‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
దేవర ముందు కూర్చున్న పెద్ద పటేలు చేయి ఊపాడు.. ‘ప్రారంభించండి!’ అన్నట్లుగా.పక్కనే కూర్చున్న పూజారి పిడికిలితో పసుపు తీసి దేవర మీద చల్లాడు. ఆ క్షణం కోసమే కాచుకు కూర్చున్న కొమ్ముబూరలు గాలిలోకి లేచాయి. ఒక్కసారిగా అందరూ బూరలు ఊదగానే.. ‘డమ్‌డమ్’ అంటూ డోలు వాద్యాలు మోగాయి. ఆ శబ్దం.. చుట్టూ ఉన్న కొండల్లో ప్రతిధ్వనిస్తూ లయాన్వితంగా మోగసాగింది. పెద్ద పటేలు లేచి వారి దగ్గరికి వచ్చాడు.
“బెర్ర పటేలు వాసోమందోడు” అని గుసగుసగా చెప్పిందో ఒక అమ్మాయి.
భుజాల మీద చేతులు వేసుకొని నిలబడ్డ కోయ పడతుల దండ, కొండ చిలువలాగా కదిలింది.
“రేరేలాయో రేరేలాయో.. రేలా రేలా
రేల రేలా, రేలా రేలా, రేల రేలా, రేలా రేలా
ఇత్తాకిని పుంగారే లచ్చీ నా బంగారే
తాడిగుంట టీయ్ టోయ్..” అంటూ గానం సాగింది.
ఆ పాటకు అనువుగా డోలు వాద్యాలు మోగాయి. అడవి మారుమోగింది. దేవరకు పూజ ప్రారంభమైంది.
కొండ దేవరకు పూజ చేస్తున్న ఆ ప్రాంతం భద్రాచలం అడవుల్లో చింతూరు నుండి మధ్యప్రదేశ్ వెళ్లే మార్గంలో ఉంది. అక్కడంతా భాష కోయలు ఉంటారు. ఆ ప్రాంతం దాటి ఇంకా ముందుకు అడవుల్లోకి వెళితే.. గోండు జాతి వారు ఉంటారు.
భాష కోయల పండుగల్లో కొండదేవర పండుగ చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత పచ్చ పండుగ, భూమి పండుగ, చిక్కుళ్ల పండుగ అంటూ చాలా పండుగలు చేసి దేవరను పూజిస్తారు. భాష కోయలు నిష్కపటంగా ఉంటారు. నమ్మితే ప్రాణాలు ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించరు.
అడవిలో అందరి ఇళ్లూ ఒకచోటనే ఉండవు. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు ఉంటాయి. అన్నిటినీ కలిపి ఊరు లేదా గుంపు అంటారు. ఆ ఊరి పేరు చింతలమెట్ట.
చింతలమెట్ట గుంపులో నక్కలబోడు ప్రదేశంలో ఒక కోయగుడిసె ఉన్నది. దాంట్లో సిరవడు, లచ్చి కాపురం ఉంటున్నారు. సిరవడు అనే పదం శ్రీరాముడు అనే పేరుకు వికృతి కాబోలు. కోయల పేర్లు అలాగే ఉంటాయి.
చింతలమెట్ట పక్కనే ఉన్న ఎస్టేట్ రాజారాం దొరది. వాళ్ల తాతల కాలం నుండి అది వారి అధీనంలోనే ఉన్నది. సిరవడి తండ్రి అరసడు కూడా ఆ ఎస్టేట్‌లోనే పనిచేసేవాడు. ఆ కుటుంబానికి జీతం ఇచ్చి తగు సౌకర్యాలు కల్పించేవారు ఆ దొరలు. అడవికి దూరంగా గౌరీపేటలో రాజారాం నివసించే భవంతి ఉన్నది.
రాజారాం దొర ఆరోజు పనిమీద దూరంగా వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అడవి ప్రాంతం కాబట్టి కార్లు ఉపయోగించరు. అతను ఎప్పుడూ జీపులోనే ప్రయాణం చేస్తాడు. తను బయలుదేరిన ప్రదేశం నుంచి చుట్టూ తిరిగి వెళితే రాత్రిపూట చాలా ఆలస్యం అవుతుందని, తమ ఎస్టేట్ గుండా చింతలమెట్ట మార్గంలో దగ్గరతోవ ఉండటం వల్ల, ఆ దారిలోనే ప్రయాణం చేయాలనుకున్నాడు రాజారాం దొర.
