంటూ అడిగాడు.
“లేదు” అన్నాను.
“రాత్రంతా నిద్ర పట్టలేదు. అమ్మ మాట్లాడుతూనే ఉంది. ఈ మందుల మత్తుకేమో ఉదయం నిద్ర పట్టేస్తుంది. ఇప్పటికీ తల తిరిగేస్తుంది” ఆవలిస్తూ చెప్పాడు. అన్ననీ, తన రూంనీ నమ్మలేనట్లుగా చూస్తూ కూర్చున్నాను.
“నువ్వు ఫ్రెష్ అవు, నేను ఓ కునుకు తీసి వస్తాను. లేచాక తినడానికి బయటకు వెళ్దాం” అని చెప్పి, నా జవాబు కోసమైనా చూడకుండా బెడ్ రూం లోపలికి వెళ్లిపోయాడు. ఫ్లోర్ పై అంగుళమెత్తు ధూళి ఉంది. బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలీక చుట్టూ చూసి, తిరిగి లేచి నేను కూర్చున్న కుర్చీ మీదే పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ రూం లోపలికి వెళ్లాను.
అప్పటికే మత్తునిద్రలోకి వెళ్లిపోయాడు అన్న. అలా తననే చూస్తూ నిల్చున్నాను. ముప్పై రెండేళ్ల అన్న.. బానపొట్టతో, తెలుపునెరుపు అంటుకున్న గెడ్డంతో, నలభై ఐదేళ్ల వాడిలా ఉన్నాడు. కాళ్లూ, చేతులూ బారగా చాపి, పసిపిల్లాడిలా నిద్రపోతున్నాడు. ఎదురుగా గోడపై ఏదో పెయింటింగ్ కనిపించింది, దగ్గరకు వెళ్లి చూశాను. యానిమే పెయింటింగ్. రంగురంగుల సీతాకోకచిలుకలు గాల్లో ఎగురుతుంటే, నేలపై ఓ గొంగళి పురుగు ఒంటరిగా పైకి చూస్తూ నిల్చుంది, తనకు రెక్కలు రావన్నట్లు, రంగులు చూడలేదన్నట్లు… అన్న మనసుకి అద్దంలా..!
కళ్లంట జలజలా నీళ్లు. తను అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయాడు. ప్రేమ లేదు, పెళ్లి లేదు, మరో సంతోషమో, వ్యాపకమో లేదు. ఇంకా ఈ మానసిక రుగ్మత నయం కాలేదు. ఏమిచ్చింది జీవితం అన్నకు? రంగులన్నీ లాగేసుకుని గొంగళి పురుగుగానే గడపమన్నట్లు. తను ఉన్న ఈ పరిస్థితికి ఏ ధైర్యంతో అడగగలను, పెళ్లి చేసుకుంటావా? అని. లేదంటే, నేను చేసుకుంటానని ఎలా చెప్పగలను? ఈ స్థితిలో ఉద్యోగమెలా చేస్తున్నాడు? ఏం తింటున్నాడు? ఎలా ఉంటున్నాడు? అన్నను అలా చూస్తూ నేలపై కూలబడి ఏడ్చేశాను, ఎంత సమయమో గుర్తు లేనంతగా. నాలుగు గోడల మధ్య, అన్న నిద్రా విగ్రహం పక్కన, నా కళ్లు నేలను తడిపాయి, నా గొంతు ఎండింది.
ఓ నిర్ణయం తీసుకున్నాక లేచి నిల్చున్నాను. ఇకపై అన్నను ఇలా వదిలేయకూడదు. అన్నతోపాటే ఉండాలి. అన్నకు ట్రాన్స్ఫర్ చేయించో, లేదంటే నేనే బిజినెస్ ఇక్కడికి మార్చుకునో, ఒకేచోట బతకాలి. వాడిని బాగా చూసుకోవాలి. రెండు మూడేళ్లు చిన్నవాడిని, ఏం అన్నకు అన్నను కాలేనా! అమ్మా, నాన్ననై చూసుకోలేనా! నాకంటూ మిగిలిన కుటుంబం వీడే కదా, వీడినొదిలి ఎక్కడికీ ఈ పరుగు..!వాడిచేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఓ కన్నీటి చినుకు తన చేతిని తడిపింది. మెల్లగా కళ్లు తెరిచి నన్ను చూశాడు.
– పొన్నాడ వెంకట అన్నాజీరావు 94411 21556