‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
“ఏమీ తోచనప్పుడు అద్దాల కిటికీలోంచి రోడ్డు మీద వచ్చే.. పోయే జనాలను చూడటం నాకు అలవాటు.
ఇలాంటి చక్కటి ఇల్లు నాకు తెలీకుండానే కట్టించి, దాన్ని మా మొదటి పెళ్లి రోజు కానుకగా చెప్పి.. నన్ను సర్ప్రైజ్ చేశాడు రవి! ఆయన గురించే ఆలోచిస్తూ కిటికీలోంచి బయటికి చూస్తున్నాను.
ఎదురుగా రోడ్డు మీద.. డివైడర్ల మధ్య పూల మొక్కలు పెడుతూ కనిపించారు కూలీలు. పూల మొక్కలంటే ప్రాణమిచ్చే నేను.. ‘వాళ్లు ఆ మొక్కల్ని ఎలా పెడుతున్నారా!?’ అని ఆసక్తిగా గమనిస్తున్నాను.
కూలీలందరూ ఆడవాళ్లే! వాళ్లు.. తెల్లగా, అందంగా, బలిష్టంగా ఉన్నారు. ఎర్రటి ఎండలో పని చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు చకచకా మట్టి తవ్వుతూంటే..
మరో ఇద్దరు ఎరువు లాంటిదేదో వేస్తున్నారు. ఇంకో ఇద్దరు పూల మొక్కల్ని నాటుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తమ పాత చీరలను ఉయ్యాలల్లా కట్టి, వాటిలో చంటిపిల్లల్ని పడుకోబెట్టి.. రెండు మూడేళ్లున్న పిల్లలతో ఆ ఉయ్యాలలను ఊగిస్తున్నారు.
ఏ వస్తువైనా ఒక చోటునుంచి మరోచోట పెట్టడానికే ఆపసోపాలు పడే నాకు.. ఇంచుమించు నా వయసులోనే ఉన్నట్టుగా ఉన్న ఆ అమ్మాయిలు ఆడుతూ పాడుతూ ఎంతో సునాయాసంగా పనులు చేసుకోవడం చూసి ముచ్చటేస్తున్నది!
వాళ్ల చేతుల్లో ఏవో పూల మొక్కలు.. అవి ఏ పూలవో కనిపించడం లేదు. కాకపోతే.. అవి ఏ ఎర్రగన్నేరు మొక్కలో, తెల్లగన్నేరు మొక్కలో కాకపోతే బాగుండని అనిపించింది!
పూలు తక్కువ, ఆకులెక్కువగా ఉండే ఆ గన్నేరు పూల మొక్కలకన్నా.. ఆకుల్నే కనిపించకుండా విరగబూస్తూ.. చాలా రోజులపాటు వాడిపోకుండా నిత్యనూతనంగా కనిపించే బోగన్విలియా మొక్కల్ని.. ఆ డివైడర్ల మధ్య నాటితే కంటికి ఇంపుగా ఉంటాయి కదా అనిపించింది.
అప్పుడే ఫ్యాక్టరీ నుంచి తొందరగా ఇంటికి వచ్చిన రవితో అదే విషయం చెప్తే..
“ఛ! బోగన్విలియా మొక్కలా? అవేం బాగుంటాయి ఇందూ? పైగా వాటికి సువాసన కూడా ఉండదు!” అంటూ నన్ను ఆట పట్టించాడు.
“ఇల్లు కట్టిన కొత్తలో వాటిని మన కాంపౌండ్ వాల్ మీద పాకేలా పెట్టుకుందామని నేనోసారి అడిగితే.. ‘వాటికి ముళ్లుంటాయ్! నువ్వు ఉత్తినే కూర్చోవు సరి కదా.. ‘వాటికి నీళ్లు పోస్తానూ! కత్తిరిస్తానూ’ అంటూ బయల్దేరుతావు! అసలే సుకుమారమైన శరీరం నీది, వాటి ముళ్లు గుచ్చుకుంటే.. నేను తట్టుకోలేను! కావాలంటే మల్లెపూల మొక్కలు పెట్టుకో..’ అంటూ తప్పించుకున్నారు మీరు. గుర్తుందా ?” అని గుర్తుచేశాను.
రవి మాట్లాడలేదు.
