‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
“మావ.. ఓ కొంరయ్య మావ”.. అని పిల్సుకుంట ఆకిట్ల అడుగువెట్టింది లచ్చవ్వ.
లోపలి నుంచే..
“ఎవలూ..?” అని కేకేసింది బుచ్చవ్వ.
ఎంబడే..
“నేనే అత్తా! లచ్చవ్వను” అని అనంగనే.. సాయబాన్ల తోముతున్న బోల్లను పక్కనపడేసి..
“నువ్వేనా కోడలా! మావ చేన్ల నుంచచ్చి ఇప్పుడే కల్లుబొట్టుకని మండువకు వేయిండు” అని అనుకుంటనే.. బుచ్చవ్వ ముందటర్రలకు వచ్చింది. బుచ్చవ్వను చూడంగనే గలుమ దాటి లోపలికి వచ్చి..
“మావ వచ్చేటాల్లకు ఎంత సేపైతదత్తా?” అడిగింది లచ్చవ్వ.
మూలకున్న పీటలు తీసి.. ఒకటి తనేసుకుని,
మరొకటి లచ్చవ్వకిస్తూ..
“ఎందుకు? ఏం పని?” అంటూ అడిగింది బుచ్చవ్వ.
“ఏం లేదత్తా! వారం కిందనే మావకు జెప్పిన. నాగళ్లు కట్టాల్నని. శెర్ల బుడ్డ శెనగ ఏసేదుంది. మల్లో తేప యాది జేద్దామని..” అంటూ లచ్చవ్వ అసలు ముచ్చట జెప్పింది. మళ్లేదో చెప్పవోతుండగనే అడ్డంపడి..
“మావ ఏం మరిచిపోలె. చేన్ల నుంచి అచ్చుడుతోనే జెప్పిండు. కొడుకు మహేందర్ గాన్ని సుత ఎటుపోవద్దన్నడు. మావ మాటంటే మాటే! ‘వత్తా’ అన్నడంటే వత్తడు” అంటూ బుచ్చవ్వ నమ్మకంగా బదులిచ్చింది. ఆ మాటలినంగనే లచ్చవ్వకు పాణం తిరిగచ్చింది.
“సరే అత్త! పొద్దున్నే ఇత్తునాలు దీస్కొని వత్తనన్నదని మావకు జెప్పు. మనుమడు ఒక్కడే ఉన్నడు ఇంటికాడ. నేను పోతున్న” అంటూ లచ్చవ్వ లేవంగనే..
“ఎప్పుడూ ఇట్లచ్చి అట్ల పోతవ్. రాజిగాడు ఏం జేత్తాండు” అని అడిగింది బుచ్చవ్వ. ఆ మాటతో గట్టిగా నిట్టూర్చుతూ..
“ఏనాడు ఏం పన్జేసిండు గనుక. ఉన్నంత కాలం అయ్యవ్వను గోస పుచ్చుకున్నడు. ఇప్పుడు నన్ను చంపుకతింటాండు. అడ్డశారగం పని చెయ్యడు. ఎప్పుడూ అరుగుల మీద కూసునుడు. అచ్చెటోన్ని.. పోయేటోన్ని బీడీలు అడుక్కుంట తాగుడు. యాల్లకు తినుడు. పండుడు. ఆడదాన్ని ఎంతగనం ఏగియ్యాలె. ఏనాడు జేసుకున్న పాపమో!? నా గండాన దాపురించిండు”.. మొగుడు రాజయ్యను తిట్టుకుంటూ, గుడ్ల నీళ్లు గుడ్లల్లనే ఒత్తుకుంట..
“సరే అత్త! మావకైతే జెప్పు” అని మల్లోతేప చెప్పి, ఇంటిబాట పట్టింది లచ్చవ్వ.
ఇంటికి చేరంగనే రాజయ్యకు, మనుమడు రాజుకు అన్నం పెట్టింది. తనూ రెండుముద్దలు తిని నడుం వాల్చింది. కళ్లు మూసుకున్నదే కని నిద్రవడ్తలేదు. మంచంలనే అటూ ఇటూ బొర్రుతాంది. మరోవైపు గుర్రు కొడుతున్న రాజయ్యను చూడంగనే పెయ్యిమీద ఒక్కసారి తేళ్లు, జెర్రులు పాకినంత కంపరం పుట్టింది లచ్చవ్వకు..
