Ramayanam | ‘స్నేహ బంధము.. ఎంత మధురము! చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము!’ అనే పాట.. అప్పట్లో రేడియోలో తరచూ వస్తుండేది. కానీ, అన్ని స్నేహాలూ జీవితాంతం ఉండవనే కఠోర సత్యం పెద్దవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది. స్నేహమే కాదు.. ఏ బంధమైనా చాలాకాలం నిలబడాలంటే సామీప్యత లేదా తరచూ కలవడం అనేది అవసరం.
నాతో కలిసి ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో, ఒకే సెక్షన్లో చదువుకున్న వాళ్ల పేర్లు ఓ ఇరవై మంది దాకా నేను చెప్పగలను. వాళ్లందరితో గుర్తు పెట్టుకోవాల్సినంత సంఘటనలేవీ లేవు. కో ఎడ్యుకేషన్ అవడం వల్ల మగపిల్లలతో కూడా మాట్లాడేవాళ్లం. కానీ.. చదువు గురించే! ఏడో తరగతి నుంచి మాత్రం ‘ఏ’ సెక్షన్లో అమ్మాయిలందర్నీ.. మగ పిల్లల్లో కాస్త చిన్నగా, బుద్ధిగా, నెమ్మదిగా ఉండి, బాగా చదివేవాళ్లను వేసేవాళ్లు. మిగతా మగపిల్లలందరూ ‘బి’ సెక్షన్లో ఉండేవాళ్లు.
రాధ, శ్యామల, రుక్మిణి, రేవతి, సుశీల, సుగుణ, భాగ్యమ్మ, హైమవతి, శశికళ, వనజ కుమారి, పద్మ, అరుణ, శోభ.. వీళ్లంతా నా క్లాస్మేట్లు. అందరితో నేను బాగానే ఉండేదాన్ని. గొడవలు పెట్టుకోవడాలూ, మాటలు మానేయడాలూ తెలియవు. అయితే నేను తొమ్మిదో తరగతిలో ఉన్నంతవరకూ అక్కా, నేనూ కలిసే బడికి వెళ్లి వచ్చేవాళ్లం. మాతోపాటు అక్క క్లాస్మేట్ సరళక్క, వాళ్ల తమ్ముడు నా క్లాస్మేట్ ప్రభాకర్, మరి కొందరం కలిసి వెళ్లేవాళ్లం. అందువల్ల ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లడం అలవాటు ఉండేది కాదు.
అక్క నా కన్నా రెండేళ్లు పెద్దది. అయినా, ఒక క్లాస్ మాత్రమే సీనియర్. చిన్నప్పుడు ఓవర్‌గా చదువుతున్నానని నన్ను ఓ క్లాస్ ప్రమోట్ చేశారులెండి! అక్క ఇంటర్ కోసం వరంగల్ వెళ్లగానే నేను ఒంటరి అయ్యాను. అందువల్ల నాకు టెంత్లోనే స్నేహితులు బాగా క్లోజ్ అయ్యారు. ముఖ్యంగా రాధ, రుక్మిణి, శ్యామల, రేవతి.. వీళ్లతో ఎక్కువ స్నేహంగా ఉండేదాన్ని.
మా ఇంటికొచ్చే దారిలో రాధా వాళ్లిల్లు ఉండేది. వారంలో రెండు సార్లయినా వాళ్లింటికి వెళ్లి, హోమ్‌వర్క్ అక్కడే చేసుకుని వచ్చేదాన్ని. వాళ్లిల్లు రోడ్డుకు ఆనుకునే ఉండేది. ముందు గదిలో కిటికీ పక్కన కూర్చుని రోడ్డుమీద వచ్చే పోయే వాళ్లను చూస్తూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. మేమిద్దరం ఫొటో స్టూడియోకెళ్లి ఓ ఫొటో కూడా తీసుకున్నాం. ఆ అమాయకమైన ముఖాలు ఇప్పుడు చూసుకుంటే తమాషాగా అనిపిస్తుంది. టెంత్ అయిపోగానే నేను ఇంటర్‌కోసం హైదరాబాద్ వచ్చాను. రాధ చదువు ఆపేశారు ఇంట్లో వాళ్లు. ఆ వేసవిలో రాధ పెళ్లి చేశారు. తను దూరమవుతుందనో.. మరెందుకో తెలియదు కానీ, రాధ పెళ్లి అవుతుంటే చాలా బాధేసింది. రాధ ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది ఇప్పటికీ. తన కొడుకూ, కోడలూ డాక్టర్స్. కూతురూ అల్లుడూ అమెరికాలో ఉంటారు. మా టెంత్ బ్యాచ్ రీయూనియన్ అప్పుడూ, మా క్లాస్మేట్ ఎమ్మెల్యే అయినప్పుడూ వచ్చిందంతే!
రేవతికీ నాకూ చదువు పరమైన స్నేహం ఎక్కువ. తను కూడా బాగా చదివేది. రోజూ చిన్న పెండ్యాల నుంచి వచ్చేది. ప్రముఖ కవి, విరసం వరవరరావు గారి అన్న కూతురు రేవతి. ఇంటర్లో తను వరంగల్ సీకేఎమ్ కాలేజీలో చేరింది. మేమిద్దరమూ కొన్నాళ్లపాటు ఉత్తరాలు రాసుకునేవాళ్లం. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా మధ్యలో రేవతిని చాలాసార్లు కలిశాను. తను కొన్నాళ్లకు క్యాన్సర్‌తో చనిపోయింది.
ఇక శ్యామలకు నాపైన పిచ్చి ప్రేమ. నిజానికి తను చదువులో చాలా వెనుకబడేది. అప్పట్లో అందరు క్లెవర్స్ లాగానే నాకు కూడా ఫస్ట్ బెంచీలో కూర్చొని, బాగా చదివే పిల్లలతోనే స్నేహం చేయాలని ఉండేది. నాది అహంభావమేనని నాకు కొన్నాళ్లకు తెలిసింది. అదీ.. సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు! బడిలో శ్యామల నా వెనకే తిరిగేది. గేమ్స్ పీరియ్డ్లో మేం కలిసి ఆటలాడేవాళ్లం. ఏ ఆట ఆడినా.. “నేను రమ ఉన్న దిక్కుంట” అనేది. నేను తనకు లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్ చెప్పేదాన్ని.
బడి ముందు పుట్నాలు, పల్లీలు, జామ కాయలు, మామిడికాయ ముక్కలు అమ్మేవారు. మేం ఎప్పుడైనా వేయించిన పల్లీలు కొనుక్కునేవాళ్లం. ఎప్పుడూ శ్యామలే డబ్బులిస్తానని ముందుకొచ్చేది. ఎండకాలంలోనైతే.. ఐస్‌ఫ్రూట్ బండివాడు మేము బయటికి రాగానే.. “ఐస్ క్రోట్.. ఎర్రగా, తియ్యగా, పానమంత సల్లగా! పైస తెచ్చుకోర పిల్లగా!” అంటూ అరిచేవాడు. ఎరుపు, గులాబీ, పసుపు రంగుల్లో ఉండే ఆ ఐస్ ఫ్రూట్లు ఊరిస్తూ ఉండేవి. ఒక్కోసారి నేను బయటికి వచ్చేటప్పటికే శ్యామల రెండు ఐస్ ఫ్రూట్లు కొని చేతుల్లో పెట్టుకుని రెడీగా ఉండేది. “అయ్యో! ఎందుకు కొన్నవు శ్యామలా! నా దగ్గర పైసల్లేవు” అనేదాన్ని. ఆ మాట చెప్పడానికి నేనెంతో మొహమాట పడేదాన్ని.
“చల్! నా పైసలు నీవి గావానే? ఎవరి కాడుంటేంది?! తీస్కో.. లేకపోతె నేను గూడ తిన! రెండు కరిగిపోతయి” అనేది. అప్పటికే బొట్లు బొట్లుగా ఐస్ ఫ్రూట్లు కారుతుండేవి. ఇక నేను తీసుకోగానే.. తన కళ్లల్లో పట్టరాని సంతోషం కనిపించేది. మర్నాడు నేను అమ్మనడిగి రెండు ఐస్ ఫ్రూట్ల డబ్బులు ఇరవై పైసలు తెచ్చి ఇస్తే అస్సలు తీసుకునేది కాదు. తన కంపాస్ బాక్స్‌లో తెలియకుండా పెట్టేసేదాన్ని. తీరా నేను ఇంటికొచ్చాక బ్యాగ్ సర్దుతుంటే.. ఏ టెక్ట్స్ బుక్ లోంచో మళ్లీ ఆ పైసలు జారి పడేవి.
రాధ వాళ్లింటితోబాటు నేను వెళ్లింది ఒక్క శ్యామలవాళ్ల ఇంటికే. నన్ను పీకీ పీకీ పట్టుకుపోయేది శ్యామల. వాళ్ల నాన్న నేను వెళ్తే చాలా మర్యాదగా.. “లోపలికి పోండమ్మా!” అని.. “ఇగో! పట్వారి సాబ్ బిడ్డ ఒచ్చింది. పాలు పొయ్యమ్మా! వాళ్లు అవ్వివ్వి తినరు” అని భార్యతో చెప్పేవాడు. నేను ఇంటర్లో ఉండగా శ్యామల పెళ్లి హైదరాబాద్‌లో చేశారు. తనకు ఓ పాప పుట్టింది. అచ్చు శ్యామలలాగే ఉండేది. పెళ్లయ్యాక శ్యామలను ఒక్కసారే చూశాను. ఎందుకో తన ఉత్సాహమంతా పోయి దిగులుగా కనిపించింది. ఆ తరువాత శ్యామల గ్యాస్‌స్టవ్ ప్రమాదంలో చనిపోయిందని ఆలస్యంగా తెలిసింది. అది ప్రమాదం కాదు.. వాళ్ల అత్తింటి వారే ఏదో చేశారని కొందరు అనుకున్నారు. ఏది నిజమో తెలియదు కానీ, వాళ్లింటి ముందు నుంచి వెళ్లినప్పుడల్లా.. శ్యామల నవ్వు మొహం, ఆ ఇంట్లో తన అథార్టీ, స్వేచ్ఛ, మేం గడిపిన కల్లాకపటం లేని రోజులు గుర్తుకొచ్చి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి