‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
నాణ్యమైన చదువు అందరికీ ఇంకా అందలేదు కదా! దానికి తోడు నిరుద్యోగం ముదిరితే.. రెండు వైపులా కాలే కొవ్వొత్తిలా యువత పరిస్థితి తయారవ్వుతుంది కదా! పదిమంది చేసే పని ఒక్కరే చేయవచ్చని భుజాలు ఎగరేసుకోవడం కాదు. ఏనుగు పాదాల కింద ఎన్ని చీమలు నలిగిపోతాయో.. ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, స్త్రీ వివక్ష, కులాల హెచ్చు తగ్గులు, మతాల విభేదాలు అవన్నీ కలగలిసి ప్రజల జీవితాల్ని ఇబ్బంది పాలుజేస్తాయా!? ప్రభుత్వమే కాదు, మనం కూడా దీర్ఘంగా ఆలోచించాలి..
“ప్రపంచం మారుతోంది..
మనం మారకుంటే మనకి మనుగడ ఉండదు. ప్రపంచమంతా కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తోంది. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది ఉత్తమాట.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఈరకం మాటలు మామూలే. కొత్త ఉపాధి మార్గాలు వస్తాయి. ఈ అపోహలు పటాపంచలవుతాయి. శాస్త్రీయ దృక్పథంతో, తక్కువ మానవ వనరులతో మనల్ని విజయపు అంచులకు తీసుకెళ్లే ఈ మేధ వల్ల మనకి సమయం ఆదా, వేగం, కచ్చితత్వం ఎక్కువ ఉంటుంది. నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు దీన్ని ఉపయోగించుకోకపోతే మనం మార్కెట్లో నిలబడలేం. కాదు కాదు.. అసలు మార్కెట్లోనే ఉండం” ఉపన్యాసం ఇస్తున్నాడు ధర్మకీర్తి.
కృత్రిమ మేధను ‘డే ఆఫ్ డిమాండ్’గా అభివర్ణిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణుడైన ధర్మకీర్తి తనదైన శైలిలో చెబుతూ ఉన్నాడు. ఓ పెద్ద కార్పోరేట్ సంస్థ తమ ఉన్నతాధికారులకు తిరుపతిలో ఒక స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం అది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో రకరకాల మోటివేషనల్ వీడియోలతో అదరగొట్టాడు. వంద నిమిషాల తరగతి పూర్తి అయ్యాక, అయిదు నిమిషాలపాటు ఒకే చప్పట్లు.
అద్భుతంగా చెప్పారని చాలామంది ధర్మకీర్తి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చారు. సెల్ఫీలు తీసుకున్నారు.
చక్కటి విందు అనంతరం రాత్రికి విడిది చేసే హోటల్ గదికి కారు ఏర్పాటు చేశారు.
కారు ఎక్కి కూర్చున్నాడు. కారు కదులుతోంది. వెనుక సీటులో కూర్చున్నాడు ధర్మకీర్తి.మొబైల్ తెరిచి మీటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలను తృప్తిగా చూసుకున్నాడు. కార్పొరేట్ సంస్థవారు ఇచ్చిన చెక్కు కరెక్టుగా ఉందో లేదో చూసుకుందామని కవర్ తెరిచి చూశాడు. వంద నిమిషాల క్లాసుకి వారిచ్చిన అక్షరాల లక్ష రూపాయల చెక్కులో అక్షరాలు, సంఖ్యలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకున్నాడు.
తన స్వంత ఊరు కామారెడ్డి అయితే, హైదరాబాద్‌లో స్థిర నివాసం. ఇలా కార్పొరేట్ సంస్థల అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఎక్కడ జరిగినా హైదరాబాద్ నుంచి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు సంస్థలే పెట్టుకుంటాయి. ఆంధ్ర, తెలంగాణాలలోనే కాదు, చెన్నై, బెంగళూరు, బొంబాయి, పూనా, కలకత్తాలలో కూడా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సంవత్సర ఆదాయం పాతిక లక్షల పైమాటే.
దారిలో పెద్ద ఆలయ గాలి గోపురం కనిపించింది.
ఆసక్తిగా గోపురాన్ని చూస్తూ ఉంటే, డ్రైవర్ కలుగజేసుకుని..