‘నిరందిగా ఎట్ల నిద్ర వడుతున్నదో!?’ అని లోలోపల్నే తిట్టుకుంటూ, మొఖం పక్కకు తిప్పుకొన్నది. మళ్లా ఆలోచనల వడ్డది.
‘నాది ఏం రాత.. ఏం జెట్ట బతుకు. అవ్వయ్యలకు ఒక్కగానొక్క బిడ్డనైతి. అరికాలుకు మట్టంటకుంట చేతుల మీదుగనే పెరిగితి. పెండ్లీడుకు రాంగనే భూమిజాగలు, డబ్బు దస్కమున్నదని జూసి రాజయ్యకు ఇచ్చి పెండ్లి జేత్తే.. ఆ సంసారం మూణ్నాళ్ల ముచ్చటాయె. బతుకు అడివిల పడ్డట్టాయె.
మొగడు ఈసంకొత్త పన్జేయడాయె. ఊర్ల రాజకీయాలు చేసుకుంట.. పంచాయితీలు చెప్పుకుంట.. పత్తాలు ఆడుకుంట సాయితగాళ్లతోని గల్సి తిర్గమరిగిండు. బిడ్డ కమల పుట్టినంకా ఇంటిముచ్చట పట్టించుకోకపాయె. ఇంటికి పెద్దదిక్కులెక్క ఉన్నరనుకున్న అత్తమావలు నడిమిట్లనే ఆగం జేసిపాయె. చేన్ల పాము కర్సి మావ, ఆ మనాదితో ఏడాది తిర్గకముందే అత్తా నన్ను ఒక్కదాన్ని జేసి ఇడ్సిపాయె. అవ్వయ్య పోయినంకైనా మారుతడనుకుంటే మొగుడు పురంగ ఏగిడిశిపాయె. ఇదేందని నోరు మెదిపితే చాలు ఈపు మెదిపే. బిడ్డను జూసుకుంట బతుకుదామంటే అదీ నడమంత్రాన్నే పాయె. పెండ్లి జేసిన ఏడాది తిర్గకముందే మొగపిలగాడు ఆయెనని సంబుర పడుతుండగనే.. తెల్లకామిండ్ల రోగం పాడుగాను ఏం దెల్వకుంటనే అల్లుణ్ని కొంటపాయె. బిడ్డన్న ఉన్నదనుకుంటే.. అదీ మొగుని మనాది పెట్టుకుని బాయిలవడి సచ్చె. కొడుకును, మమ్ముల ఎటుగానోళ్లను జేసె. ఏ జన్మల ఏ పాపం జేసుకున్ననో!? నా నొసట ఈ రాత రాసిండు. ఇదేం చాకిరి. ఎన్నడు తీర్తదో. నన్నెప్పుడు కొంటవోతడో ఆ దేవుడు’.. అని రందిపడుతూ, కనుకొలుకుల నుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నది. లచ్చవ్వ కండ్లల్ల కమల మొఖం కదలాడ్తంది. మనసంతా బిడ్డ జ్ఞాపకాలు కమ్ముకున్నయ్.
ఉన్నట్టుండి ఒక్కసారిగా లచ్చవ్వ ఆలోచనలు బుడ్డ శెనగ మీదికి మళ్లినయ్.
