Ramayanam | నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఒకేసారి మా దగ్గరి బంధువుల పెళ్లిళ్లు రెండు వచ్చాయి. అయితే.. రాయపర్తి పెళ్లి సందర్భంగా.. అమ్మ సందూక పోవడం, మళ్లీ దొరకడం గురించి చెప్పుకొన్నాం కదా! ఇప్పుడు మా మేనత్త కూతురి పెళ్లి ముచ్చట్లు..
మేం రాయపర్తి నుంచి వచ్చేసరికే ఇక్కడ ఇందిర వదిన పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆడబిడ్డ కూతురి పెళ్లి కదా! మా అమ్మ కొంగు నడుముకు చుట్టి.. వెంటనే పెళ్లి పనుల్లో దిగింది. నాన్న అప్పటికే పూర్తి బిజీగా ఉన్నాడు. అత్తయ్య వాళ్లది బెంగుళూరు టైల్స్ ఇల్లే! అయినా అందంగా ఉండేది. ఇంటి ముందే పందిరి. ఓ పక్క జాజి తీగె, మరోపక్క మల్లె తీగె పాకి.. గుత్తులు గుత్తులుగా పూలుపూసి అందంగా ఉండేది. వదిన పెళ్లికోసం నాన్నే దగ్గరుండి తాటికమ్మలు కొట్టించి.. వాకిలంతా పందిళ్లు వేయించాడు. ఇంటి వెనుకకూడా మొత్తం పందిళ్లే వేసి.. కంది పొరకతో చుట్టూ గోడల్లాగా కట్టారు. వంటలకు వేరే దళ్లు కట్టించారు. వాగులోంచి ఇసుక తెప్పించి ఆ పందిళ్ల కిందే ఓ మూలగా పరిచి.. దాంట్లో వడ్ల గింజలు చల్లారు. రోజూ నీళ్లు చిలకరించడంతో ఆకుపచ్చని వరి మొలకలు వచ్చి.. అక్కడంతా చిన్న వరిచేనులాగా ఉండేది. ఆ ఇసుకలో పొడవునా పెద్ద మట్టికుండలు కొత్తవి తెప్పించి.. అందులో మంచినీళ్లు పోసి, పైన మట్టి కంచుళ్లు (మూతలు) పెట్టారు.
అందులో నీళ్లు చల్లగా, తియ్యగా ఉండేవి. ఆ నీళ్లు తాగితే.. మళ్లీ దాహమే వేసేది కాదెందుకో!? ఆ నీళ్లలో ఎవరూ చేతులు పెట్టకుండా ఓ పొడవాటి అల్యూమినియం గంటెతో పోసుకునే ఏర్పాటు ఉండేది. మేము ఎవరమైనా వాటి దగ్గరగా వెళ్లామో.. “ఏయ్ పిల్లగాండ్లూ! ఆ నీళ్లల్ల చేతులు పెట్టి పాడు చెయ్యకుండి” అంటూ వంటచేసే అమ్మగారు పరిగెత్తుకొచ్చేది. విడిదింటికి పెళ్లివాళ్లు రాగానే.. ఆ నీళ్లతోనే నిమ్మకాయలతో షర్బత్ చేసి ఇచ్చారు. ఆ షర్బత్ రుచికి.. అబ్బో! ఇప్పటి ఏ కూల్ డ్రింకూ సరిపోదు.
ఇక ఒకాయన నాలుగు రోజుల ముందే గులాబీ, పసుపు, లేత నీలం, తెలుపు, ఎరుపు, లేత ఆకుపచ్చ రంగు కాగితాలు తెచ్చి ఓ పెద్ద కత్తెరతో అందమైన డిజైన్లు కట్ చేసేవాడు. గోధుమపిండి ఉడకపెట్టి చేసిన లైతో.. దూలాలకూ, వాసాలకూ, చేరేడులకూ (గుమ్మాలకు) అతికించేవాడు. ఆయన కత్తెరను చకచకా తిప్పుతూ హంసలూ, నెమళ్లూ, ఏనుగులూ, ఆకులూ, పువ్వులూ.. ఇలా రకరకాల డిజైన్లు కత్తిరిస్తుంటే, మా క్రాఫ్ట్ సారు కంటే ఈయనే పెద్ద ఆర్టిస్టు అనిపించేది. పిల్లలమంతా ఆయన చుట్టూ కూర్చొని ఏది తెమ్మంటే అది తెచ్చిస్తూ ఉండేవాళ్లం.