సాయంకాలం అవుతున్నది. మరో గంట ప్రయాణం చేస్తే ఇంటికి చేరిపోతాడు. కానీ, అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ఒక్కోసారి కుండపోత వర్షం కొద్దిసేపు ఆపకుండా కురిస్తే.. అడవిలో వాగులు, ఒర్రెలు పొంగి పారుతాయి. చాలాసేపటి దాకా ఆ నీటి ఒరవడి తగ్గదు. ఆ నీటి ప్రవాహం వేగంగా ఉండటం వల్ల దాటడానికి అవకాశం ఉండదు.
రాజారాం పరిస్థితీ అదే అయింది. ఒర్రె బాగా పారుతూ ఉండటం వల్ల దాటలేక పోయాడు.
వర్షం, బురద వల్ల జీవు ముందుకుపోలేని పరిస్థితి ఏర్పడింది. జీవును అక్కడే ఆపేసి సిరవడి ఇంటివైపు నడిచాడు దొర. సిరవడిని తోడు తీసుకుని ఎస్టేట్‌కి వెళ్లి, ఆరోజు అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు ఇంటికి వెళ్లవచ్చు అనేది రాజారాం ఆలోచన. సాయంకాల సమయం. సిరవడి గుడిసె దగ్గరికి చేరుకున్నాడు.
“సిరవా!” అని పిలుపు వినిపించే సరికి, తడిక పక్కకు జరిపి.. బైటికి తొంగి చూసింది లచ్చి.
వర్షంలో తడుస్తూ వచ్చిన దొరను చూసి ఆశ్చర్యపోయింది.
“రండి దొరా! లోనకు రండి” అంటూ దొరను ఆహ్వానించింది.
వర్షంలో తడుస్తున్న దొర గుడిసెలోకి అడుగు పెడుతూ..
“సిరవడు లేడా?” అని అడిగాడు.
“లేడు దొరా! గౌరీపేటకి పోయిండు. గట్లనే మీ ఇంటికి కూడా పోయి వస్తనని.. జుంటి తేనె, చింతపండు, అడవి పండ్లు తీసుకపోయిండు దొరా! అయ్యో.. గట్లనే నిలబడ్డరు. లోనకి రండి దొరా” అన్నది లచ్చి.
గుడిసెలోకి వెళ్లి చుట్టూ చూశాడు దొర. చిన్న గుడిసె. మధ్యలో తడిక ఉంది. దాని అవతల వంట పొయ్యి ఉన్నది. చాలాసార్లు ఆ ఇంటివైపు వచ్చాడు కానీ, సిరవడి గుడిసెలోకి ఎన్నడూ తొంగి చూడలేదు.
మంచంలో ఆడుకుంటున్న చిన్నబాబును తీసి తడిక లోపలి మంచంలో పడుకోబెట్టింది లచ్చి. మంచం మీది బట్టలు తీసేసి శుభ్రమైన చెద్దరు పరిచింది.
“దొరా!”.. అంటూ తల తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది.
“సిరవడు ఎప్పుడొస్తానన్నడు లచ్చీ” తల తుడుచుకుంటూ అడిగాడు దొర.
“బెగే ఒత్తానన్నడు దొరా! ఈపాటికి వచ్చేయాల. ఒత్తా ఉంటడు”
దొర ఫోన్ తీసి ట్రై చేశాడు. సిగ్నల్ కలవడం లేదు. లచ్చి గ్లాస్‌తో డికాక్షన్ తెచ్చి ఇచ్చింది.
“దొరా! తడిసిపోయి ఉన్నరు. కాత్త ఏడిగా ఉంటదని డికాసను చాయ్ చేసిన. మాకు పాలు దొరకవు దొరా”
“ పర్వాలేదు లచ్చి! ఇలా ఇవ్వు” అంటూ గ్లాస్ తీసుకొని తాగాడు దొర.