‘శెర్ల నాలుగెకరాల భూమి తప్ప అత్తమావలు సంపాయించిన భూమి మొత్తం పదేండ్లు తిర్గకముందే.. మొగడు హారతికర్పూరం జేసె. అయినా ఓ బర్రెను కొని పాలు, ఇన్ని కోళ్లను పెంచి అమ్ముకుంగ, ఇంటి చుట్టున్న నాలుగ్గుంటల జాగలనే ఇన్ని కూరగాయలను పెట్టుకుని పొట్ట గడుపుతున్న.. ఆ బుడ్డ శెనగలే ఎయ్యకపోతే సంసారం రోడ్డున పడుతుండె. అదేమన్నా అల్కగయితందా. పంట శెనగలు ఇంటికి రాంగనే ఇత్తునం కోసం మంచి గింజలన్నీ ఏరి తీసి పెట్టి, మట్టిపెళ్ల లేకుంట, ఒక్క పుల్ల కనవడకుండా చెరిగి.. ఇంత బూడిద కలిపి పురుగు పట్టకుంట అమాసకొకసారి ఎండవోసుకుంట కాపాడాల్నాయె. అదేమోగానీ శెర్ల నీళ్లు ఇంకుడు మొదలై కొద్దికొద్దిగా భూమి తేలుతుంటే.. ఎప్పటికప్పుడు భూమిని పదునారక ముందే దున్నుతూ, సంక్రాంతికి పూతచ్చేలా అదును చూసుకుని ఇత్తునమేయాలె. ఏమాత్రం అదును తప్పినా, పదునారిపోయినా.. ఆ ఏడాది గుండుసున్నేనాయె. అట్ల ఇగురం కొద్ది.. అన్ని ముందుగనే తయారు పెట్టుకుని, ఎంటబడి జేసుకుంటే తప్ప పంట పండదాయె. తిట్లకు బయపడి బల్మీటికి కల్లం కావలి పోతడు గనీ.. మొగడు ఒక్కచారగం చేయడాయె. ఒక్కదాన్ని ఎంతగనం జేసుడు. పోయినేడు అదును మీదేసినా పంట మంచిగ పండకపాయె. ఏటా 30 బత్తాలు వచ్చేకాడ 20 బత్తాలే వచ్చె. ఈ ఏడు ఎట్లుంటదో ఏందో!?’.. అని గుబులు పట్టుకున్నది లచ్చవ్వకు. అట్లా అట్లా ఏవో ఏవో ఆలోచిస్తూ అద్దుమరాత్రి నిద్రలోకి జారుకుంది.
తెల్లారి కోడి కూతతోనే లేచింది లచ్చవ్వ. ఆకిలి జారగొట్టింది. బోళ్లు తోమి కూర, బువ్వ అండింది. ఆదరాబాదరా ఇంత తిని, సద్దిపెట్టుకుని.. మనుమణ్ని ఎంబడేసుకుని కొంరయ్య ఇంటికి జేరింది. అప్పటికే కొడుకుతోని కల్సి ఎడ్లను నాగలికి కడతాండు కొంరయ్య. అది చూడంగనే లచ్చవ్వ మనసు నిమ్మలమైంది.
“మావ మేం శెర్లకు నడుత్తానం” అంటూ చెప్పి ముందుకు కదిలింది.
శెరువుకట్టపైకి జేరింది. కట్టమైసమ్మకు మొక్కి భూమి దిక్కు నడిచింది లచ్చవ్వ. అంతా నల్లరేగడి. కాల్లకు అతుకుతంటే..
‘ఇంకా పదునారలె బాంచెన్!’ అని మనసులోనే అనుకున్నది.
లచ్చవ్వ ఎనకనే కొంరయ్య గూడ అక్కడికి జేరిండు. ఎంబడి దెచ్చుకున్న కొబ్బరికాయ దీసింది లచ్చవ్వ. చేతుల పట్టుకొని మంచిగ మొక్కి నాగలి మీద కొట్టి పక్కకు జరిగింది. కొంరయ్య నాగలి పట్టుకుని ముందుకు కదలగా.. ఎన్కనే గింజలు ఏసుకుంట సాలువట్టి సాగింది. వారం రోజుల్లోనే ఇత్తునమేసుడు అయిపోయింది. సంక్రాంతి రానే వచ్చింది. శెనగ మస్తు పూతకచ్చింది. గొడ్డుగోదా పడి మేయకుండా పెండ్లాం బల్మీటికి రాజయ్య రోజూ కావలివోతండు. సూత్తాంటనే పంట చేతికచ్చింది. రెండు రోజులు నలుగురు కూలోళ్లలను దీస్కపోయి శెనగ పీక్కచ్చింది. ఊరవతల పెద్ద బండపైన కల్లం ఏసింది. బంతి కొట్టించి, తూర్పార పట్టింది. కుప్ప జేసిన శెనగలను జూసి లచ్చవ్వ మనసు నిండిపోయింది. బత్తాలు నింపేటాళ్లకు ఏటా వచ్చినట్లు కాకుండా ఈసారి 10 బత్తాలు ఎక్కువ పండినయ్. లోలోపల సంబురమైతున్నా బైటికి మాత్రం ఎప్పటితీర్గనే మొఖం పెట్టుకుని ఉన్నది లచ్చవ్వ. ఇగ నాగళ్లు కట్టినందుకు, బంతికొట్టినందుకు కొంరయ్యకు, వచ్చిన కూలోళ్లకు కల్లంలనే శెనగలు కొలిసిచ్చింది. బత్తాలను ఇంటికి దెచ్చుకున్నది. లచ్చవ్వకు మనసు నిమ్మలమైంది.