“ఇది గోవిందరాజ స్వామిగుడి సార్. వేంకటేశ్వర స్వామి అన్నగారు. ఇక్కడ స్వామి పడుకుని ఉంటారు. మూల విగ్రహం మట్టితో చేసి ఉండటం వల్ల ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు” అని చెప్పాడు.
“అలాగా”.. ఆసక్తిగా అన్నాడు ధర్మకీర్తి.
“అంతేకాదు సార్. ఈ గుడికి మంచి స్థల పురాణం కూడా ఉంది. అది ఏమిటంటే వేంకటేశ్వర స్వామి తన పెళ్లికోసం కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు కోసం వడ్డీని గోవిందరాజ స్వామి బల్ల (కొలత పాత్ర)తో బంగారు నాణేలను కొలిచి ఏరోజుకారోజు ఇచ్చేవాడు. అలా కొలిచికొలిచి ఎంత ఇచ్చినా అప్పు అలాగే ఉండి పోయింది. కొలిచి ఇచ్చిన గోవిందరాజస్వామి అలసి బల్లను తలకింద దిండులాగా పెట్టుకుని పడుకున్నాడని ఇక్కడ చెప్పుకొంటారు” అన్నాడు.
“అయితే కొండ మీది స్వామివారి అప్పు ఇంకా తీరలేదన్నమాట. ఆశ్చర్యం.. డబ్బు ఎంత విలువైనది. ఆ దేవదేవుడికి సైతం ఆ బాధలు తప్పలేదన్నమాట”
కారు టర్నింగ్ తిరుగుతోంది. ధబీమని ఓ ఆడమనిషి కారు ముందర పడింది.డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేసి కారు ఆపాడు.ఇద్దరు ఆడవాళ్లు గట్టిగట్టిగా అరుసుకుంటూ ఉన్నారు.
“నేను సాయంత్రమే పెట్టిపోయాను నా సంచి. నువ్వు దాన్ని తీసి పారేసి నీ దుప్పటి పరిచినావు. నీకు బుద్ధి ఉందా లేదా?” అని అడుగుతోంది ఒకామె.
“ప్రతి పండుగకీ నేను అక్కడే వ్యాపారం చేసుకుంటాను. నువ్వు నా స్థలంలోకి వచ్చి గుడ్డి దబాయింపులు దబాయిస్తా ఉండావు” అంటోంది తెల్లచీర కట్టినామె.
“ఏం జరుగుతోంది? అక్కడ” అని అడిగాడు ధర్మకీర్తి. కారు అద్దం దించి చూస్తే.. రోడ్డుకిరువైపులా పట్టలు, పేపర్లు, గుడ్డలు పెట్టి ఉన్నాయి.
“ఏమిటది?” అని డ్రైవర్‌ను మళ్లీ అడిగాడు.
“రేపు వినాయక చవితి సార్. పల్లెలనుంచి ఆకులు, మామిడి కొమ్మలు, అరటి ఆకులు, చెరుకు గడలు, పూలు, పత్రి, టెంకాయలు తెచ్చి అమ్ముకుంటారు. చుట్టు పక్కల ఉన్న పల్లెలనుంచి చాలామంది ఆడవాళ్లు ఈ పండుగలప్పుడు వచ్చి వ్యాపారం చేస్తారు. పెద్ద మార్కెట్లోకి వెళ్లి అమ్ముకోవడానికి కుదరదు. అందుకని రోడ్ల మీదే అమ్ముకుంటారు. ఆ రోడ్డు మీద ముందురోజు మధ్యాహ్నంనుంచే తమ స్థలాలను రిజర్వు చేసుకుంటారు. దానికి సంబంధించిన గొడవ ఇది”.
“మగవాళ్లు రారా?” అని అడిగాడు.
“ఎందుకు రారు, వస్తారు. అయితే ఆడవాళ్లే ఎక్కువ. భర్తలు చనిపోయినవాళ్లు, భర్తలు వదిలేసినవాళ్లు, ఆరోగ్యం సరిగా లేనివాళ్లు, ఎక్కువ కష్టం చేయలేనివాళ్లు ఎక్కువగా వస్తారు”
“రోజంతా వ్యాపారం చేస్తే, వారికి ఎంత వస్తుంది?”