ప్రయాణ బడలిక, వర్షపు చల్లటి గాలి నుండి ఈ డికాక్షన్ మంచి రిలీఫ్ ఇచ్చింది.
“జగదల్పూర్ పోయి వస్తుంటే మధ్యలో వర్షం ప్రారంభమైంది. సిరవడిని తోడు తీసుకుని ఎస్టేట్‌కు వెళదామని వచ్చిన”
“ఒత్తడు దొరా! మీరు కూతంత ఇసరాంతి తీసుకోండి. ఈ వానల ఎట్టా పోతరు. తగ్గినంక పోదురుగాని. ఈలోపు సిరవడు ఒత్తడు”
కానీ, వాన ఏమాత్రం తెరిపి ఇవ్వడం లేదు. కుండపోతగా కురుస్తూనే ఉంది. చీకటి పడింది. కానీ, సిరవడు రాలేదు. ఇంటికి ఫోన్ చేయాలని ట్రై చేస్తున్నాడు దొర. ఫోన్ సిగ్నల్ కలవడం లేదు.
లచ్చికి కూడా ఆత్రుతగా ఉంది. దొర వచ్చి ఉన్నాడు. బయట వర్షం తగ్గడంలేదు. సిరవడు ఇంకా రాలేదు. ఆమెకు ఏం చేయాలో తోచడం లేదు. ఒకవేళ సిరవడు వచ్చినా దొర కొరకు భోజనం ఏర్పాటు చేయాలి కదా. అందుకని అన్నం వండింది. కోడిగుడ్లు కూర చేసింది. చారు చేసింది.
‘దొర మాకు దేవునసొంటోడు. గసొంటి దేవర మా ఇంటికొచ్చిండు. ఆయినెకు ఎసువంటి మర్యాద చేయాల్నో ఏమో!? సిరవడు వస్తే బాగుండును’ అనుకున్నది.
కానీ బాగా చీకటి పడటంతో..
‘ఈ వానల సిరవడు అచ్చుడు సుత కట్టమే!’ అనుకున్నది లచ్చి.
“బాగా రేతిరి అయింది దొరా! ఇంకా వాన తగ్గలేదు. సిరవడు ఎప్పుడొత్తడో ఏమో!? మీరు కూతంత కూడు తిని పడుకోండి. బాగా అలసిపోయి ఉన్నరు” అన్నది లచ్చి.
దొర ఏమీ మాట్లాడలేదు. ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. మౌనంగా ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ సిగ్నల్ కలవడం లేదు.
అరుగు మీద కొయ్యకు తగిలించి ఉన్న సొరకాయ బుర్ర గుర్తుకువచ్చింది లచ్చికి.
‘మద్దేన్నపేల సుక్కయ్య మామ తెచ్చిన జీలుగు కల్లు ఉన్నది. దొరకు కొంచెం పోస్త. ఇంత కూడు దిని పండుకుంటడు’ అనుకున్నది లచ్చి.
గ్లాసు శుభ్రంగా కడిగి జీలుగు కల్లు ఒడియ పోసి తీసుకొచ్చింది.
“దొరా! జీలుగు కల్లు. కొంచెం రుచి సూడండి. చెట్టుమీది నీరం కదా, అలసట తగ్గి మంచిగ నిద్ర పడ్తది” అంటూ గ్లాసు చేతికి అందించింది.
దొర ఏమీ మాట్లాడకుండా గ్లాస్ తీసుకొని సిప్ చేశాడు. ఒంట్లో బడలిక, బయట చల్లటి గాలి. ఆ సమయంలో ఈ చల్లటి జీలుగు కల్లు రుచి కొత్తగా అనిపించింది దొరకు. ప్లేట్లో కోడిగుడ్ల కూర తెచ్చిపెట్టింది లచ్చి. రెండు మూడు గ్లాసులు తాగేసరికి సరిపోయింది దొరకు. కానీ జీలుగు కల్లు బాగా నిషాను కలుగజేసింది.