పైసలు ఏడ కమాయిస్తడోనని మొగడు రాజయ్యను నమ్మక.. రెండు రోజుల తరువాత ఎప్పటితీర్గనే పది బత్తాలను ఉంచుకుని, మిగతా శెనగబత్తాలను తనే మార్కెటుకు దీస్కపోయింది. లచ్చవ్వ అదృష్టం మంచిగున్నది. పోయినేడుకన్నా ఈ సారి ధర ఎక్కువే పలికింది. 40వేల దాన్క వచ్చినయ్. ఎంబటే ఇంటిముందు సుబ్బయ్య యాదికచ్చిండు. తన పెండ్లిగాక ముందు అత్తమావలు కట్టిన ఇల్లు. పరాటంతా చీకిపోయి, పెంకులన్నీ ఇరిగిపోయినయ్. వానపడితే చాలు మొత్తం ఉర్సుడే. అయినా ఏ ఏడుకాయేడు ఎల్లదీస్కుంట వచ్చింది. కానీ పోయినేడు వానకాలం ఇంటిపైకప్పు మొత్తం కూలిపోయింది. నెలరోజుల పాటు బర్రె కొట్టంల తలదాసుకున్నరు. వానకాలం ఎల్లినంక కాళ్లా వేళ్ల పడి సుబ్బయ్య దగ్గర 25వేల అప్పు దీస్కచ్చింది. పాలమ్మి, కోళ్లమ్మి కూడబెట్టిన పైసలు కలిపి మంచిగ రేకులు ఏసుకున్నది. ఇల్లు మంచిగయ్యింది. కాలం కలిసచ్చింది. ఇప్పుడు పంట నిరుటికన్నా ఎక్కువే పండింది. సుబ్బన్న బాకీ తీరిపోతదని లోపల్లోపల సంబురపడుకుంట.. మనసులనే కోటి దేవుళ్లకు మొక్కుకుంట ఇంటికచ్చింది. పైసలన్నీ బట్టల్ల చుట్టి సందుగడుగున పెట్టింది. సంబురంగా మొగునికి ముచ్చట జెప్పింది. కోటంచ నర్సింహసామికి కోడ్ని కోద్దామన్నది. ఎంబడే..
“ఎప్పుడు ఏదడిగినా ఎన్కకు దీయకుంట సాయం జేత్తడు. కొంరయ్య మావను కూడా సాయంత్రం ఈడికే తినేతందుకు రమ్మంట” అని అనంగనే సరేనన్నడు రాజయ్య.
అంతే..
“తెల్లకల్లు పట్టుకురాపో” అంటూ పైసలిచ్చి రాజయ్యను మండువకు తోలింది.
బడి నుంచి అప్పుడే వచ్చిన మనుమని తలను సంబురంగా నిమిరి..
“ఎటూ తిరగపోకు. నేను అచ్చెదాన్క ఇంట్లనే ఉండు. కొంరయ్య తాత దగ్గరికి పోయత్త” అని చెప్పి.. బైటికి నడిచింది లచ్చవ్వ.
కొంరయ్య దగ్గరికి పోయి ఇంటికి వచ్చేటాల్లకు తలుపులన్నీ తెర్లవెట్టి ఉన్నయ్. మనుమడేమో లేడు. ఆదరాబాదరాగా సందుగ దగ్గరికి వోయింది. తెరిచి చూసింది. ఒక్కసారి కాళ్ల కింది భూమి కంపించినట్లయింది. పైసలు కనిపించకపోవడంతో గుండె ఆగిపోయినంత పనైంది. ఆగమాగమైంది. సందుగలున్న బట్టలన్ని కిందపడేసి దేవులాడింది. లచ్చవ్వకు దుఃఖం పొంగుకత్తంది. ఇల్లంత, మూలమూల జూసింది. ఎక్కడ ఏం కనవడకపోయేటాల్లకు గుండెలు బాదుకుంటూ వచ్చి గలుమల కూసోని కంటికి మంటికి ధారగా ఏడుత్తంది. లచ్చవ్వ పెడుతున్న శోకాలు ఊరవతలికి ఇనవడుతున్నయ్. అమ్మమ్మ ఏడుపిని ఎక్కణ్నుంచో పరుగుపరుగున ఉరికచ్చిండు పిల్లగాడు. మనుమణ్ని జూసుడు జూసుడే ఒక్క ఉదుటున లేచి మీదపడింది.
“ఇంట్లనే ఉండుమన్న గదా! ఏడవోయినవ్? ఎవలచ్చిన్రు? పైసల్ ఎవలెత్తుక పోయిన్రు? నీ తాడు తెంప! నా గండాన కని పారేసింది!” అని ఇయ్యరమయ్యర కొడుతూ.. దుఃఖాన్ని వెళ్లదీస్తున్నది లచ్చవ్వ. అప్పటికే అక్కడున్న ఇంటెనుక ఈరమ్మ..
“పోరన్ని కొట్టి సంపుతవా ఏంది?” అంటూ రాజును పక్కకు ఇగ్గిపడేసింది.
“పిలగా! ఇంటికాడ ఉండక ఏడ తిర్గవోయినవ్?” అంటూ కోపం జేసుకుంటూ వెళ్లి, లచ్చవ్వను గుండెలకు అదిమి పట్టుకుంది.
“ఊకో బిడ్డా! ఈ పన్జేసింది బైటోళ్లు ఎవలు కాదు బిడ్డ. తెల్సినోళ్లే ఈ పని జేసిండ్లు. అందరిండ్లు వదిలి నీ ఇంట్లకే వచ్చి పైసలెట్ల ఎత్కపోతరు. నీ ఇంట్ల పైసలున్నయని ఈ వాడోనికి, ఈ సుట్టుపక్కల ఉన్నోనికి దప్ప ఎవనికి దెల్సు? నీ రెక్కల కట్టం దీస్కున్న ఆని చేతులకు జెట్టలుపుట్ట! ఆ పైసలతోని వాడేం పెద్దగయితడు..” అంటూ శాపనార్థాలు పెట్టింది.
“దుబ్బబుక్కి, ఉప్పిడి పాసముండి, నిద్ర సంపుకొని, రెక్కలు ముక్కలు జేసుకుని సంపాయించుకున్న పైసలు. ఏడ వోవు. ఏం కాదు బిడ్డ!” అంటూ లచ్చవ్వకు ధైర్యం చెప్పింది. ఎంబడే..
“పంబాల రామయ్యతోని మంత్రబియ్యం పెట్టిద్దం. పైసలవే బయటపడ్తయ్” అంటూ నమ్మకంగా జెప్పింది ఈరమ్మ. అక్కడున్న వాళ్లంతా ఈరమ్మకు వంతపాడిన్రు. పైసలు దొర్కుతయనే ఆశతో లచ్చవ్వ సుత..
“సరే” అన్నది.
“అయితే నువ్ ఊర్ల చాటింపు చేయించు. నేను రామయ్యకు ముచ్చట జెప్పి వత్త” అంటూ ఈరమ్మ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎక్కడోళ్లు అక్కడ పోయినంక మెల్లగా లేచింది లచ్చవ్వ. కంటికి రెండుధారలు కారంగా, బిక్కుబిక్కుమంటూ దూరంగా కూర్చున్న మనుమని దగ్గరికిపోయి నెత్తిమీద చెయ్యేసి నిమిరింది.
“సపాయి సారయ్యను దీస్కరాపో!”.. అని అమ్మమ్మ చెప్పంగనే మారుమాట్లడకుండ లేచి ఉరికిండు రాజు. అట్ల పోయి ఇట్ల ఎంబడి వెట్టుకుని దీస్కచ్చిండు. ఏం జేయ్యాల్నో జెప్పి సారయ్య చేతుల 50 రూపాయలు పెట్టింది లచ్చవ్వ. ‘సరే!’ అంటూ ఇంటికి పోయి, డప్పు పట్టుకుని వచ్చిండు సారయ్య. వాడకట్టు మొదలునుంచి చివరివరకూ డప్పుకొట్టుకుంటూ..
“లచ్చవ్వ ఇంట్ల పైసలు పోయినయ్! రేప్పొద్దున మంత్రబియ్యం పెట్టిపిత్తాంది. వాడకట్టులున్న చిన్నా, పెద్దా అందరూ రేప్పొద్దున లచ్చవ్వ ఇంటికాడికి రావాల్నహో!” అని చాటింపు జేసి పోయిండు. లచ్చవ్వ ఏం తినకుంటనే మంచాల ఒరిగింది. కంటికి ధారలు పోతనే ఉన్నయ్.
‘పైసలున్నయని ఎవలకు దెల్సు? ఎవలు దీసుంటరు? గంటలనే ఎట్ల మాయం జేసిండ్లు?’ అని ఒకసారి ప్రశ్నలు వేసుకుని ఆలోచించినా, జవాబు దొర్కలె. మొగడు రాజయ్యను అనుమానించినా..
‘ఈన పొద్దున్నే ఎవలిదో పంచాయతీ ఉన్నదని పర్కాల పాయె. ఇప్పుడే వచ్చె’ అని తను కాదని నిర్ధారించుకున్నది. తికమక పడుతూ..
‘పైసలు దొర్కుతయా? దొర్కయా? దొర్కపోతే ఎట్ల? సుబ్బన్న బాకీ ఎట్ల కట్టాలె? మాటవోతది! మల్లచ్చేటికి ఇద్దామన్నా.. మిత్తి ఎంత గావాలె?’ అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటున్నది లచ్చవ్వ. మనసంతా అవే ఎడతెగని ఆలోచనలు. కంటిమీద రెప్ప మూయకుండ అట్లనే తెల్లవార్లు ఆలోచించుకుంట కూసున్నది.
ఏడ్చి ఏడ్చి ముఖం గుంజుకుపోయింది. నిద్రలేక కండ్లు ఎర్రవడ్డయ్. పొద్దున తొమ్మిది గంటలకు పంబాల రామయ్యను ఎంబడేసుకుని వస్తున్న ఈరమ్మను చూడంగనే లచ్చవ్వకు పాణం లేచివచ్చింది. అప్పటికే వాడకట్టోళ్లు కూడా శానమంది వచ్చి కూసున్నరు అక్కడ. ఈరమ్మ, రామయ్య ఇంట్లకు పోయిన్రు. లచ్చవ్వను అడిగి జరిగిన విషయం తెల్సుకున్నడు పంబాల రామయ్య. అంతా విన్న తరువాత..
“ఒక కుంచెడు బియ్యం, అట్లనే దేవుని పోట్వ, పీట, పసుపు, కొంచెం నూనె, ఒక పల్లెం, దీపం చెమ్మ దీస్కరా తల్లి” అంటూ లచ్చవ్వకు చెప్పిండు. అడిగినయన్నీ దీస్కచ్చి ముంగట పెట్టంగనే.. రామయ్య తన పనిల వడ్డడు. గోడకు పీటేసి దేవుని పోట్వ నిలబెట్టి, దీపం ముట్టించిండు. కుంచంలోంచి పల్లెం నిండా బియ్యం దీస్కున్నడు. పసుపు, నూనె కలిపిండు. అరగంటపాటు ఏవో మంత్రాలు చదువుతూ పూజలు జేసి, పళ్లెం దీస్కుని ఇంట్ల నుంచి బయటికి వచ్చిండు రామయ్య. ఇంటోళ్లందరినీ బయటికి రమ్మన్నడు. ఎదురు దర్వాజా తలుపులు మూసి, పక్క దర్వాజ తలుపులు మాత్రమే తెరచి పెట్టమన్నడు. రామయ్య చెప్పినట్టుగనే చేసింది లచ్చవ్వ. తర్వాత వాడ కట్టోళ్లందరినీ దగ్గరికి పిల్సుకుని..
ఇంటి తలుపులన్నీ పెట్టి ఉన్నయ్. లోపలున్న మనిషి ఎవలికీ కనిపించడు. ఒక్కొక్కలు వచ్చి మంత్రిచ్చిన ఈ పసుపు బియ్యం దీస్కోండి. ఆ ఇంట్లకు పోయి దేవుని పటం ముంగట వేయండి. ఇక్కడ ఒక్క మాట. లచ్చవ్వ పైసలు ఎవలు దీసిండ్లో మీ అంతట మీరే మంచిగ ఆడ కుంచంల ఉన్న బియ్యంల పెట్టుండ్రి. లేకుంటే రక్తం కక్కుకొని సత్తరు. పాపం ఏడేడు తరాలకు గొడ్తది. ఆడ మీరు పైసలు పెట్టిండ్లనే సంగతి ఎవలికీ దెల్వదు.