“ఖర్చులంతా పోను వంద మిగిలినా సంతోషిస్తారు. మన హిందువులకి అటూఇటూ నెలకో పండుగైనా వస్తుంది కదా! పండుగ వచ్చిన ప్రతివారం వీళ్లకి పండుగే. సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి, విజయదశమి, బ్రహ్మోత్సవ శనివారాలు, దీపావళి, ఇంకా స్థానిక విశేషాల సమయాల్లో వీరు అంతో ఇంతో సంపాదించుకుంటారు”
“అలాగా!”
అప్పటికే హోటల్ వచ్చింది. కారు దిగి, లోపలికి వెళ్లాడు ధర్మకీర్తి. ఎందుకో.. సరిగా నిద్ర పట్టలేదు ధర్మకీర్తికి.
మంచం మీద పడుకుని దొర్లుతూనే ఉన్నాడు. బయట ఏదో గొడవగా అనిపిస్తే సిట్ అవుట్లోకి వచ్చాడు.
ఇద్దరు పిల్లలు గట్టిగట్టిగా అరుసుకుంటూ ఉన్నారు. జారుతున్న నిక్కరు ఎగేసుకుంటూ ఒకడు..
“ఒరేయ్! మా అమ్మకు ఒళ్లు బాలేదురా. గర్భసంచి తీసేశారు. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది. అన్నానికి కూడా కష్టంగా ఉంది. అందుకనే ఈరోజు బడికి శెలవు పెట్టి ఆకులన్నీ తెచ్చాను. ఈ ఒక్కరోజు నాకు ఈ స్థలాన్ని ఇవ్వరా”
“నీ కష్టాలు నువ్వు చెప్పినావు. మా కష్టాలు మాత్రం తక్కువగా ఉన్నాయా? నీకు మీ నాన్న అయినా ఉన్నాడు. మా నాన్న మమ్మల్ని వదిలేసి పదేండ్లు అయ్యింది. మా అమ్మకి పక్షవాతం వచ్చింది. పది ఫెయిలై, పది రూపాయల నోటు కనిపించబోతుందా!? అని అల్లాడుతూ ఉన్నాను. నువ్వు ఎక్కడైనా వేరే స్థలం చూసుకో..” అని చెప్పి కట్టె తీసుకుని తరిమాడు ప్యాంటు వేసిన పిల్లవాడు. ఏడ్చుకుంటూ వేరే స్థలాన్ని వెదుక్కుంటూ పరుగులు తీశాడు నిక్కరేసిన పిల్లవాడు.
‘పేదరికం కన్నా పెద్దరోగం ఏదీ లేదుకదా..’ అని ధర్మకీర్తి మనసు మూగగా మూల్గింది. ‘తెలివి తక్కువైన వాడిని తెలివైన వాడు, బలం, బలగం లేనివాడిని బలవంతుడు, అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడిని, డబ్బున్నవాడు డబ్బులేని వాడిని దోపిడీ చేయడం మామూలే కదా..’ మంచం మీద వాలాడు. ఫ్యాను గిర్రున తిరుగుతోంది. ఆలోచనలు వెనక్కి వెళ్లాయి. కామారెడ్డిలో తోపుడు బండి మీద అరటి పండ్లు అమ్ముకునే నాన్న గుర్తుకొచ్చాడు.
“బండిని అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు.. ట్రాఫిక్‌కి అడ్డం” అని పోలీసులు అరుస్తూ ఉంటే, బండిని నాన్నతో పాటు జనం లేని చోటికి తీసుకెళ్లడం గుర్తుకొచ్చింది. వానొచ్చినా వ్యాపారం లేక పండ్లన్నీ మిగిలిపోయేవి.
‘ఏమి చేసేదిరా భగవంతుడా..’ అని అమ్మ ఆ పండ్ల మీదపడి ఏడవటం గుర్తుకొచ్చింది. ఇరుగుపొరుగుకు ఉచితంగా పంచిన రోజులున్నాయి. ఇంకా మిగిలితే వీధుల్లో తిరిగే ఆవులకు తినిపించిన సందర్భాలున్నాయి. అన్నం చేసుకోవడం ఆపేసి అరటిపండ్లు తిని పడుకున్న ఎన్నో
పూటలున్నాయి.
“మనకి ఎవ్వరూ లేరు కదా.. ఆదుకోవడానికి” అని అంటే..