ఇంట్లో ఫారిన్ విస్కీ తాగే అలవాటున్న దొరకు.. ఆ కల్లు బాగా మత్తును కలుగజేసింది. రాత్రిపూట బాగా పొద్దుపోయింది. సిరవడు ఇంకా రాలేదు. ఇంట్లో తన భార్య డెలివరీకి ఉన్నది. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఏమో!? ఫోన్ కలవడం లేదు. వర్షం తగ్గడం లేదు. జీలుగు కల్లు నిషా, రప్పున తలకు ఎక్కుతున్నది. భార్య డెలివరీకి ఉన్నది. తనకు చాలారోజులుగా స్త్రీ సాంగత్యం లేదు. అడవిలో, గుడిసెలో, లచ్చి ఒక్కతే ఉన్నది. బయట చలిగాలి వీస్తున్నది. పాతిక సంవత్సరాల లచ్చి. నిండు ఆరోగ్యంతో కళ్లముందు తిరుగుతూ ఉంటే.. మనసు స్థిరం తప్పుతూ ఉన్నది. ఆలోచనలు కలగా పులగమై అదుపుతప్పాయి.
లచ్చి చేయి పట్టుకున్నాడు దొర.
దొరలోని ఈ వింత ప్రవర్తనకు లచ్చి ఆశ్చర్యపోయింది.
“దొరా!”.. భయంగా అన్నది లచ్చి.
“లచ్చీ.. నా కోరిక తీర్చవా? నిన్ను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నా. నిన్ను కోరడం నాది తప్పే. అయినా నిగ్రహించుకోలేక పోతున్నా. నా కోరిక తీర్చు..!” మత్తులో ఉన్నాడు దొర.
దొర బేలగా అభ్యర్థించేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకు.
“దొరా! మీరు మాకు దేవర. మీ ఉప్పు తిని బతుకుతున్నం. వరాలు ఇచ్చే దేవుడే వచ్చి, కోరిక తీర్చమని అడుగుతా ఉంటే.. నేను ఏం సెప్పాలె దొరా! కానీ, నేను ఒకరికి ఆలిని కదా. నన్ను ఆ సూపుతో సూడటం తప్పు కదా దొరా”
“అవును! నాకు తెలుసు లచ్చి. కానీ నాకిప్పుడు ఆడదాని సాంగత్యం కావాలనిపిస్తుంది. కోరికతో మనసు నిలకడ ఉంటలేదు. కాదనకు..!” అంటూ ఆమె కాళ్లు పట్టుకున్నాడు దొర.
అప్పటికే జీలుగు కల్లు మత్తు బాగా తలకెక్కింది అతనికి. తనపై తాను నియంత్రణ కోల్పోతున్నాడు.
“సరే.. గట్లనే దొరా! ముందు మీరు కూడు తినండి. ఈలోపు నేను బుడ్డోణ్ని పండుకోబెట్టి వస్త. మీరు మాకు దేవర. మీ కోరిక తప్పకుండ తీరుస్త దొరా” అంటూ నచ్చజెప్పి, దొరకు అన్నం తినిపించింది. కొడుకును నిద్రపుచ్చి, తాను తిని వచ్చింది.
మంచంలో కూర్చుని ఉన్నాడు దొర. అన్నం తిన్న తర్వాత అతని మనసు కాస్త స్థిమిత పడింది. కల్లు ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఫోన్ సిగ్నల్ కలిసింది. ఇంటి నుండి వచ్చిన వీడియో ఓపెన్ చేసి చూశాడు. అతని మత్తు పూర్తిగా దిగిపోయింది.
మంచంలో కూర్చున్న దొర కాళ్ల దగ్గర కూర్చుంది లచ్చి. నేల మీద కూర్చుని, అతని కాలు మీద తడుతూ..
“దొరా! నేను వచ్చిన. బుడ్డోడు నిద్రపోయిండు” అన్నది పొడిపొడిగా.
దొర ఏమీ మాట్లాడకుండా అచేతనంగా ఉండటం చూసి అతని మొహంలోకి చూసింది లచ్చి. అతని కంటి నుండి నీటి చుక్కలు కారి ఆమె ముఖంపై పడ్డాయి. ఉలిక్కి పడింది లచ్చి.
“దొరా.. ఏమైంది? ఏమన్నా తప్పు జరిగిందా? మీరు మాకు దేవర. మీ కోరిక తీర్చుతనని సెప్పిన కదా!”
దొర మౌనంగా ఫోన్ ఆన్‌చేసి ఆమె చేతికి ఇచ్చాడు. ఈరోజు అతని ఇంట్లో జరిగిన విషయమంతా చాలా వివరంగా ఉంది ఆ వీడియోలో. లచ్చి ఆసక్తిగా చూడసాగింది.
గౌరీపేటలోని దొర భవంతిలోకి సిరవడు అడుగుపెట్టగానే.. వర్షం ప్రారంభమైంది. పెద్ద దొరసాని సిరవడిని చూసి..
“సిరవా! అమ్మగారికి నొప్పులు వస్తున్నయి. మంత్రసాని వచ్చింది. దొర కూడా సమయానికి లేడు. నువ్వు ఈ పూట మాకు తోడుగా ఇక్కడే ఉండాలి” అన్నది.
“గట్లనే తల్లీ! ఈడనే ఉంట” అన్నాడు సిరవడు.
ఆ ఇంటికి సేవ చేయడం తన భాగ్యం అన్నట్లుగా జవాబు ఇచ్చాడు అతను. దొరసానికి నొప్పులు ఎక్కువైనాయి. కానీ, కానుపు కష్టమైపోయింది. బిడ్డ అడ్డం తిరిగి.. తల్లీపిల్ల ప్రమాదంలో పడ్డారని మంత్రసానికి అర్థమైంది.
పక్కూరు నుండి డాక్టరమ్మను తీసుకురావాలి. కానీ, వర్షం వదలకుండా జోరున కురుస్తున్నది.
“సిరవా! అమ్మగారికి కడుపుల బిడ్డ అడ్డం తిరిగింది. ఆమె ప్రాణం ప్రమాదంలో ఉన్నది. పక్కూరు నుండి డాక్టర్‌ను తీసుకురాకపోతే ప్రాణాలు దక్కవు. ఏం చేద్దాం” అన్నది పెద్ద దొరసాని.
“డాక్టరమ్మను ఎట్లనైన తీసుకొస్త దొరసాని” అన్నడు సిరవడు.
ఆ వర్షంలోనే బయల్దేరాడు.
డాక్టరమ్మ ఉండే ఊరికి, దొర భవంతికి మధ్యల ఒక కాలువ ఉన్నది. ఈ కుండపోత వర్షానికి ఆ కాలువ పొంగి పారుతున్నది. మనుషులను దాటనివ్వడం లేదు. కానీ, సిరవడు ఊరుకోలేదు. అతని మనసులో ఒకటే ఆలోచన మెదుగుతూ ఉన్నది.
‘డాక్టరమ్మ రావాలె! దొరసాని బతకాలె!’..
కాలువ దాటి డాక్టరమ్మ ఇంటికి చేరాడు. కానీ, ఈ వర్షంలో రావడానికి నిరాకరించింది డాక్టరమ్మ.
డాక్టరమ్మ కాళ్లు పట్టుకున్నాడు సిరవడు. ఆమె వస్తాననేదాకా వదిలిపెట్టలేదు. కానీ, కాలువ దాటడం ఒక సమస్యగా ఉన్నది. కాలువ ఒడ్డుకు చేరిన తర్వాత.. డాక్టరమ్మను ఎత్తుకొని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ వర్షంలోనూ, వరదలలోనూ అతి కష్టంమీద డాక్టరమ్మను భుజంపై మోస్తూ కాలువ దాటించాడు. దొర ఇంటికి తీసుకువచ్చాడు.
అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్నది దొరసాని. సమయానికి వచ్చి రెండు ప్రాణాలనూ కాపాడింది డాక్టర్.
పెద్ద దొరసాని డాక్టరమ్మకు చేతులెత్తి మొక్కింది. డాక్టరమ్మ ఆమెను వారిస్తూ..
