గొల్లపెల్లిల పీరీల పండుగు. పీరీల పండుగంటే ఊరంత పండుగే. ఊరంత అంటే ఒక్క ఈ ఊరే కాదు. అటు రాజన్నపేట ఇటు కోరుట్లపేట, అటు గుండారం ఇటు సింగారం.. సుట్టు పదూర్ల పెట్టు పది రోజులు పండుగే! కుడుకల పేర్లమ్మే కాశీం నుంచి జిలేబీలు అమ్మే మిటాయి రాజేషం దాకా.. బొమ్మలు, పుల్లనగొయ్యలు అమ్మే బుకోల్ల బాషుమియ్య నుంచి అద్దాలు, తాళాలు అమ్మే పూసవేర్ల నర్సమ్మ దాకా.. ‘పండుగు ఎప్పుడత్తదా!?’ అని ఎదురు సూత్తుంటరు.
బాలరాముని గుడి కట్టిన నుండి.. గొల్లపెల్లిల పీరీల పండుగు ఎంత గొప్పగ జరుగుతదో.. శ్రీరామ నవమి కూడా అంతే గొప్పగ జరుగుతది. ఈసారి పీరీల పండుగు సుత శ్రీరామ నవమి నాడే వత్తుంది. ఊరంత మామూలుగనే ఉన్నరుగనీ, పూజ జేసే అయ్యగారు మాత్రం..
“పీరీలంటే సచ్చిన శవాలే గదా! ఊర్లె శవాలుండంగ రాముల కల్యాణం ఎట్ల జేత్తం?” అన్నడు.అంతే.. అప్పుడు మొదలయింది సమస్య. వార్త చేరాల్సినోళ్లకు చేరింది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చిండ్రు.“అయితే ఏబీసీ గాన్ని కచ్చీరుకాడ కొట్టద్దు. ఎదురుంగనే గుడికదా!”.. అన్నది దేవాలయ కమిటీ.“ఎప్పుడు కొట్టిన జాగలనే కొడుతం. కొత్తగ ఎట్ల మారుస్తం” మజీద్ కమిటీ అన్నది.
“మీరు ఏబీసీ గాన్ని ఎట్ల కొడుతరో సూత్తం. ఊర్లె ఒక్క తురుకోడు గూడ ఉండకపోవాలె”.. దేవాలయ కమిటీ సవాల్.“ఏం జేత్తరో సూత్తం. ఊరు మీదేగని మాదిగాదా!” మజీద్ కమిటీ ఎదురు సవాల్.ఇద్దరూ జిద్దు మీదనే ఉన్నరు. రెండు పండుగులను భక్తి శ్రద్ధలతో చేసుకునే ఊరు జనం మాత్రం మామూలుగనే ఉన్నరు.అప్పుడే కొత్తింటి తిరుపతి రెడ్డి బిడ్డ శ్రావణికి పెళ్లి కుదిరింది. బట్టలు కొనడానికి తల్లిబిడ్డలు ఇద్దరు సిరిసిల్లకు పోయిండ్రు. శ్రీరామ నవమి ఏర్పాట్లు ఉండి తిరుపతి రెడ్డి పోలేదు. బస్సులు ఎక్కుడు దిగుడు ఎందుకని ఊరిలో నాగరాజు ఆటో ఉంటే కిరాయికి మాట్లాడుకుని పోయిండ్రు.తల్లి విశాల షాపింగ్ మాల్లో పట్టు చీరలు ఏరుతుంటే.. శ్రావణి పెద్ద బజార్ల గాజులు, మేకప్ సామాను తెస్తనని ఒక్కతే పోయింది. జెప్పన వత్తనని పోయిన పిల్ల ఇగ రాలే అగ రాలే! పోన్ జేత్తే స్విచాఫ్ వచ్చింది. పొద్దుగూకంగ ఎవలో బండిమీద గాంది కాడ దించి పోయిండ్రు.