“ఎవ్వరూ లేకేమి మనకి. పగలైతే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు ఉన్నారు కదా” అని ధైర్యం చెప్పిన నాన్న కళ్లలో మెదిలాడు. ఉదయం అయిదు అయ్యింది. కారు డ్రైవర్ నుంచి ఫోన్. రాత్రంతా కలత నిద్ర వల్ల ఒళ్లు అలసినట్లు ఉంది. చిన్నగా లేచి ఫోన్ తీశాడు.
“సార్! విమానాశ్రయానికి ఆరుకంతా వెళ్లాలి. మీరు సిద్ధమై కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేయండి” అని.గబగబా లేచి స్నానం చేసి, లగేజీ సర్దుకుని కారులో కూర్చున్నాడు. కారు బయలుదేరింది.
మూడు నిమిషాలకంతా మునిసిపల్ ఆఫీస్ దగ్గర ఉండే నాలుగు రోడ్ల కూడలి వచ్చింది. వందలాది జనం అక్కడ ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు నిలబడి ఉన్నారు. గడ్డం పెంచినోళ్లు, లుంగీలు కట్టినోళ్లు, అన్నం డబ్బాలు చేతిలో పెట్టుకుని ఉన్నారు. కొందరి కాళ్లకు చెప్పులున్నాయి. మరికొందరి కాళ్లు బోసిగా ఉన్నాయి.
“ఎవరు వాళ్లు?” అడిగాడు ధర్మకీర్తి.
“కూలీలు సార్” అద్దం దించి చూశాడు ధర్మకీర్తి. బిడ్డల్ని ఎత్తుకుని ఉన్న ఆడవాళ్లు కూడా కనిపించారు.
“ఇలాంటి కూడళ్లు చాలా ఉన్నాయి సార్ పట్టణంలో. తెల్లారి అవుతుందో.. లేదో.. నాలుగు గంటలకంతా పనులకోసం ఆడామగా వచ్చి ఇక్కడ నిలబడతారు. పనులకు పిలిచేవారి కోసం ఎదురుచూస్తూ నిలువు కాళ్ల కొలువు చేస్తారు. పని దొరికితే కూలీ, లేకుంటే కడుపు ఖాళీ. దళారీల దౌర్జన్యాలు లేకపోలేదు”
“వీరి యాస ఇక్కడి వారిదిలా లేదే!”
“కూలీలంతా ఇక్కడివారే కాదు సార్. ఈ జిల్లా వారితోపాటు కర్నూలు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్లు. వీరిలో తమిళులు కూడా లేకపోలేదు”
“రోజూ జనం ఉంటారా?”
“ఆదివారాలు తెలియనోళ్లు సార్ వాళ్లు”
డ్రైవర్ వైపే చూస్తూ..
‘ఆకలికీ, అన్నానికీ మధ్య ఎన్ని పోరాటాలో..’ అని బాధపడ్డాడు ధర్మకీర్తి.
ఇంతలో..
రోడ్ డివైడర్ దగ్గరికి జనం పరుగులు తీస్తూ ఉన్నారు. క్షణాల్లో జనం అక్కడ గుమికూడారు.
“ఏమయ్యింది?” అని కారు దిగాడు ధర్మకీర్తి.
ఆరు పదులు నిండిన ముసలి ఆవిడ కళ్లు తిరిగి అక్కడ పడి ఉంది. తెల్లచీర కట్టిన బక్కచిక్కిన మనిషి. కట్టె పుల్ల ఒళ్లు, ఎండిన రొమ్ములు, గొంతు దగ్గర ధైరాయిడ్ వాపు.. పిడుగు పడిన తాటిచెట్టు నేల మీద పడినట్లు ఉంది.
వాళ్ల ఊరి వాళ్లెవ్వరో..
“అవ్వా.. లెయ్ అవ్వా!” అని అరుస్తూ ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు నీళ్లు చల్లి ఆమెను లేపే ప్రయత్నం చేస్తున్నారు.
