తాను అడిగిన అన్ని ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా అన్సర్లు చెప్పడంతో చంద్రమతి భర్త అడ్రస్‌తో పాటు అతని వ్యాధి నయంచేసే మూలికల గురించి చెప్పాడు సీఐ శరత్. వెంటనే అక్కడి నుంచి బయల్దేరుతున్న రుద్రతో శరత్ ఇలా అన్నాడు. ‘ఏయ్.. రుద్ర. చంద్రమతిని బలివ్వాలనుకొంటే ఎలాగైనా ఇవ్వొచ్చు. అయితే, తలను, మొండాన్ని ఎందుకు వేరుచేశాను? తల నుంచి వేరైన మొండాన్ని మళ్లీ రెండు భాగాలుగా ఎందుకు చేశాను? తెలుసా??’ అంటూ భయంకరంగా నవ్వాడు శరత్.
శరత్ చెప్పిన విషయాన్ని తామెందుకు గుర్తించలేకపోయామని రుద్ర అండ్ టీమ్ సిగ్గుపడ్డారు. ఆ వెంటనే తేరుకొని.. ‘ఎందుకు అలా చేశావ’ని ఆరా తీశారు. దీనికి శరత్ గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు. దీంతో జయ కలుగజేసుకొంటూ.. ‘మిస్టర్ శరత్.. మీరు చేస్తుంది అత్యంత హీనాతిహీనమైన పని. అమాయకులను అమానుషంగా బలిస్తూ.. మానవ జన్మకే మచ్చ తెస్తున్నారు. మీకు తగిన శిక్ష..’ అంటూ జయ మాట్లాడటం పూర్తిచేయకముందే.. ‘హలో మేడమ్. ఆపుతారా మీ సోది. అంతా నాకు తెలుసు. నోరు మూసుకొని నేను చెప్పేది వినండి అంతే. ఇప్పుడు బలిచ్చే వారి తల, మొండేన్ని ఎందుకు వేరు చేస్తున్నా? అనేగా మీ డౌట్.
అయినా మీరెంత తెలివితక్కువ వారంటే.. బలిచ్చే వారిని నేను ఎలా చంపుతున్నానన్న విషయం కూడా నేను చెప్పేదాకా మీకు తెలియలేదు. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అంత గొప్పగా ఉన్నాయి మరి. సరే.. మీ తెలివి గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకుగానీ.. అసలు విషయానికి వస్తా.. అమృతం తాగిన భస్మాసురిడి తల మాత్రమే అమరత్వం పొందింది. ఇప్పుడు మళ్లీ అతన్ని చిరంజీవిగా భూమిమీదకు తీసుకురావాలంటే, బలిచ్చే వారి తలతో మాకు పనిలేదు. యాగానికి కావాలసింది కేవలం మొండెమే. అయితే, ఆత్మలింగ ప్రతిష్ఠాపన కోసం ఆ మొండేన్ని కూడా రెండు ముక్కలు చేయాలి. అప్పుడే ఈశ్వర కటాక్షంతో సకల సిద్ధులు పొంది భస్మాసురుడు ఈ భూమండలాన్ని ఏలుతాడు’ అంటూ మళ్లీ గట్టిగా నవ్వాడు శరత్.
దీంతో చిర్రెతుకొచ్చిన రుద్ర.. ‘ఒరేయ్ పిచ్చోడా. సినిమాలు చూసి ఆత్మలింగం, బలిపీఠం అంటూ ఏమేమో మాట్లాడుతున్నావ్. నీ సంగతి ఇలా కాదు. చంద్రమతి భర్తను కాపాడి వచ్చాక నీ పని పడతా’ అంటూ రుద్ర వెళ్లబోయాడు. ఇంతలో కలుగజేసుకొన్న శరత్.. ‘ఒరేయ్ పెద్ద పిచ్చోడా. ఆ చంద్రమతి పెనిమిటిని కాపాడటానికి నీ చెంచాగాళ్లు ఉన్నారుగా. వాళ్లను పంపించు. ఆ పనికి కూడా నువ్వెందుకు రయ్యిమంటూ పోతున్నావ్. పబ్లిసిటీ పిచ్చి నీకు బాగా ఎక్కినట్టుంది. సైకో గేమ్ ఎపిసోడ్లో కూడా అంతే.. ప్రతి దానికీ ఏదో షెర్లాక్ హోమ్స్లాగా తెగ బిల్డప్ ఇచ్చావ్. చూడలేకపోయాం. ఇకపై నీ డెకరేషన్ ఆపకపోతే, సీన్ సితారే! నేను నెక్ట్స్ బలిచ్చే మేకను ముందు కనిపెట్టు. అంతేగానీ, హీరోలాగా బిల్డప్స్ వద్దు. మన డీల్ ప్రకారం.. ఎప్పటిలాగే 5 ప్రశ్నలు అడుగుతా. కరెక్ట్ ఆన్సర్లు చెప్పి రెండో నెంబర్‌ను కాపాడుకో. లేకపోతే, ఈ గేమ్‌ను ఇక్కడితో ఎండ్ చేద్దాం. అలాగైనా నేను త్వరగా చనిపోతా. అప్పుడు మళ్లీ పుట్టి.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగానికి మళ్లీ అంకురార్పణ చేస్తా’ అంటూ శరత్ గట్టిగా నవ్వాడు. శరత్ మాటలతో కోపం వచ్చినప్పటికీ, రెండో వ్యక్తిని ఎలాగైనా కాపాడాలన్న లక్ష్యంతో సరేనని తలూపాడు రుద్ర. చంద్రమతి భర్తను కాపాడాలంటూ స్నేహిల్, రామస్వామితో పాటు ఇద్దరు పోలీసులను పురమాయించాడు.
శరత్ ప్రారంభించాడు. రెండో వ్యక్తిని కాపాడటానికి నేను అడుగుతోన్న మొదటి ప్రశ్న: ‘జడ్జి కొడుకు పోలీసు. పోలీసు తండ్రి దొంగ. మరి జడ్జి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..టూ’ రుద్ర ఆన్సర్ చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. మన హిందూ సాంప్రదాయంలో చెవులు ఎందుకు కుట్టిస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న.. ‘ఇంగ్లిష్‌లో మనం తరుచూ OK అని వాడుతాం కదా? దాని ఫుల్‌ఫామ్ ఏంటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న.. ఆకులు లేని అడవిలో.. జీవంలేని ఓ జంతువు.. ప్రాణం ఉన్న జీవాలను వేటాడుతుంది. ఏంటది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. ’ రుద్ర సమాధానం చెప్పాడు. చివరి ప్రశ్న. నేను ఇప్పుడు బలివ్వబోయే వ్యక్తి పుట్టిన తేదీ 12-01-2001. ఆ వ్యక్తి పేరు ఏంటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ.. ఫోర్..’ రుద్ర సమాధానం చెప్పాడు. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పిన రుద్రతో ‘శభాష్ రుద్ర. బాగా చెప్పావ్. బంధించిన రెండో వ్యక్తిని కాపాడుకోవాలంటే దక్షిణ దిక్కున ఊడల మర్రి కింద చిన్న గదికి వెంటనే వెళ్లు. లేకపోతే, ‘నల్లమల చైన్సా’ విజృంభిస్తుంది’ అంటూ నవ్వాడు శరత్. అసలేమైతుందోనన్న భయంతో జయ, శివుడు అండ్ టీమ్‌తో శరత్ చెప్పిన అడ్రస్‌కు పరిగెత్తాడు రుద్ర. అది పక్కనబెడితే, రుద్ర అన్సర్లను మీరు కనిపెట్టారా?
సమాధానాలు:మొదటి సమాధానం: తల్లిరెండో సమాధానం: చెవి ప్రాంతాల్లో ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. పోగులను కుట్టించడం ద్వారా అవి ఉత్తేజితమై కంటి చూపు, వినికిడి శక్తి పెరుగుతుంది. చెవులు కుట్టించుకోవడం ద్వారా స్త్రీ-పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం కూడా మెరుగవుతుంది.
మూడో సమాధానం: OK-అబ్జెక్షన్ కిల్ల్డ్
నాలుగో సమాధానం: దువ్వెన
ఐదో సమాధానం: ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ ప్రకారం.. (12-01-2001) అంటే 12=L, 01=A, 20=T, 01=A .. అంటే బలిచ్చే రెండో వ్యక్తి పేరు LATA-లత.
–రాజశేఖర్ కడవేర్గు