Cricket match | సిరిసిల్ల టౌన్ , జూలై 20 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు మేము క్రికెట్ ఆడుకోవడానికి పనికొస్తున్నదని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల మానేరు వాగును ఎడారిలా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆదివారం వాగులో క్రికెట్ ఆడి వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి సిరిసిల్ల ప్రజల మీద కక్షతో మిడ్ మానేరు నింపకుండా ఉండడం వల్ల సిరిసిల్ల మానేరు నది పూర్తిగా ఎండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిరిసిల్ల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల అడుగంటుతున్నాయని, బోర్లు 600ల నుండి 700 ఫీట్లు వేసిన నీళ్లు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు. సిరిసిల్ల ప్రజల తాగునీటి కష్టాలకు ముఖ్య కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సిరిసిల్ల నియోజకవర్గ, పట్టణ ప్రజలకు జీవనది అయినా మానేరు వాగు ఎండిపోవడంతో సిరిసిల్ల ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ఇదే విధంగా మరికొన్ని రోజులు గడిస్తే సిరిసిల్ల ప్రజలందరూ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులను ప్రతి గల్లీలో తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మానాల అరుణ్, పట్టణ ఇoచార్జి మేట్టల సాయి దీపక్, నాయకులు కనుకుంట్ల వెంకటరమణ, వలభోజు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.