“నిన్న మధ్యాహ్నం నుంచి తిండి లేదంట. కూర్చున్న చోటునుంచి లేచిపోతే వేరే వాళ్లెవరైనా వచ్చి స్థలాన్ని ఆక్రమించుకుంటారేమో! వ్యాపారం జరగదేమో!? అని కూర్చున్న స్థలం దగ్గర ఓ సంచి పట్టుకుని అక్కడ నుంచి లేవనే లేదట. ఆకలిదప్పులకు సైతం..” ఎవరో
అంటున్నారు. అది విన్న ధర్మకీర్తి మనసు వలయాలు వలయాలుగా చిట్లి పోయింది. అక్కడే శిలలా నిలబడిన ధర్మకీర్తిని..
“మనం ఆలస్యం చేస్తే ఫ్లయిట్ మిస్ అవుతుంది సార్” అని చెప్పి, బలవంతంగా అక్కడినుంచి కదిలించాడు డ్రైవర్.
విమానం ఎక్కి సీటు బెల్టు పెట్టుకుంటూ ఉంటే.. చొక్కా జేబులోని లక్ష చెక్కు తళుక్కున మెరిసింది. ‘కృత్రిమ మేధ మంచిదని చక్కగా ఉపన్యాసాలు ఇచ్చి లక్షలు సంపాదిస్తున్నా కానీ.. నిజంగా అది మన దేశానికి మంచి చేస్తుందా? అసలు అది మన దేశ పరిస్థితులకు సరిపోతుందా? ఉన్నవాడికి ప్రత్యామ్నాయం దొరుకుతుందేమో కానీ, లేనోడికి మెతుకు దొరకడమే గగనమవుతుందేమో.. ఈ కృత్రిమ మేధ పేదోళ్ల కడుపు కొట్టి, పేదవాడిని మరింత పేదవాడిగా చేస్తే..
నాణ్యమైన చదువు అందరికీ ఇంకా అందలేదు కదా! దానికి తోడు నిరుద్యోగం ముదిరితే.. రెండు వైపులా కాలే కొవ్వొత్తిలా యువత పరిస్థితి తయారవ్వుతుంది కదా! పదిమంది చేసే పని ఒక్కరే చేయవచ్చని భుజాలు ఎగరేసుకోవడం కాదు. ఏనుగు పాదాల కింద ఎన్ని చీమలు నలిగిపోతాయో.. ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, స్త్రీ వివక్ష, కులాల హెచ్చు తగ్గులు, మతాల విభేదాలు అవన్నీ కలగలిసి ప్రజల జీవితాల్ని ఇబ్బంది పాలుజేస్తాయా!? ప్రభుత్వమే కాదు, మనం కూడా దీర్ఘంగా ఆలోచించాలి’ అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు.
‘కాలం కలిసివచ్చి, అదృష్టం బాగుండి నేను బాగా చదువుకుని ట్రైనర్ కావడంతో జీవితంలో స్థిరపడ్డాను. లేకుంటే.. నా జీవితం కూడా కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కదా..’ అన్న ఆలోచన వచ్చింది. అందరూ గెలలు కోసుకున్నాక తెగ నరికిన అరటి చెట్టులాగా తయారయ్యింది అతని మనసు. అతనికి తెలియకనే కళ్లలో నుంచి కారుతున్న కన్నీళ్లు ఒక్కొక్కటీ చెక్కు మీద రాలుతూ ఉన్నాయి.
రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజు స్వస్థలం పాత చిత్తూరు జిల్లా పుత్తూరు. శల్య వైద్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ప్రముఖ దినపత్రికలో జర్నలిస్టుగా మూడేళ్లు పనిచేశారు. తిరుపతి ఎల్ఐసీలో 35 ఏళ్లు డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటివరకూ ఈయన రాసిన కథల్లో.. చిన్నాపెద్ద కథలు కలిపి 725 వరకూ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 22 పుస్తకాలు ప్రచురణకు నోచుకున్నాయి. మూడు పిల్లల పుస్తకాలు కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. గాండ్ల మిట్ట, దుశ్శాలువా కప్పంగ పుస్తకాలపై చెన్నైలో రెండు ఎం.ఫిల్లు, సమగ్ర సాహిత్యంపై కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది. ప్రతిష్ఠాత్మకమైన తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, అంపశయ్య నవీన్ నవలా పురస్కారం, తానా -మంచి పుస్తకం వారి బాలల నవలా పురస్కారంతోపాటు మరో 12 పురస్కారాలు అందుకున్నారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 9393662821