“అయినా రవీ.. నీకు మల్లెపూలంటే ఎందుకంత మోజు? అవి ఒక్కరోజులో విచ్చుకుని వాడిపోయే పూలు! ఆ బోగన్విలియా పూలు చూడండీ.. ఎంతకీ వాడిపోవు! ఎండావానలకు తట్టుకుంటాయి! కంటికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి!” అన్నాను.
నా మాటలు విననట్టే..
“పూవునైనా కాకపోతిని.. నీ కంటి చూపులు సోకగా..”.. కూని రాగం తీస్తూ బాత్రూంలో దూరాడు.
మరో పది నిముషాల్లో ట్రిమ్గా తయారై..
“ఇందూ! మా ఫ్రెండ్ వాళ్లింట్లో ఈ రోజు స్టాగ్పార్టీ ఉంది. ఏ అర్ధరాత్రో వస్తాను. పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చి, నేనొచ్చేదాకా డ్రైవర్ ఇక్కడే ఉంటాడు. ఫస్ట్‌టైమ్ మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను కదా.. ఎమర్జెన్సీలో మీకు తోడుంటాడని డ్రైవర్ని ఇక్కడే ఉండమన్నాను. మళ్లీ నా కోసం అతణ్ని పంపించకు. నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాను. జాగ్రత్త డాళింగ్! మా ఫ్రెండ్‌కు ఒక చక్కటి గిఫ్ట్ కొనాలి. మా వాళ్లంతా నన్ను తొందరగా రమ్మంటూ ఒకటే గొడవ చేస్తున్నారు. వస్తా! బై!” అంటూ హడావుడిగా బయటపడ్డాడు.
టైమ్ చూశాను. పదకొండున్నర అవుతున్నది! బయట ఇంకా ఎర్రటి ఎండ! అంతటి ఎండలో కూడా డివైడర్ దగ్గర నవ్వుతూ.. తుళ్లుతూ పని చేసుకుంటున్నారు కూలీ అమ్మాయిలు.
పెళ్లయి అయిదేళ్లు అవుతున్నది! నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు రవి. స్టాగ్ పార్టీలో ఆడవాళ్లకు ప్రవేశం ఉండదు కాబట్టి.. మొదటిసారిగా నన్ను వదల్లేక వదల్లేక ఒక్కడే వెళ్లిపోయాడు. అవునూ.. ఎంతటి అదృష్టం చేసుకుంటే భార్యను కంటికి రెప్పలా చూసుకునే రవిలాంటి భర్త లభిస్తాడు అమ్మాయిలకు?
రవి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి..
పెళ్లయిన కొత్తలో..
“నిన్ను చూడకముందు.. ‘సౌకుమార్యం ఆడవాళ్లకు అలంకారం’ అంటూ కవులు అభివర్ణిస్తూంటే.. అంతా ఉత్త ట్రాష్ అనుకునేవాణ్ని! కానీ, చిదిమితే పాలుగారే సౌకుమార్యం నీది! ఇలాంటి సౌకుమార్యం ఎంత అదృష్టం చేసుకుంటే లభిస్తుందో చెప్పు! పైగా అది నీ సొంతం కావడానికి నీకు ఎన్ని తరాల జీన్స్ సాయం చేసి ఉంటాయో ఆలోచించు ఇందూ!”.. మోహావేశం ఎక్కువైనప్పుడల్లా మురిపెంగా అంటాడు రవి.
కానీ, ఈ సౌకుమార్యాన్ని ఏం చేసుకోనూ? ఇది ఒక్కరోజులో వికసించి వాడిపోయే మల్లెపూవు లాంటిది కదా!
ఊటీ, కొడైకెనాల్.. ఎక్కడికి వెళ్లినా.. ఎండలో తిరగనిచ్చేవాడు కాదు. నా చేయి పట్టుకుని, నేను చెట్ల నీడ కిందే నడిచేలా చేసేవాడు. వాకింగ్‌కు వెళ్లినా.. అదే పరిస్థితి. నా కొంగో, దుపట్టానో గొడుగులా చేసి.. నీడలా పట్టేవాడు. నేను మున్ముందు ఏ జబ్బు బారినపడో ఈ సౌకుమార్యాన్ని పోగొట్టుకుంటే.. చూసి తట్టుకోగలడా? అప్పుడూ ఇంత అపురూపంగా నన్ను చూసుకోగలడా?
ఎందుకో రవిలోని ఆ ‘సౌందర్య స్పృహ’ నన్నెప్పుడూ ఏదో తెలియని అభద్రతా భావానికి లోనుచేసేది. అదే మాట పైకి చెప్తే..
“యూ సిల్లీ గాళ్! గులాబీ పువ్వు సుకుమారమైంది. దానిది మనకన్నా షార్ట్ లైఫ్! అలా అని.. దాని రెక్కలు రాలిపోతూంటే చూస్తూ కూర్చోలేం కదా! మరికొన్ని గంటలపాటైనా అది తాజాగా ఉండాలనుకుంటాం. నీళ్లు చిలకరించో.. తడి గుడ్డలో చుట్టో.. అది వాడిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా!” అనేవాడు.
అయితే.. నేను భయపడ్డట్టే..
ఓ పాప పుట్టాక.. ఏ యాభై ఏళ్ల తర్వాతో వచ్చే ఆస్టియోపొరోసిస్.. ముప్పై ఏళ్లకే నా ఎముకల్ని గుల్లబారేలా చేయడం, తుమ్మినా దగ్గినా చిన్నచిన్న ఫ్రాక్చర్స్ కావడం, కాలి వేళ్ల కణుపుల మీద, చేతి వేళ్ల కణుపుల మీద ఉబ్బెత్తుగా బొడిపెల్లా స్పర్స్ పెరిగి కీళ్లు నొప్పెట్టడం.. తద్వారా నేను ఏ చిన్న వస్తువునూ లేపలేకపోవడం చూసి షాక్ అయ్యాడు రవి.
“విటమిన్ డి మాత్రలు బాగా వేసుకోవాలి. ఎండలో తిప్పాలి” అని డాక్టర్లు చెప్పినపుడు..
తను నన్ను.. ‘అసూర్యం పశ్య’లా అపురూపంగా చూసుకున్నందుకే నాకిలా జరిగిందేమోనన్న గిల్టీనెస్ మొదలయి.. నా పట్ల అంతకుముందున్న శ్రద్ధ రెట్టింపైంది రవికి! అయితే.. ఇంతకుముందులా సున్నితంగా చూసుకోవడం మానేసి.. ఎండలోనే వాకింగ్ చేయించడం, డి విటమిన్ లాంటి టాబ్లెట్స్ ఇవ్వడం మొదలెట్టాడు రవి.
రాకింగ్ చైర్లో కళ్లు మూసుకుని రవి తలపుల్లో మునిగితేలుతున్న నేను..
“అమ్మా! ఒక్కమాట..” అన్న ఆయా పిలుపునకు ఉలిక్కిపడి కళ్లు తెరిచాను.
“అమ్మా! మన ఇంటి ముందున్న రోడ్డుమీద మొక్కలు పెడుతున్నవాళ్లకు దాహంగా ఉన్నదట! వాళ్లు గేట్ ముందు నించుని మంచి నీళ్లు అడుగుతున్నారు. ఇవ్వమంటారా?” అడిగింది ఆయా.
వాల్‌క్లాక్ వంక చూశాను.
మధ్యాహ్నం మూడు అవుతున్నది.
“సర్లే.. వాళ్లను లోపలికి రమ్మని పిలువు! పొద్దుటినుంచీ ఎండలో పనిచేస్తున్నారు కదా! దాహంగా ఉందేమో పాపం. ఇంట్లో సకినాలూ, లడ్డూలూ ఉన్నాయి కదా! వాళ్లకూ, వాళ్ల పిల్లలకూ తలా కొన్ని ఇవ్వు. టీ కూడా చేసివ్వు” అని చెప్పాను.
“సరేనమ్మా!” అంటూ వంటింట్లోకి వెళ్లింది ఆయా.
పాప స్కూల్ నుంచి వచ్చే టైమ్ అయింది. ఈపాటికే డ్రైవర్ తీసుకురావాలి! ఏ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నారో.. ఇంకా ఇంటికి రాలేదు! ఫోన్ చేస్తూంటే రిసీవ్ చేసుకోవడం లేదు. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడకూడదని మాట్లాడటం లేదేమో అని సరి పెట్టుకుందామనుకుంటే.. కనీసం నా కాల్ చూసైనా.. ఎక్కడో ఓ చోట కారు ఆపి మాట్లాడవచ్చు కదా అనిపించింది!
నాలో అంతకంతకూ టెన్షన్ పెరిగిపోతున్నది. ప్రతిరోజూ అయిదు గంటలకల్లా ఇంటికి వచ్చే పాప.. ఈ రోజు ఆరైనా జాడే లేదు! డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లయి లేదు! కాసేపటికి ఆ ఫోన్ కాస్తా స్విచాఫ్ వచ్చింది. మనసు ఎందుకో కీడు శంకిస్తున్నది. రవికి ఫోన్ చేశాను. అదీ స్విచాఫ్ వస్తున్నది. స్టాగ్ పార్టీలో ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడం మామూలే!
ఇప్పుడెలా? స్కూల్‌కు ఫోన్ చేశాను..
“పిల్లల్ని ఎప్పట్లా మూడున్నరకే వదిలారు. మీ డ్రైవర్ వచ్చి తీసుకెళ్లాడు” చెప్పాడు వాచ్‌మన్.
ఇక లాభం లేదని.. పాపకు బ్యాండ్ ట్రాకింగ్, బ్యాగ్ ట్రాకింగ్ గుర్తొచ్చి వాటినీ వెరిఫై చేశాను. బ్యాండ్ ఒకచోట, బ్యాగ్ ఒకచోట స్విచాఫ్ అయ్యాయి.
కారు జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుందని గుర్తొచ్చి.. ఆ దిశగా చెక్ చేశాను.
కారు మేడ్చల్ పరిసర ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎక్కడో ఆగిపోయినట్టుగా.. తెలిసిపోయింది! వెంటనే పోలీస్ వాళ్లకు ఫోన్ చేశాను.. ఎంగేజ్ వస్తున్నది! ఇంట్లో ఇంకో కారు ఉంది! నాకు డ్రైవింగ్ వచ్చినా.. చేతుల్లో చేవ లేక, కాళ్లలో శక్తి లేక కారు బయటికి తీయలేని నా అశక్తత గుర్తొచ్చి.. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ.. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగడం మొదలెట్టాను.
ఫ్రెండ్స్ కూడా ఒక్కరొక్కరే రావడం మొదలైంది.
ఇంతలో ఆయా లోపలికి వచ్చి..
“అమ్మా! ఆ పూలమొక్కలు పెట్టినవాళ్లకు సకినాలూ, లడ్డూలూ, టీ ఇచ్చాను. వాళ్లు మీతో మాట్లాడి వెళ్లిపోతామంటున్నారు” అని చెప్పింది.
“ఇప్పుడా?”.
నా మనసంతా ఆందోళనగా ఉంది! ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేను.. అదే విషయం చెప్పాను.
ఆయా బయటికి వెళ్లి.. మరుక్షణం గోడక్కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది! ఆయాతోపాటు పొద్దుట్నుంచీ మొక్కలు పెట్టిన ఆరుగురు అమ్మాయిలూ లోపలికి తోసుకొచ్చారు.
వాళ్లంతా వేళ కాని వేళ.. ఎనిమిది గంటల రాత్రి.. అందులోనూ ఆందోళనగా ఉన్న సమయంలో లోపలికి చొచ్చుకు వచ్చినందుకూ, వాళ్లకు అడ్డుపడనందుకూ ఆయా వంక ఒకింత చిరాగ్గా, అసహనంగా, కోపంగా చూశాను. నా చూపులు చూసి భయపడిపోయిందో.. మరే కారణమో.. ఓ మూలన బిత్తర చూపులు చూస్తూ నించుంది ఆయా. నా అసహనం గమనించిందేమో..
“మేడమ్! అయాం సంగీత! వియ్ నో యూ ఆర్ వర్రీడ్ అబౌట్ యువర్ డాటర్స్ సేఫ్టీ నౌ!”.. చొరవగా తనను తాను పరిచయం చేసుకుంది ఆ వచ్చిన వాళ్లలోంచి ఓ అమ్మాయి.
ఒక కూలీ అమ్మాయి ఇంగ్లిష్ మాట్లాడటం చూసి ఒకింత ఆశ్చర్యం, ఆమె నోటెమ్మట నా కూతురి ప్రస్తావన రావడం కొండంత ఆనందం, మరుక్షణం అంతకుమించిన ఆందోళనా.. నాలో ముప్పిరిగొన్నాయి.
“మేడమ్! నా పేరు రజని. ఈ సంగీతా నేనూ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్మేట్స్!” అన్నది మరో అమ్మాయి.