“పెద్దవారు.. మీరు నాకు దండం పెడితే ఆయువు తగ్గుతుందని అంటారు. నిజంగా మీరు దండం పెట్టాల్సింది సిరవడికి. ఈ వర్షంలో నేను రానని అంటే.. నా కాళ్లు పట్టుకొని వదలలేదు. చిన్నపిల్లను ఎత్తుకున్నట్లు భుజాలపైకి ఎత్తుకొని కాలువ దాటించాడు. ఈ రెండు ప్రాణాలు నిలబడ్డాయి అంటే.. ఆ క్రెడిట్ అతనికే దక్కుతుంది” అన్నది.
వీడియో అయిపోయింది. ఆ వీడియో చూసి సంతోషంతో తల మునకలైంది లచ్చి.
“దొరా! సిరవడు నాతోటి చాలాతూర్లు అన్నడు.. ‘మన దొర రునం ఎట్టా తీరతాది లచ్చీ!’ అని. ఇప్పుడు దొరసానికి, బిడ్డకు పానం పోసి ఆ రునం తీర్చుకున్నడు” అన్నది లచ్చి.
తన కాళ్ల దగ్గర కూర్చున్న లచ్చి తలమీద చేయివేసి నిమిరాడు దొర.
“నిజమే లచ్చీ! అక్కడ రెండు ప్రాణాలను కాపాడి సిరవడు రుణం తీర్చుకున్నాడు. కానీ ఇక్కడ మద్యం మత్తులో నిన్ను కోరరాని కోరిక కోరి, నేను మహాపాపం చేసిన”
“అట్టా అనమాకండి దొరా! మీరు మాకు దేవుడు. మా కుటుంబాలను కాసుకుంటున్న దేవర. మద్దెన ఈ కల్లు మత్తు బాగా చికాకు చేసింది దొరా! గంతే!”
“అవునే లచ్చీ! నా ఎస్టేట్‌లో బతికే మీరందరూ నా పిల్లల్లాంటి వాళ్లు. అందుకే మీ దేవర.. జీలుగు కల్లు రూపంలో నాకు పరీక్ష పెట్టిండు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గేటట్లుగ చేసిండు”
“దొరా! మీరు బాగా అలసిపోయినరు. పడుకోండి!” అంటూ దొరను పడుకోబెట్టి.. చెద్దరు కప్పింది లచ్చి.
కాళ్లు వత్తుతూ నిద్రపుచ్చింది. ఆ ఇంట్లో తడక అవతల బుడ్డోడు. తడక ఇవతల దొర.. నిద్రలో నవ్వుకుంటున్నారు. ఏం కలలు కన్నారో ఏమో!?
ఎస్.నాగేందర్‌నాథ్ రావు
‘మంచికి-చెడుకు’ మధ్య జరిగే పోరాటం, ‘మనసు-తనువు’ మధ్య రగిలే సంఘర్షణను పట్టిచూపే ప్రయత్నం.. ఈ ‘దేవర’ కథ. రచయిత ఎస్. నాగేందర్‌నాథ్ రావు. వీరి స్వస్థలం హైదరాబాద్. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 36 ఏళ్లు పనిచేసి, విరమణ పొందారు. తొలి నియామకం.. భద్రాచలం దగ్గరి కూనవరం ప్రాంతంలో ఉండే ఉప్పనపల్లి గుట్టల ప్రదేశం. అది పూర్తిగా అడవి ప్రాంతం. అక్కడందరూ కోయ ప్రజలే నివసించేవారు. అక్కడ ఉద్యోగం చేసిన సమయంలో కోయ భాష నేర్చుకున్నారు. వారి భాషలోనే మాట్లాడుతూ పిల్లలను ఆకట్టుకొని విద్యా బోధన చేసేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా పొందారు. తన సర్వీసు మొత్తం గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులతోనే గడిపారు. రచయితగానూ అనేక కథలు, పాటలు, వ్యాసాలు, కవితలు రచించారు. వీటిలో చాలావరకు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. వీరి రచనలు మొత్తం ఏడు పుస్తకాలుగా ప్రచురించారు. 2016లో ‘అమ్మ’ కథల సంపుటి, 2023లో ‘గెలుపు’ కథల సంపుటి ప్రచురితం అయ్యాయి.
ఎస్.నాగేందర్‌నాథ్ రావు
99638 22520