“ఇంటి తలుపులన్నీ పెట్టి ఉన్నయ్. లోపలున్న మనిషి ఎవలికీ కనిపించడు. ఒక్కొక్కలు వచ్చి మంత్రిచ్చిన ఈ పసుపు బియ్యం దీస్కోండి. ఆ ఇంట్లకు పోయి దేవుని పటం ముంగట వేయండి. ఇక్కడ ఒక్క మాట. లచ్చవ్వ పైసలు ఎవలు దీసిండ్లో మీ అంతట మీరే మంచిగ ఆడ కుంచంల ఉన్న బియ్యంల పెట్టుండ్రి. లేకుంటే రక్తం కక్కుకొని సత్తరు. పాపం ఏడేడు తరాలకు గొడ్తది. ఆడ మీరు పైసలు పెట్టిండ్లనే సంగతి ఎవలికీ దెల్వదు. ఆ తరువాత మీ ఇష్టం!” అంటూ అందరినీ మాటలతోనే హడలగొట్టిండు. ఒక్కొక్కరినీ పిలుచుకుంటూ చేతిలో బియ్యం పెడుతూ ఇంట్లోకి పంపుతున్నడు. మధ్యాహ్నం రెండు గంటల వరకు వాడల ఉన్నోళ్లందరూ వచ్చిపోయిండ్లు. తలుపులు దీస్కొని రామయ్యతోపాటు లచ్చవ్వ, రాజయ్య, ఈరమ్మ అందరూ ఇంట్లకు పోయిండ్లు. రాజయ్య వైపు చూస్తూ కుంచంల ఉన్న బియ్యం కింద పోయమన్నడు రామయ్య. కుంచం పైకెత్తి చిన్న ధారగా బియ్యం పోస్తున్నడు రాజయ్య. కుంచంల నుంచి వస్తున్న బియ్యం ధారనే కన్నార్పకుండా చూస్తున్నరు అందరూ. లచ్చవ్వ గుండె వేగంగా కొట్టుకుంటున్నది. ‘పైసలు దొర్కుతయా? దొర్కయా?’ ఇదే ఆదుర్దా. ఒక్కసారిగా నాలుగు నోట్ల కట్టలు కిందపడ్డయ్. అందరిలో సంతోషం. సంబురంతో లచ్చవ్వ నోట మాట రావడం లేదు. కండ్లపొంటి నీళ్లు పొంగుకస్తున్నయ్. నోట్ల కట్టలను చేతులకు దీస్కొని వాటినే చూస్తూ నోట మాట రాక అట్లనే చూస్తున్నది.
మ్యాకం రవికుమార్
మ్యాకం రవికుమార్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా జమ్మికుంట. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ‘మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్’ చేశారు. వృత్తిరీత్యా పాత్రికేయులు. ప్రవృత్తిరీత్యా కథకులు. 2013 నుంచి కథలు రాయడం ప్రారంభించారు. మొదటి కథ ‘బలిదానం’ తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 18 కథలు రాశారు. ‘ఎదురు చూపులు’, ‘జిట్టపులి’, ‘కంటెగోడ’, ‘గొల్ల మల్లన్న’, ‘యాపచెట్టు’, ‘సుక్కబర్రె’ కథలు పాఠకుల ప్రశంసలు అందుకున్నాయి. 11 కథలు వివిధ ప్రముఖ దిన, మాస పత్రికల్లో అచ్చయ్యాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలన్నీ.. మట్టి మనుషుల యథార్థ జీవితాలను కండ్లకు కడుతాయి. సాహిత్య సేవలో భాగంగా 2014లో నోముల సాహిత్య పురస్కారం అందుకున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీల్లో.. 2019లో ‘సుక్కబర్రె’, 2021లో ‘బుడ్డ శెనగ’ కథలకు బహుమతులు దక్కించుకున్నారు.
మ్యాకం రవికుమార్
94929 10065