ఎందుకు లేటయిందంటే..“దోస్తులకు కార్డులు ఇయ్యడానికి పోయిన!” అన్నది.ఈ ముచ్చట ఇంటికచ్చినంక తండ్రితో చెప్పింది తల్లి. శ్రావణి నిద్రపోయినంక అనుమానంగా సెల్‌పోన్ చెక్ చేసిండు తిరుపతి రెడ్డి. కాల్ లాగ్, వాట్సాప్ మెసేజ్‌లు అన్ని డిలేట్ చేసిందికనీ.. టెలీగ్రామ్ మెసేజ్‌లో దొరికిపోయింది. తిరుపతి రెడ్డి గుండె బగ్గుమన్నది. మానిందనుకున్న పుండు మల్ల లేచినట్టయింది.“ఆ తురుకోన్ని తన్ని ఊర్లెనుంచి తరిమినా బుద్ధిరాలేదు. జరాగు.. వాని సంగతి జెప్పుత” అంటూ ఎవరికో పోన్ చేసిండు.“అరేయ్.. ఇదే మంచి చాన్స్. ఏబీసీ గాన్ని కొట్టిన జాగలనే మీర్‌సాబ్ గాని తల పలుగాలె. మనమీద ఎవ్వనికి అనుమానం రాదు. హిందూ ముస్లిం కొట్లాట అనుకుంటరు” అంటూ అగ్గిమీద గుగ్గిలమైండు.తెల్లారి నుంచి శ్రావణిని ఇంట్లనుంచి కదులనియ్యలేదు. సెల్‌పోన్ చేతికియ్యలేదు. వెయ్యి కండ్లతో కావలి గాత్తండ్రు.ఊర్లె పీరీల పండుగు వంతుల మీద జేత్తరు. ఈసారి పండుగు వంతు సత్తెలాల్ గౌడ్‌ది. వారం కిందనే మసీదును కడిగి సున్నమేసిండు. పీరీలను కిందికి దించి దురస్తు చేసిండు. ఆలువ గుండం తవ్వి చుట్టు బొద్ది గట్టిండు. నెల పొడుపునాడు ఎన్నీలను చూసి పీరీలు నిలవెట్టిండ్రు. పది రోజుల పీరీల పండుగు మొదలయింది. మరోవైపు రాములవారి భజన కూడా మొదలయింది. లాల్శావా, దూద్ పీరి, సత్తె పీరి, కొత్త పీరి, బీరోళ్ల పీరి.. ఇట్ల శాతకొక్క పీరిని నిలవెట్టిండ్రు. ఒక్కోనాడు ఒక్కో పీరి లేస్తది. ఆ పీరి లేచిన్నాడు కులమంతా మసీదు ముందే ఉంటరు. అక్కడ గుడి సుట్టూ పందిర్లు ఏత్తండ్రు. పండుగు నాడు ఎంత కథనో అని ఊరంత భయపడుతుండ్రు. పొద్దు మాపు పోలీసులు తిరుగుతండ్రు.
మొదటి రోజు దూద్ పీరి లేచింది. ఏడాది నుంచి పీరీలకు మొక్కినోళ్లు పక్కీర్లయితున్నరు. మటికీలు తీస్తున్నరు. మట్టి చిప్పల బిచ్చం అడుగుతున్నరు. మలీదలు చదివిస్తున్నరు. దమ్ము పిల్లలను ఇస్తున్నరు. దస్తి గడుతున్నరు. పిల్లలు కానోళ్లు పిల్లల కోసం పీరీలకు ఎదురెళ్లి ఒడి వడుతున్నరు. పాణం బాగలేనోళ్లు పీరీలకింది నుంచి ఈగుతున్నరు. మొక్కినోళ్లు జాగారం జేత్తున్నరు. ఏషం ఏత్తున్నరు. పీరికి దీటి వడుతున్నరు.
ఇదే జనం.. రామ కోటి రాస్తున్నరు, తలువాల బియ్యాన్ని గోటితోని ఒలుస్తున్నరు. కొత్త దూదితో వత్తులు జేత్తున్నరు. దేవునికి ఓడిబియ్యం పొయ్యడానికి కుడుక కనుములు సదురుకుంటున్నరు. ఒక్క ఇంట్లనే మొక్కు ఉన్నదని కొడుకు పక్కీరైతె.. తండ్రి హనుమాన్ మాలేత్తండు. అత్త రాములవారి కోసం ఒడిబియ్యం కలిపితె.. కోడలు పీరీలకు మలీద కలుపుతంది. ఒక్క ఇంట్లనే.. ఒకలు భక్తితోని ‘బిస్మిల్లా’ అంటే, ఇంకొకలు గదే భక్తితోని ‘రాంలల్లా!’ అంటున్నరు.
ఒకసారి..ఊర్లె కుంకుమ గులాల్ అమ్మే బుక మీరాసాబ్ కొడుకు సలీం.. చెడ్డ సోపతులు వట్టి సదువు నడుమలనే బందు వెట్టిండు. ఊర్లెకు బస్సు సరిగ్గ వత్తలేదని వద్దు వద్దనంగ ఆటో కొన్నడు. గా ఆటోను రథం లెక్క తయారు జేత్తుండె..తాను గూడా హీరో లెక్క తయారయితుండె. అసలే పోరడు. ఆడిపిల్ల లెక్క అందంగుంటడు. తయారయితె ఇంకా బాగుంటడు. పొద్దు మాపు సిరిసిల్లలున్న డిగ్రీ కాలేజికి ఆడి పిల్లలను ఆటోలో దింపుతుండె. అట్ల యాడాది నడిపిండు. ఒకనాడు పొద్దంత ఇడువకుంట వాన. అయినా ఆటో తీసిండు సలీం. ఎప్పుడూ పొద్దుగూకంగనే వచ్చేటోడు. ఆ రోజు రాలే. సూడంగ సూడంగ కూరుకు రాత్రికి పెయ్యన్ని దెబ్బలతోని వచ్చిండు. ఏమయిందంటే.. ఆటో బోర్లవడ్డది అన్నడు. కానీ, ఆటోకు చిన్న నొక్కు కూడా లేదు. తెల్లారి చెప్పక చెయ్యక ఎటో పోయిండు. ఎంత దేవులాడినా దొరుకలేదు. మీరాసాబుకు ఎవలో చెప్పిండ్రు.. సత్తె పీరికి మొక్కితే సక్కగత్తడని. కొడుకు ఏశమోలె తిరిగత్తే సత్తె పీరికి ఏశం ఏపిత్తనని మొక్కిండు.
అనుకున్నట్టే నెల రోజుల్లో ఇల్లు చేరిండు సలీం. అగ్గో సగ్గోకు నాగరాజుకు ఆటోను అమ్ముకుని.. చెప్పకుండనే సిరిసిల్లకు పోయిండు. ఓసారి తాత కాలం జేసి, ఇంకోసారి తల్లి కాలుకు దెబ్బ తాకి మొక్కు అట్లనే ఉండిపోయింది. సలీం ఇప్పుడు రెండు వ్యాన్లు, నాలుగు ఆటోలు కొని సిరిసిల్ల కొత్త బస్టాండ్ పక్కన ట్రావెల్స్ పెట్టిండు. రెండు చేతుల సంపాదనలో పడి మొక్కును మర్చిపోయిండ్రు.కొత్తింటి తిరుపతి రెడ్డి బిడ్డ శ్రావణి డిగ్రీ చదువుతంది. ఒక్కతే బిడ్డ. గావురంగ పెరిగింది. పిల్ల ఎర్ర తేలు లెక్క అందంగ ఉంటది. ఊర్లె కాలేజికే ఫస్టచ్చింది. డిగ్రీ సదువుకు సిరిసిల్లల చేరింది. బస్సు యాల్లకు రాక.. వచ్చినా టైంకు అందక కాలేజికి సక్కగ పోయేది కాదు. ఇప్పుడు ఊర్లె సలీం ఆటోను కిరాయికి మాట్లాడుకున్నంక రోజూ పోతంది. ఒకనాడు వద్దు వద్దన్నా వినకుంట వాన పడుతున్నా.. పరీక్ష ఉందని ఒక్కతే సలీం అటోలో కాలేజికి పోయింది. రాత్రయినా తిరిగి రాలేదు. ఏమయిందని తెలుసుకుంటే.. ఆటో బోర్లవడ్డదన్నరు. తిరుపతి రెడ్డి బండి మీద వెళ్లి బిడ్డను తోలుకచ్చిండు. ఆరోజునుంచి శ్రావణికి బాగా జరమచ్చింది. బంతిపువ్వు లెక్కున్న పిల్ల కట్టెపుల్లయింది. సదువు సదువు అని కలువరిచ్చే పిల్ల కాలేజి మొఖమే చూస్తలేదు. ఎన్ని దవాఖానలు తిరిగినా జరం తగ్గిందికానీ మూగేశం తగ్గలేదు.
తిరిగి తిరిగి ఆశ చాలిచ్చుకున్న శ్రావణి తల్లి దేవలచ్చిమి ఒకనాడు రాముల గుడి ముందు నుంచి పోతూపోతూ దేవున్ని తలుచుకుని.. ‘నా బిడ్డ ముందటి లెక్క మందిల తిరిగితె రామకోటి రాపిచ్చి నీ లగ్గానికి తలువాలు పోపిత్త’ అని మొక్కుకుంది. ఆరునెల్లల్ల శ్రావణి మంచిగయింది. ఒకసారి ఓరకుండి పనికి రాక, ఇంకోసారి ఊర్లె లేక రెండేండ్లనుండి మొక్కు చెల్లియ్యలేదు. ఈసారి పెండ్లి కూడా కుదిరింది కాబట్టి రామకోటి రాస్తూ తలువాల బియ్యం ఒలుస్తుంది. పొన్నాల బాగయ్య కొడుకు వెంకటి బాగా సదువుకునే పిల్లగాడు. వీఆర్వో నౌకరి వత్తదని ఊరంత అనుకున్నరు. కానీ రాలేదు. సలీంగాని సోపతి వట్టి సదువలేదని తండ్రి కోపానికచ్చిండు. కొడుకు అలిగి ఇంటికే రాలేదు. సిద్దిపేటల రూంలనే ఉన్నడు. బాగయ్య ఒకనాడు మసీదు ముందు నుంచి పోతూ.. సలీంగాని సోపతి ఇడిసి నౌకరి తెచ్చుకుంటే సత్తెపీరికి దీటి పట్టిత్తనని మొక్కిండు. అదే ఏడు అనుకున్నట్టు నౌకరచ్చింది. ఒకసారి ట్రేనింగ్‌లో ఉండి ఇంకోసారి జరమచ్చి మొక్కు తీర్చుకోలేదు.
ఇప్పుడు పని బిజీలో పడి అటు బాగయ్య, ఇటు వెంకటి మొక్కు సంగతే మర్చిపోయిండ్రు.సోమారపు సాయిలు కొడుకు నాగరాజు వడ్ల పైసలు తెచ్చి ఇంట్ల పెట్టిన్నాడు.. పదివెయిలు పట్టుకుని పట్టపగలు మాయమయిండు. దేశమంత దేవులాడినా యాడ జాడ దొరుకలేదు. ‘ఇది సలీంగాని పనే. వాని అయ్యను తంతే కొడుకత్తడు. కొడుకుతో నాగరాజత్తడు!’ అని ఊరందరు అన్నరు. సాయిలు ఎవల మాట పట్టలేదు. ‘పదివెయిలు పోతెమానె గాని సలీంగాని సోపతి ఇడిసి నా కొడుకు తిరిగత్తె సాలు. సత్తె పీరీని ఎత్తిత్త!’ అని ఎదురు మొక్కు మొక్కిండు. ఇట్ల మొక్కిండో లేదో.. అట్ల నాగరాజు ఇల్లు చేరిండు. సలీందే ఆటో కొనుక్కుని బుద్ధిగా నడుపుకొంటుండు. ఒకసారి బీజాల కుట్టు ఆపిరీషన్ అయ్యి.. ఇంకోసారి మ్యానమామ కొడుకు పెండ్లయి మొక్కు చెల్లించలేదు. ఇప్పుడు ఊర్లెనే ఇంకో రెండు ఆటోలు కొని సంపాదనల వడ్డడు. అందరి లెక్కనే నాగరాజు కూడా మొక్కు సంగతి మర్చిపోయిండు. కానీ, శ్రావణి పెళ్లి బట్టలకోసం సిరిసిల్లకు పోయిన్నాడు మొక్కు యాదికచ్చింది. ఇంటికి రాంగనే మొక్కును తండ్రికి గుర్తు చేసిండు. సాయిలు కూడా సరే అన్నడు.
నాగరాజు పొద్దున లెవ్వంగనే తానం జేసిండు. మెడల పక్కీరు దండ ఏసి ఫక్కీరు అయిండు. తల్లి వాకిట్ల సానుపు సల్లింది కానీ ముగ్గు ఎయ్యలేదు. పొయ్యి అలికింది కానీ బొట్లు పెట్టలేదు. ‘బిస్మిల్లా నిర్రహిమ్’ అనుకుంటూ.. ఐదిండ్లు బిచ్చమెత్తి వచ్చిన బియ్యంతోని మలీద చేసి, పొద్దున్నే పీరీలకు సదివిచ్చిండు. రాత్రయింది. ఒక్కోనాడు ఒక్కో పీరి లేత్తుంది. ఐదోనాడు సత్తె పీరి లేసింది. కాపోల్ల శాత. సగమూరు వాళ్లదే. సత్తె పీరికి సత్తెముంటదని మొక్కితే పని అయినట్టే.. అన్న నమ్మకం ఎక్కువ. అందుకే దానికి మొక్కులు ఎక్కువ. లేచిననాటి నుంచి పండుగు అయ్యేదాక రాత్రంతా ఊరు మొత్తం తిరుగుతది. పీరిని ఎత్తుకునుడుకు పోటీ వడుతరు. ఊదు పొగ వేసి నెమలీక కట్టతో ఈపుమీద కొట్టే దాదుమియా, బూడిది బొట్టువెట్టె బాష, కుడుకల పేరు వేసే బషీరు, మొక్కేటోళ్లు, మొక్కులు తీర్చేటోళ్లు పీరి సుట్టు పెద్ద గుంపే ఉంటది. ఊరు ఊరంత తిరిగి ఏ తెల్లారు జామున్నో మసీదు చేరుతది.నాగరాజు సత్తె పీరిని ఎత్తుకున్నడు. కొద్దిసేపు దేవుడు నిండుకున్నట్టు ఎగిరిండు. ఎగిరీఎగిరీ సక్కగ బుక మీరాసాబ్ ఇంటికి పోయిండు. అక్కడ వాకిట్ల బంతి గట్టిండు. అస్సలు కడుప ముందు నుంచి జరుగలేదు.
ఇరుగు పొరుగోళ్లు..
“సాయబన్నా.. ఏదన్న మొక్కుకుని మరిచిపోతెనే పీరి ఇంటికత్తది. మొక్కుందా మరి. మతికి తెచ్చుకో” అన్నరు.అప్పుడు యాదికచ్చింది మీరాసాబ్కు కొడుకు మొక్కు.“అబ్బ.. దేవుని సత్తెం జూసినావు! నేను మరిచిపోయినగనీ దేవుడు మరువలే. సలీంగాన్ని రమ్మని ఏశం ఏపియ్యాలె!” అని పీరికి మొక్కుకున్నడు. అప్పుడు కదిలింది పీరి.ఎగురుకుంట ఎగురుకుంట సత్తెపీరి సక్కగ పొన్నాల బాగయ్య ఇంటికి పోయింది. అక్కడ నాగరాజు ఉగ్రరూపం ఎత్తిండు. ఎవలు ఆపినా ఆగలేదు. పీరి ఎత్తుకుని బంతి కట్టిండు. అక్కడ నాలుగు దప్పులు కూడా తోడయినయి.“బాగన్నా.. ఏమన్న మొక్కుంటే యాది జేసుకొ. పీరి ఉత్తగ రాదు. దేవుడు కోపం మీదున్నడు” ఎవలో అన్నరు.
బాగయ్యకు దీటి మొక్కు యాదికచ్చింది. వెంటనే చెంపలేసుకుని దండం పెట్టి.. కొడుకు వెంకటితో దీటి వట్టిత్తనని మొక్కుకున్నడు. అప్పుడుగాని పీరి ఇంటి ముందునుంచి కదులలేదు.
తెల్లారింది. శ్రావణి రామకోటి రాస్తూ తలువాల బియ్యం కోసం వడ్ల గింజలను గోటితో ఒలుస్తంది. వెంకటి సెలవు పెట్టుకొని పగటి పూట ఊర్లెకు వచ్చిండు. పీరి ముందు పట్టడానికి దీటిని, నూనెను తయారు చేసుకుంటుండు. పొద్దంత ఒక్కపొద్దున్న సలీం.. సాయంత్రం పూట ఇంటికచ్చిండు. ఆడి ఏశమెయ్యడానికి బట్టలు తయారు చేసుకున్నడు. చిలుక పచ్చ చీర కట్టి.. ఎర్ర జాకిట్ తొడుక్కున్నడు. మీసాలు, గడ్డం తీసుకున్నడు. నెత్తికి సౌరం గట్టుకుని జడేసుకున్నడు. కాళ్లకు పట్టగొలుసులు, చేతులకు గాజులు, చెవులకు కమ్మలు, ముక్కుపుల్ల పెట్టుకుని.. అచ్చం ఆడిపిల్ల లెక్కనే తయారయిండు.
“ఏందిరా.. ఏదో ఏశం ఏసినట్టు ఉండాలెగనీ, నిజంగనే ఆడిపిల్ల లెక్క తయారయినవు. నేనే గుర్తువడుతలేను”.. కొడుకును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది తల్లి. సలీం నడుసుకుంటూ పీరీల దగ్గరికి వచ్చిండు.మసీదు సుట్టూ జనం. లేచే పీరీలు లేత్తున్నయి. ఎగిరే పీరీలు ఎగురుతున్నయి. తీరే మొక్కులు తీరుతున్నయి. మొక్కే మొక్కులు మొక్కుతున్నరు. మొగోళ్లు ఆలువాడుతున్నరు. ఆడోళ్లు ఆశన్న ఊశన్న ఆడుతున్నరు.
సత్తెపీరీని నాగరాజు ఎత్తుకున్నడు. ముంగట వెంకటి దీటి వట్టుకున్నడు. పక్కన సలీం నిలవడ్డడు. సుట్టూ జనం. జనంలో మీరాసాబు గూడా ఉన్నడు. దీటి వెలుగులో పీరి మసీదు నుంచి ఊర్లెకు పోతంది.తెల్లారితే నవమి. రాత్రిపూట పూజలు. రామకోటి రాసుకున్నోళ్లు, తలువాలు మొక్కుకున్నోళ్లు.. దప్పుల సప్పుడుతో ఊర్లె నుంచి గుడికి గుంపుగా పోతున్నరు. గుంపులో శ్రావణి ఉంది. పక్కనే తల్లి తండ్రి ఉన్నరు. రెండు గుంపులు కచ్చీరు కాడ కలుసుకున్నయి. అప్పటికే అక్కడ పోలీసులు కావలున్నరు. ఆ గుంపును అటు మలిపి.. ఈ గుంపును ఇటు మలిపిండ్రు. జనం ఊపిరి తీసుకున్నరు. తిరుపతి రెడ్డి, మీరాసాబు ఒకరినొకరు కొరకొర సూసుకున్నరు.‘పండుగు చేసినమా లేదా సూడు. రేపు ఏబీసీగాన్ని ఇక్కడనే కొడుతం’ అన్నట్టు చూసిండు మీరాసాబ్.
‘నీ కొడుకు గూడా వచ్చిండట గదా. రేపు ఐదు గంటలకు ఇద్దరి పనికతం!’ పండ్లు కొరికిండు తిరుపతి రెడ్డి. చీకట్లో ఒకల మొఖం ఒకలకు కనవడకపోతుండె. దీటి వట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిండు వెంకటి. దీటి వెలుగులో శ్రావణి-సలీం ఒకలనొకలు చూసుకున్నరు. శ్రావణి గుర్తుపట్టలే. కళ్లతోనే వెతికింది. సలీం చిన్నగ సైగ చేసి నవ్విండు. శ్రావణి నమ్మలేనట్టు ఆశ్చర్యంగ చూసింది. వాళ్లు అటు పోతండ్రు. వీళ్లు ఇటు పోతండ్రు. శ్రావణి-సలీం పక్క పక్కనే ఒక్కక్షణం ఆగిండ్రు. కావాలనే వెంకటి దూరం జరిగిండు. చీకట్లో ఇద్దరే మిగిలిండ్రు. “నేను అచ్చం ఆడిపిల్లనే అనుకున్న. ఈ రాత్రి నువ్వు రాకుంటే నేను మందు తాగి సత్తుంటి” చిన్నగా అన్నది శ్రావణి.
“అన్నంత పని జేత్తవని తెలుసు. అందుకే వచ్చిన” సలీం అన్నడు.“నువ్వు అటు వత్తవా? నేను ఇటు రావన్నా.. జెట్టన పోదాం” అడిగింది శ్రావణి.
“నేనే వత్త!” చెప్పిండు సలీం.గుంపులు దూరమైనయి. తిరిగి తిరిగి చూసుకుంట ఇద్దరు చీకట్ల కలిసిపోయిండ్రు. తలువాల బియ్యం గుడికి చేరుకున్నయి. భజనలు జరుగుతున్నయి. అమ్మాయిలు కోలాటాలు ఆడుతున్నరు.“అమ్మా! నేను కొద్దిసేపు ఆడుకుంటనే” అడిగింది శ్రావణి.తల్లి తలూపింది. శ్రావణి వెళ్లి గుంపులో కలిసింది.అక్కడ పీరీల గుంపు ఊరు తిరుగుతంది. మూలమలుపు తిరగగానే వెనక్కి తిరిగిన సలీం గుడి వద్దకు చేరుకున్నడు. శ్రావణి చూసి పిలిచింది. ఇద్దరు నవ్వుకున్నరు. శ్రావణి రెండు కోలలను అందించింది. ఆట మొదలుపెట్టారు. అక్కడున్న అమ్మాయిలు ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఆడిఆడి అలసిపోయి ఇద్దరు గుడిగద్దె మీద కూర్చున్నరు. కూతురు కోసం వెతికిన దేవలచ్చిమి అటుగా వచ్చి ఇద్దర్నీ చూసింది.“అమ్మా.. మా దోస్తు రేఖ. వీళ్లది గుండారం. పీర్ల పండుగకు వచ్చిందట” చెప్పింది.దేవలచ్చిమి.. ‘అవునా!?’ అన్నట్టు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సలీంను రాములవారి గుడిలోకి తీసుకపోయింది శ్రావణి. గుడంతా తిరిగి చూపించింది. నుదుటన బొట్టు పెట్టింది. ఇద్దరు దేవుడికి మొక్కుకున్నరు.“అమ్మా.. కొద్దిసేపు మా దోస్తుతో పీరీల దగ్గర ఆడుకుని వస్తనే..” తల్లి వద్దకు వచ్చి అడిగింది శ్రావణి.“సరే! తొందరగా రా.. బాపు చూస్తే కోపానికత్తడు” చెప్పింది తల్లి.ఇద్దరూ పీరీల దగ్గరికి వచ్చిండ్రు.. ఆశన్న ఊషన్న ఆటలో కలిసిండ్రు. కొద్దిసేపు ఆలువ ఆడిండ్రు.. సప్పట్లేసుకున్నరు. ఆడిఆడి అలిసి.. చీకట్ల రాళ్ల తెట్టె మీద గువ్వలోలె ఒదిగి కూర్చున్నరు. చాలాసేపు మాట్లాడుకున్నరు. టైం చూసుకున్నడు సలీం. రాత్రి పన్నెండు దాటింది. ఊరంతా తిరిగిన సత్తెపీరి.. మసీదు ముందుకు వచ్చింది.
“చెప్పు.. నన్ను తీసుకెళ్తవా? నా శవాన్ని చూస్తవా?” హెచ్చరించినట్టుగా మరోసారి అడిగింది శ్రావణి.అప్పటికి నెలవంక గూకింది. చీకటయింది. దీటి పట్టుకుని వెతుక్కుంటూ వచ్చిండ్రు.. వెంకటి, నాగరాజు.“అరేయ్.. లేటు చెయకుండ్రి. ఊర్లె పరిస్తితులు బాగలెవ్వు. కొత్తకొత్త మనుషులు కనవడుతున్నరు. నాకు ఏదో అనుమానంగ ఉంది. ఏసుకున్న ప్లానంత పాడయితది. నేను పీరిని ఎత్తుకుంట. వీడు దీటి వట్టుకుంటడు. ఎవలకు అనుమానం రాకుంట మిమ్మలను ఊరు దాటిత్తం” అన్నడు నాగరాజు.“సరేరా.. చాలా సేపైంది. ఒక్కసారి గుడి దగ్గర కనవడి వత్తం. అనుమానం రాదు” అన్నడు సలీం.ఆ రాత్రి అటు కోలాటం-ఇటు ఆశన్న ఊశన్న.. అటు భజనలు-ఇటు ఆలువ ఆటలు.. అటు జైశ్రీరామ్-ఇటు అసోయ్ దూలా.. మార్మోగుతుంటే ఇద్దరూ గుడికి చేరుకున్నరు.“అమ్మా.. ఇంటికి వోతనే. నిద్రొస్తుంది. మా దోస్తు గూడా వత్తదట..” అడిగింది శ్రావణి.
తల్లి తలూపి పొమ్మంది. ఇద్దరు మసీదు దగ్గరికి చేరుకున్నరు. అప్పటికే దప్పుల సప్పుడు మొదలయింది. నాగరాజు సత్తెపీరిని ఎత్తుకున్నడు. వెంకటి దీటిని పట్టుకున్నడు. వెంట ఇరువై మంది దాకా జనం ఉన్నరు.“ఇంకెవల మొక్కు బాకీ ఉందో.. పీరి మల్ల ఊర్లెకు పోతంది..” ఎవలో అన్నరు.
“సత్తె పీరి అంటే మాటలా.. ఊరంత మొక్కులుంటయి” మల్లెవలో అన్నరు. పీరి హైస్కూల్ ముంగటి నుంచి కోటకాలువ దాటింది. అటునుంచి ఊరివైపు తిరుగకుండా కోటగడ్డ ఎక్కింది. అటు ఊరు లేదు కదా.. పీరి అటెందుకు పోతందని ఎవరికీ ఆలోచన రాలేదు. దీటి వెలుగులో కోట గడ్డ దిగింది పీరి. ఊరు దాటిన పీరి మళ్లీ వెనక్కి తిరిగింది.“అక్కడ బైక్ ఉంది. కీ దానికే ఉంది. బట్టలు కూడా ఉన్నయి. ఇట్లనే పో” చెవిలో చెప్పాడు వెంకటి. శ్రావణి-సలీం అక్కడే ఆగిపోయారు. కొద్దిసేపట్లో గుంపు దూరమయింది. చీకట్లో ఇద్దరే మిగిలిపోయారు. సెల్‌ఫోన్ వెలుతురులో బండివద్దకు వచ్చిండ్రు.“అయ్యో! దేవుడి పుస్తె మట్టెలు నా దగ్గరనే ఉన్నయి” కొంగుకు కట్టుకున్న ముడిని చూస్తూ ఉలిక్కిపడి అన్నది శ్రావణి.“ఇచ్చొద్దమా.. దేవుని వస్తువులు కదా!” అడిగాడు సలీం.“ఇంకా నయం. అక్కడే ఉందమనలేదు. నడువు.. మనకు అవసరమే కదా. దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంట” అన్నది.
ఏదో చెప్పాలని చూసిండు సలీం.
“బండి నువ్వు నడుపుతవా? నేను నడుపన్నా?..” కోపంగా అన్నది.అర్ధరాత్రి దాటింది. పీరీలన్ని మసీదుకు చేరుకున్నయి. గుడి ముందు, మసీదు ముందు ఆడిపాడిన జనం అలిసిసొలిసి ఇల్లు చేరుకున్నరు. తలువాల బియ్యం కలుపుతూ పుస్తె మట్టెలు గుర్తొచ్చిన దేవలచ్చిమి ఇంటికచ్చింది. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆగమాగాన మసీదు దగ్గరికి పోయింది. అక్కడ జనంలేరు. గుడి సుట్టు తిరిగింది. కనిపించలేదు. భజనలో ఉన్న భర్త దగ్గరికి వెళ్లి భయంభయంగా చెప్పింది.తిరుపతి రెడ్డి ఆవేశపడలేదు. ఊరంతా దేవులాడి ఇంటికచ్చిండ్రు. టైం చూసుకున్నడు. నాలుగు దాటింది. పెండ్లయ్యే పిల్ల ఎంత పని చేసెనని దేవలచ్చిమి ఏడుత్తంది.“ఏడువకు తుడువకు. ఒక్క గంటాగు గంతే! గా తురుకోళ్ల పుర్రెలు వలుగుతయి. భూమ్మీద వాడు యాడున్నా నరికి నా బిడ్డను తెచ్చుకుంట!” ఓదారుస్తూ అన్నడు.చిన్నచిన్న విషయాలకే ఆవేశపడే భర్త నెమ్మదిగా ఉంటే.. మరింత భయమయింది దేవలచ్చిమికి. బాధగా కూర్చున్నది. పక్కనే భర్త కూర్చున్నడు. అలా ఎంతసేపు కూర్చున్నరో తెలువది. వాకిట్ల హారన్ మోగేసరికి ఉలిక్కిపడ్డరు.
‘ఎవరా?’ అని చూసేలోపే.. సలీం-శ్రావణి ఇద్దరూ ఇంట్లకు వచ్చిండ్రు.భార్య భర్తలిద్దరూ పరేషానయిండ్రు. తిరుపతి రెడ్డి ఆగమాగాన బయటకు వచ్చి.. ‘ఎవలన్న చూసిండ్రా!?’ అని చుట్టూ చూసి తలుపు వేసి కోపంగా చూసిండు.“మామా.. నేను చెప్పేది విను” అన్నడు సలీం.అడుగు ముందుకు వేయబోతూ ఆగిపోయిండు తిరుపతి రెడ్డి.“చిన్నప్పటినుంచి నిన్ను ఇట్లనే పిలుస్తున్న. ఆ చనువుతోనే ఇప్పుడు పిలుస్తున్న. శ్రావణి అంటే నాకు ప్రాణం. కానీ, నీకు పరువు అంటే ప్రాణం. సిరిసిల్లకు బట్టలకు వచ్చిన్నాడే.. అటునుంచి అటే వెళ్లి పోదామన్నది. అప్పుడు నువ్వే యాదికచ్చినవు. పద్ధతి కాదని చెప్పి.. బుజ్జగించి ఇంటికి పంపిన. తను మారుతుందనుకున్న. కానీ ఏమాత్రం మారలేదు. చచ్చిపోతనన్నది. నాకు భయమయింది. వచ్చి నచ్చచెప్పితే వింటుందేమోనని వచ్చిన. రాత్రి నుంచి చెప్తనే ఉన్న. అయినా ఒకటే మంకు. ‘లేచి పోదాం లేచిపోదాం’ అని”.. కొద్దిసేపు ఆగి..“ఇప్పటికిప్పుడు మేము లేచిపోవచ్చు. తరువాత మాపేరు చెప్పి ఎన్ని శవాలు లేస్తయో నాకు తెలుసు. అప్పుడు మేము సంతోషంగా ఉండలేం. మీరూ సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు మా ఇద్దరి ప్రేమను చంపుకొంటే ఎందరో బతుకుతరు. మీరుమీరు హ్యాపీగా ఉంటరు. అందుకే బాగా ఆలోచించి.. ఆమె ఒప్పుకోకపోయినా బలవంతంగా ఇక్కడికి తీసుకచ్చిన!” చెబుతున్న సలీం గొంతు జీరబోయింది. ఏడుపును ఆపుకొన్నడు. భార్యా భర్తలిద్దరు సల్లవడ్డరు.
కొద్దిసేపు ఆగి..“ఇగో మామా నీ బిడ్డ.. ఈ విషయం ఎవలకు తెలువది. నువ్వేం భయపడకు”.. అంటూ వెనక్కి తిరిగిండు.అప్పటికి సలీం కళ్లవెంట నీళ్లు కారుతున్నయి. గొంతు బొంగురు పోయింది. శ్రావణి నేల చూపులు చూస్తంది. తిరుపతి రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవలచ్చిమి నిలువు నిత్తారం బీరిపోయింది.వెళ్లిపోతూ వెనక్కి తిరిగాడు సలీం.“సారీ శ్రావణి.. వెరీవెరీ సారీ! నువ్వు మోసమే అనుకో.. పిరికితనమే అనుకో! కానీ, నేను మాత్రం త్యాగమనే అనుకుంట. మామా.. శ్రావణి పయిలం” అంటూ ఏడుస్తూ బండి ఎక్కి వెళ్లిపోయాడు.శ్రావణి పక్కున పలిగి ఏడ్పు మొదలు పెట్టింది.తిరుపతి రెడ్డి ఒక్కసారిగా షాక్‌తో నిలబడిపోయిండు. ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాలేదు. మనసులో ఏదో దేవినట్టయింది. గుండె కలుక్కుమంది. వెంటనే ఫోన్ అందుకున్నడు. అప్పటికి ఐదు కావడానికి ఇంకో పది నిమిషాలు మాత్రమే ఉంది. ఏబీసీగాని బొమ్మపెట్టి కొట్టడానికి జనం, మీరాసాబును నరకడానికి రౌడీలు రెడీగా ఉన్నరు.
“ఎక్కడోళ్లను అక్కడ ఆగిపొమ్మను రా.. గొడవలు వద్దు” అన్నడు తిరుపతి రెడ్డి.తెల్లారింది. నిశ్శబ్దంగా పీర్లు నీళ్లలో పడ్డయి. రాముడి కల్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఊరు ఊరంతా ఊపిరి తీసుకున్నరు. ఇందుకు కారణమైన సలీం మాత్రం.. గుక్కపట్టి ఏడుస్తున్నడు. అతని పక్కన వెంకటి, నాగరాజు ఉన్నరు. “ఇసొంటి పిరికోనివి ఎందుకు ప్రేమించాలె రా.. పాపం ఆ పిల్ల చూడు. నిన్ను నమ్ముకున్నందుకు ఎంత బాధ పడుతందో. మీరేదో అమర ప్రేమికులని, మీ ప్రేమను బతికియ్యాలని మేము పెద్ద స్కెచ్ వేస్తిమి” అన్నడు నాగరాజు..“ఇది పిరికితనం కాదురా.. త్యాగం! అసలు ప్రేమంటేనే త్యాగం కదా. నేను ఏమాత్రం తొందరపడ్డా.. హిందూ ముస్లిం గొడవలంటూ ఈపాటికి ఊరు అట్టడుకుతుండె. ఇప్పటికీ నమ్ముతున్న. నేను చేసింది మంచి పనే అయితే.. మేము తప్పక కల్లుస్తం. ఆ దేవుడున్నడు” ఏడుస్తూ అన్నడు సలీం.
డాక్టర్. పెద్దింటి అశోక్ కుమార్
తెలంగాణ భాష-యాసకు, పల్లె జనజీవన సంఘర్షణకు పట్టంకట్టే రచయితల్లో ప్రముఖులు డాక్టర్. పెద్దింటి అశోక్ కుమార్. కథ-నవలా రచయితనే కాకుండా.. తన పనితీరు మీద తానే రెఫరెండం పెట్టుకున్న ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. ఈయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట. ఎం.ఎ (తెలుగు), ఎమ్మెస్సీ (గణితం) చదివారు. ప్రస్తుతం సిరిసిల్ల ఉర్దూ మీడియం పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 250 కథలు, 8 నవలలు, 5 నాటకాలు రాశారు. 10 కథా సంకలనాలు ప్రచురించారు. ఈయన రాసిన ‘జిగిరి’ నవల.. 12 భారతీయ భాషల్లోకి అనువాదం అయింది. అనేక కథలు.. హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోకి అనువాదమై సంకలనాలుగా వచ్చాయి. నాటక రచనలో ‘నంది అవార్డు’ అందుకున్నారు. పెద్దింటి రచనల మీద మూడు పీహెచ్‌డీలు, ఆరు ఎంఫిల్ పరిశోధనలు పూర్తయ్యాయి. మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ మొదలైన యూనివర్సిటీలలో.. ఈయన రచనలు సిలబస్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు అందిస్తూ, మాటలు-పాటలు రాస్తున్నారు.
“ఇది పిరికితనం కాదురా.. త్యాగం! అసలు ప్రేమంటేనే త్యాగం కదా. నేను ఏమాత్రం తొందరపడ్డా.. హిందూ ముస్లిం గొడవలంటూ ఈపాటికి ఊరు అట్టడుకుతుండె. ఇప్పటికీ నమ్ముతున్న. నేను చేసింది మంచి పనే అయితే.. మేము తప్పక కల్లుస్తం. ఆ దేవుడున్నడు” ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
-డాక్టర్. పెద్దింటి అశోక్ కుమార్
94416 72428