“ఏంటీ!? మీరు స్టూడెంట్సా? పొద్దుటినుంచీ మా ఇంటి ముందున్న డివైడర్స్లో మొక్కలు పెడుతున్న కూలీలు కదా.. మీరు?” నాలోని అనుమానం.. ప్రశ్నల రూపంలో బయటికి తన్నుకు వచ్చింది!
“వీళ్లు నిజంగానే కాలేజీ అమ్మాయిలు అమ్మా! వారానికో రోజు హరితహారంలో భాగంగా.. మాలాంటి వాళ్లతో కలిసి, ఎలాంటి ఫొటో ప్రదర్శనల్లేకుండా సింపుల్‌గా మొక్కలు పెట్టడం వీళ్లకు సరదా! ఈవారం వాళ్లు మీ కాలనీని సెలెక్ట్ చేసుకున్నారు! ఈ రోజు మొక్కలు పెట్టిన మా ఆరుగురిలో వీళ్లిద్దరే కాలేజీ అమ్మాయిలు. మిగతా నలుగురం కూలీలం!” చెప్పింది కూలీల్లోని ఇంకో అమ్మాయి.
నా ప్రాణానికి ప్రాణం.. నా పాప గురించి నేను వర్రీ అవుతూంటే.. మధ్య ఈ కాలేజీ పిల్లలేమిటో, వీళ్ల కథేమిటో అయోమయంగా ఉంది.
‘ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతున్నది? అసలు వీళ్లు ఏం చెప్పాలని లోపలికి వచ్చారు!?’.. నాకంతా అగమ్యగోచరంగా, అంతకుమించి అసహనంగా ఉంది.
“మేడమ్! మీ పాప ఇంకా రాలేదని కదా మీరు బాధ పడుతున్నారు! ఆ విషయం చెపుదామనే వచ్చాం!” అన్నది సంగీత.
ఇంతలో..
“ఇదిగో మీ పాప! ఈ రాత్రి మీ పాప మీ ఇంటికి క్షేమంగా చేరేలా ఈ కాలేజీ అమ్మాయిలు పూనుకోకపోతే.. మీ పాప మీకు ప్రాణాలతో దక్కేది కాదు!” అంటూ లోపలికి అడుగుపెట్టారు పోలీసులు.
“మమ్మీ!” అంటూ ఒక్కుదుటున పరిగెత్తుకొచ్చి వెక్కివెక్కి ఏడుస్తూ నన్ను వాటేసుకుంది పాప.
పాపను గట్టిగా గుండెలకు హత్తుకుని, ఎడాపెడా ముద్దుల వర్షం కురిపించాను. నా కళ్లనుంచి ధారాపాతంగా కన్నీళ్లు కురుస్తూనే ఉన్నాయి.
ప్రపంచం ఏమై పోనీ.. నేనేమీ వినదలచుకోలేదు.. నా పాప నాకు దక్కింది. అది చాలు!
“జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ.. మూడేళ్ల కింద కాలేజీ నుంచి డిబార్ అయ్యాడు మీ డ్రైవర్. అతడి బ్యాక్‌గ్రౌండ్ తెలియక.. మీరు పనిలో పెట్టుకుని, పూర్తిగా నమ్మారు మీరు. పెళ్లిళ్లకూ, ఫంక్షన్స్‌కూ ఎక్కడికి వెళ్లినా.. మీ పర్స్‌ను మొయ్యలేక దాన్ని కార్లోనే వదిలి వెళ్లేవారు మీరు. పైగా ఆ పర్సును కొన్నిసార్లు అతడి చేతికే ఇచ్చేవారు. అందులోంచి డబ్బు కొట్టేస్తూ.. తన సరదాలు తీర్చుకునేవాడు అతడు. మీరెప్పుడూ మీ పర్స్‌లో ఎంత డబ్బు ఉందో చూసుకునే వారు కాదు కాబట్టి.. చాలా రోజులుగా అతడికి ఆడింది ఆటగా గడిచిపోయింది. ఈ మధ్య అనారోగ్యం మూలంగా మీరు ఎటూ వెళ్లలేకపోవడంతో మీ పర్స్‌లోంచి డబ్బు కొట్టేసే అవకాశం దొరక్క.. తన అవసరాలు తీరే దారీ లేక.. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలన్న ఆలోచనతో ఛాన్స్ కోసం ఎదురుచూశాడు. ఆ అవకాశం మీవారి ‘స్టాగ్ పార్టీ’ రూపంలో తనకు దొరికిందని మా ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు మీ డ్రైవర్!”.. విడమరిచి చెప్పాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్.
“అవును మేడం! ఈ రోజు తను ఇంట్లో ఉండననీ, అందాకా మీకు కాపలాగా డ్రైవర్‌నే ఉండమని మీ భర్త అతడికి చెప్పడంతో.. మంచి ఛాన్స్ దొరికిందని ఉబ్బితబ్బిబ్బయ్యాడు మీ డ్రైవర్. ఆ సంతోషంలో తన స్నేహితుడితో కలిసి.. తనతోపాటు మీ పాపను మరెవరో కిడ్నాప్ చేసినట్టుగా ఏమేం చేయాలో; ట్రాకింగ్ ద్వారా ఆ పాప ఆచూకీ తెలిసే అంశాలు ఏమేమి ఉన్నాయో; వాటిని ఎక్కడెక్కడ ఎలా ధ్వంసం చేయాలో; కారును ఎక్కడ వదిలిపెట్టాలో; ప్లాన్ బెడిసికొడితే.. తమ గుట్టు రట్టయితే.. పాపను ఎలా చంపేయాలో.. అన్నీ డీటెయిల్డ్‌గా తన స్నేహితుడితో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద నించుని డిస్కస్ చేశాడు మీ డ్రైవర్.. ” చెప్పింది రజని.
“అంతకన్నా ఓ అయిదు నిముషాల ముందు.. మా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికోసం.. అతడు నించున్న ఫుట్‌పాత్ పక్కనున్న చెట్టు కొమ్మ మీద.. మా సెల్‌ఫోన్‌ను ఆటోమోడ్లో పెట్టుకున్నాం! లంచ్ టైమ్‌లో వెళ్లి మా మొబైల్ చూస్తే.. అందులో మా చెట్లు నాటే కార్యక్రమంతోపాటు మీ డ్రైవర్ సంభాషణ కూడా రికార్డ్ అవడం కనిపించి విస్తుపోయాం. దాన్ని వెంటనే మేము పోలీసులకు ఫార్వర్డ్ చేయడంతో.. వాళ్లు మీ పాప ఆచూకీని సకాలంలో తెలుసుకోగలిగారు!” చెప్పింది సంగీత.
“అదొక్కటే కాదు.. కాలేజీ అమ్మాయిలు చెప్పిన విషయాన్ని వెంటనే తమ భర్తలకు చేరవేసి.. వాళ్ల భర్తలు కూడా ఓ క్యాబ్ బుక్ చేసుకుని మీ డ్రైవర్ని ఫాలో అయ్యేలా ఈ నలుగురు కూలీ అమ్మాయిలు కూడా పూనుకోకపోతే.. ఈ కేసును మేము ఇంత తొందరగా అదీ కేవలం మూడున్నర గంటల వ్యవధిలో చేధించగలిగే వాళ్లం కాదు! క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో!”.. కూలీ అమ్మాయిల వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్.
“అతడు చాలా తెలివైన నేరస్తుడు సర్. అయితే ఎంత తెలివైన నేరస్తుడైనా.. ఒక చిన్న తెలివి తక్కువ పని ద్వారా పట్టుబడిపోతాడని తరచూ మీ పోలీసులు చెప్పే మాట నిజమైంది!” అన్నది రజని.
“మీ వారు పెద్ద బిజినెస్ టైకూన్. ఆయనకు ఎంతకీ మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలన్న తపనే తప్ప.. మీ చుట్టూ ఎన్ని విషనాగులు తిరుగుతున్నాయో పట్టించుకోలేని బిజీమనిషి! ఇదిగో మీ ఆయా కూడా మరో విషప్పురుగు. ఆమెతో కలిసి మరెన్నో పన్నాగాలు పన్నాడు మీ డ్రైవర్. మీ అదృష్టవశాత్తూ అతడి మొదటి పన్నాగం ఇలా బెడిసికొట్టింది! డ్రైవర్లనూ, పని మనుషుల్నీ కొత్తగా పనిలోకి తీసుకునే ముందు ఆధార్ కార్డు అడగడం, వాళ్ల నడత గురించి ఊరి పెద్దల్ని అడిగి తెలుసుకోవడం చాలా అవసరం” చెప్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్.. ఆయాను అదుపులోకి తీసుకుంటూ.
నా తల తిరిగిపోతున్నది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి! ఆ తర్వాత నాకు ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలీదు గానీ.. కళ్లు తెరిచేసరికి నేనేదో హాస్పిటల్లో ఉన్నట్టుగా అర్థమైంది. నా మంచం చుట్టూ చేరి నా వంకే ఆదుర్దాగా చూస్తున్న రవి, పాప, నలుగురు కూలీ అమ్మాయిలు, ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కనిపించారు. ముందుగా ఆ కూలీ అమ్మాయిలను దగ్గరికి రమ్మంటూ సైగ చేసి..
“అమ్మాయిలంటే మీలా ధైర్యంగా, చురుగ్గా, అలర్ట్‌గా ఉండాలి! అప్పుడు మీరే కాదు.. దేశంలోని ఆడపిల్లలందరూ క్షేమంగా, నిర్భయంగా ఉంటారు! ఇప్పుడు కావాల్సింది.. నాలా చేవలేని మనుషులు కాదమ్మా! నవ్వుతూ తుళ్లుతూ తమ చెమట చుక్కల్ని ధారపోస్తూ.. ఎంత పని చేస్తున్నా.. ఎంతకీ వాడిపోని ‘బోగన్విలియా’ మొక్కల్లాంటి మీ శ్రమజీవులు! మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను!”.. అంటూ రెండు చేతులూ జోడించాను.
రవి కళ్లు తడిశాయి!
“మీరన్నది అక్షరాలా నిజం మేడం! తమ కొమ్మల్నో, రెమ్మల్నో చిదిమివేయాలని చూసే వ్యక్తులను.. వాళ్ల ఒళ్లంతా రాష్ వచ్చేలా చేసి, కసి తీర్చుకుంటాయి ఆ బోగన్విలియా మొక్కలు!” అన్నది రజని.
“మీరేం తక్కువ తల్లీ? కాళ్లతో అదిమి తొక్కినా.. చివ్వున పైకి లేచి, నిటారుగా నించునే మెత్తని లాన్ లాంటి వాళ్లు మీ కాలేజీ అమ్మాయిలు! మీలాంటి వాళ్లుంటే.. ఎవరూ కిడ్నాపులకూ, యాసిడ్ దాడులకూ, రేప్లకూ, కత్తిపోట్లకూ గురికారు! అసలు మీలాంటి వాళ్లకు ఇవ్వాలి.. దేశంలోని అత్యున్నత పురస్కారాలు!” అంటూ ఆ కాలేజీ అమ్మాయిల చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను!
పాప కళ్లు మెరిశాయి!
జి. అమృతలత
జి. అమృతలత స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. ఎంఏ, ఎంఈడీ, పీహెచ్డీ చేశారు. హైదరాబాద్‌లోని ‘మౌరి టెక్’ సాఫ్ట్వేర్ సంస్థకు బిజినెస్ డెవలప్మెంట్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్నారు. స్వాతి వార పత్రిక 1971లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసం నిర్వహించిన కథల పోటీలో వీరు రాసిన ‘మనసు ఎదగని మనుషులు’ కథానిక.. ఉత్తమకథగా ఎంపికైంది. అదే ఏడాది ఎమెస్కో సాహితీ సంస్థ నిర్వహించిన కథల పోటీలో.. ‘కన్నీళ్లతో కాలక్షేపం’ కథకు ప్రథమ బహుమతి లభించింది. ‘సృజన’ మాసపత్రిక 1970లో నిర్వహించిన కవితల పోటీలో.. ‘కూలి’ కవిత ఉత్తమ కవితగా ఎంపికైంది. నిజామాబాద్ నుంచి వెలువడిన ‘అమృతకిరణ్’ పక్షపత్రికకు రెండేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో ‘గాయాలే.. గేయాలై’ కవితా సంకలనం, ‘వెతలే.. కథలై’ కథా సంకలనం వెలువరించారు. అమృత వర్షిణి, సృష్టిలో తీయనిది, స్పందన, చుక్కలలోకం చుట్టొద్దాం!, గోడలకే ప్రాణముంటే, ఓటెందుకు? సంపుటాలు ప్రచురితమయ్యాయి. వివిధ సంస్థలు, సొసైటీల నుంచి పలు అవార్డులు, సన్మానాలు అందుకున్నారు.
జి. అమృతలత
98488 68068