ఆ పెళ్లిలో ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. పల్లకీకి రకరకాల పూసల హారాలు వేలాడదీసి అందంగా తయారుచేశారు. పెళ్లి అయ్యాక పెళ్లికొడుకు అలిగి విడిదింటికి వెళ్లాడని చెప్పారు. మా వదినను ఫొటోలో గోదాదేవిలా బాగా తయారుచేసి, ఆ పల్లకిలో కూర్చోబెట్టి మోస్తూ తీసుకెళ్లారు. బోలెడు మంది ఆడవాళ్లు, మగవాళ్లు ఊరేగింపుగా బయల్దేరి విడిదింటికి వెళ్లారు. బ్యాండు వాళ్లు దసరా బుల్లోడు పాటలు వాయిస్తుంటే.. పిల్లలమంతా ఆ గుంపులోనే ఎలాగూ ఉంటాం కదా!
అక్కడికి వెళ్లాక పెద్దవాళ్లు ఏవో జోకులు వేసుకుని నవ్వుకున్నారు. పెళ్లికొడుకు లేచి మాతోబాటు వచ్చేయబోతుంటే.. వాళ్ల వాళ్లంతా “లేదు.. లేదు.. అమ్మాయి ఒక పాట పాడాల్సిందే! అందాక లేచేదే లేదు” అన్నారు. ఇక పెళ్లికూతుర్ని కూచోబెట్టి అందరూ చుట్టూ చేరారు. “పాడు పాడు” అంటుంటే ఏం పాడుతుంది పాపం!
అయితే.. కావాలనే పాడిందో, ఆ టైంకి ఏమీ గుర్తురాలేదో గానీ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ పాటైతే పాడింది. “చీకటిలో.. కారు చీకటిలో.. కాలమనే కడలిలో.. శోకమనే పడవలో.. ఏ దరికో.. ఏ దెసకో..” అంటూ సాగిందా పాట. విన్నవాళ్లంతా ఏమనాలో తెలియక.. అలాగే చూస్తుండి పోయారు. పెళ్లికొడుకు నవ్వుతూ చూస్తుంటే వాళ్ల వాళ్లెవరో.. “ఉంకో పాట పాడమ్మా! పెండ్లి కదా.. అటువంటి పాటలు పాడొద్దు. కొంచెం సంతోషపడే పాటపాడితే బాగుంటది” అన్నారు. దాంతో వదిన గొంతు సవరించుకుని.. “రాజశేఖరా నీపై మోజు తీరలేదురా! రాజసాన ఏలరా!” అని పాడగానే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయారు.
తరువాత మళ్లీ అందరూ పెళ్లికొడుకునూ, పెళ్లికూతురునూ పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపుతో పెళ్లింటికి తీసుకొచ్చాక భోజనాలు చేశారు. సాయంత్రం అప్పగింతలయ్యాక.. వదిన వెళ్లిపోతుంటే ఆడవాళ్లంతా బాగా ఏడ్చారు. ప్రతివాళ్లూ పెళ్లి కూతురు దగ్గరికి రావడం, ఆమెను కౌగలించుకుని.. “అత్తగారింటికి పోతున్నవా బిడ్డా!” అని ముక్కులు చీదుకుంటూ, కొంగుతో కళ్లు తుడుచుకుంటూ బిగ్గరగా ఏడవడం, పెళ్లి కూతురు కూడా వాళ్లతోబాటు ఏడవడం, ఇదంతా పెళ్లికొడుకు బిత్తరపోయి చూడటం. ఇప్పట్లా వధూవరులు పెళ్లిలోనే మాట్లాడుకోవడం అప్పుడుండేది కాదేమో మరి.. ఆయన కూడా పెళ్లికూతుర్ని ఊరుకుంచే ప్రయత్నమేదీ చేసినట్టు కనిపించలేదు. ఏదో విధంగా పెళ్లి కూతురు తనంత తానే దుఃఖాన్ని ఆపుకొని కొంచెం తేరుకునేసరికి.. పక్కింటి వాళ్లో, పాలు పోసేవాళ్లో, పిండిగిర్నీ వాళ్లో, కిరాణా కొట్టు వాళ్ల్లో ఎవరో ఒకరు వచ్చి.. “పోతున్నవా తల్లీ!” అని మళ్లీ ఏడిపించడం.. పెళ్లి కూతురు ఏడ్చేసరికి “ఊకో అమ్మా.. ఆడిపుటుక పుట్టినాక తప్పుతదా! అత్తగారింటికి పోవలసిందే! ఇగ నీ చిన్నప్పటి ఆటలు, పాటలు అన్నీ బంద్. గా వాళ్లు ఎట్ల జెబితే గట్ల ఇనాలె!” అంటూ మళ్లీ రెచ్చగొట్టి ఏడిపించేది. మొత్తానికి పెళ్లి బృందం బస్సు ఎక్కి వెళ్లిపోయేటప్పుడు బ్యాండ్ వాళ్లు దసరా బుల్లోడులోని ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా!’ పాట పాడటం మాత్రం మర్చిపోలేదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి