“సంతకం అంటే మనిషి హోదాకీ విలువకీ మాత్రమే కాదు.. మానవత్వానికీ సహృదయతకీ గుర్తింపేనని నిరూపించావు. ఈరోజు నా సంతకం, నీ ఔన్నత్యానికి సాక్ష్యంగా మారుతున్నది. నేను చాలా అదృష్టవంతురాల్ని” అంటూ.. సంతకం చేసిన అనుమతి పత్రాలని వినీత్ చేతిలో పెట్టింది స్నిగ్ధ.
ఆ పత్రాలను బల్లమీద పెట్టి..“అదృష్టం నీది కాదు, నాది” అంటూ ఆమెను చుట్టేశాడు వినీత్.కానీ, అసలైన అదృష్ణం వాళ్లిద్దరిది కూడా కాదు.
అనుకూల దాంపత్యానికి ఉదాత్తమైన భాష్యం చెప్పే ఈ కథ.. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వినీత్ హైదరాబాద్ వెళ్లడంతో ఆరంభమైంది.
హైదరాబాద్లో ఎప్పుడూ దిగేచోటే దిగాడు వినీత్. స్నానం చేసి ఎప్పట్లాగే దగ్గరలోని శివాలయానికి బయల్దేరాడు. ఎప్పట్లాగే రణగొణ ధ్వనులతో శబ్ద కాలుష్యాన్నీ, ఇంధనం వెలువరించే పొగలతో వాయుకాలుష్యాన్నీ నగరానికి ఉచితంగా సరఫరా చేస్తూ.. అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్నాయి వాహనాలు. వంతెనమీది నడకదారిలో ఆ చివర కూర్చుని ఉన్నాడొక యువ బిచ్చగాడు. జానెడు గడ్డం-బారెడు జుట్టు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లున్నాడు. నల్లటి గడ్డం మధ్య మరింత నల్లటి ముఖం సూర్యకాంతిలో నిగనిగలాడుతున్నది. అతణ్ని చూసి..
‘బుద్ధిగా పని చేసుకోవడం మానేసి అడుక్కోవడం ఏం ఖర్మ?” అనుకుంటూ, అతణ్నేమాత్రం పట్టించుకోకుండా గుడికి వెళ్లిపోయాడు వినీత్.
గుడిలో దర్శనం చేసుకుని బయటికి రాగానే మెట్లమీద బిచ్చగాళ్ల అరుపులు చుట్టుముట్టాయి. వాటిని వింటూంటే వంతెన చివరి బిచ్చగాడు గుర్తొచ్చాడు. దాంతో అలవాటు ప్రకారం జేబులోకి వెళ్లబోయిన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. వీళ్లంతా తమ వృత్తి నై-పుణ్యంతో భక్తులకు పుణ్యాన్ని పంచుతున్నామని డబ్బాలు కొట్టిమరీ చాటుకుంటారు. వేసినవాడికి పుణ్యం మాటెలాగున్నా వెయ్యనివాడికి శాపనార్థాలు మాత్రం తప్పవు. మరా గడ్డం బిచ్చగాడు? పాపం అతనికి అడుక్కోవడంలో ఓనమాలు కూడా తెలిసినట్లు లేవు. తెలిస్తే పాదచారులు బిచ్చం వెయ్యడానికి వీలుగా కనీసం తన ముందు తుండుగుడ్డయినా పరుచుకోకుండా ఉంటాడా? ఇచ్చేదేదో అలాంటివాడికి ఇస్తే సద్వినియోగం అవుతుందని అనిపించింది. అందుకే వృత్తి బిచ్చగాళ్ల అరుపుల్ని పట్టించుకోకుండా మెట్లు దిగిపోయాడు.
వినీత్ వెళ్లేసరికి ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడా బిచ్చగాడు. అతని కళ్లలో అపారమైన వెలితి. అంతులేని నైరాశ్యం.
అవే అతనిపట్ల తనలో జాలి కలిగించి ఉంటాయని అనుకుంటూ.. జేబులో చెయ్యిపెట్టాడు వినీత్. చేతికి ఐదు రూపాయల నాణెం తగిలింది. కానీ దాన్ని తియ్యబుద్ధి కాలేదు. అందుకే పది రూపాయల కాగితం తీసి అతని చేతికందేలా పట్టుకున్నాడు.
ఆ బిచ్చగాడు దానివైపు భావరహితంగా చూస్తున్నాడే తప్ప అందుకోవడానికి చెయ్యి ముందుకి చాచడం లేదు. దాంతో అతను గుడ్డివాడేమో అనే అనుమానం కలిగింది. అందుకే ఆ పదిరూపాయల కాగితాన్ని అతని చొక్కాజేబులోకి దూర్చాడు. తన చేతి స్పర్శ తెలిశాకైనా స్పందిస్తాడని అనుకున్నాడు వినీత్. కానీ, అతని నుంచి ఏ ప్రతిక్రియాలేదు. చూపుల్లోకి ఏ భావమూ రాలేదు. అంటే తను ఊహించింది నిజమే కావచ్చు అనుకుంటూ ముందుకు కదిలాడు.
నాలుగడుగులు వేశాడో లేదో వెనకనుంచి దుమ్ములగొండి నవ్వులాంటి వెకిలి నవ్వు వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగాడు. ఆ బిచ్చగాడు తనలో తనే నవ్వుకుంటూ పదికాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తున్నాడు. అంటే అతను గుడ్డివాడు కాదు, బహుశా తనిచ్చిన పదిరూపాయలు అతనికి చాల్లేదు కాబోలు అందుకే చింపేసుంటాడు.
‘అయినా అడుక్కునేవాడికి అంత అహంకారం పనికిరాదు’ అనుకుంటూ తనదారిన తను వెళ్లిపోయాడు.
తన బాధ్యతల్లో భాగంగా స్థానిక కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాడు వినీత్. అంతలోనే తన శాఖలోనే పనిచేసే ఒక ఉన్నతోద్యోగి తనని బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించాడు. పనిలో పనిగా ఐదువందల కట్టనొకదాన్ని జేబులో పెట్టబోయాడు. వినీత్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తుండగా వంతెన బిచ్చగాడు గుర్తొచ్చాడు. దుమ్ములగొండి ఇకిలింపు గుర్తొచ్చింది. ఆ ఉన్నతోద్యోగి ఇచ్చిన డబ్బు తిరస్కరించడానికి తన కారణాలు తనకున్నాయి. అలాగే తన పది కాగితాన్ని చింపి పారెయ్యడానికీ అతని కారణాలు అతనికీ ఉంటాయనుకున్నాడు వినీత్. అలా అనుకోగానే ఆ కారణాలేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది.
మధ్యాహ్నం భోజనాల వేళ గదికొచ్చాడు. భోజనం చేస్తూ యథాలాపంగా కిటికీలోంచీ బయటకి చూస్తే వంతెన కనిపించింది. వంతెన చివర బిచ్చగాడూ కనిపించాడు. భోజనం చేస్తూనే ఆ బిచ్చగాణ్ని గమనిస్తున్నాడు వినీత్. అదే సమయంలో వంతెన మీద భార్యాభర్త, వాళ్ల పిల్లాడూ వస్తూ కనిపించారు. ఆ బిచ్చగాణ్ని చూడగానే భార్య ఏదో చెప్పింది. భర్త జేబులోంచి ఓ నాణెం తీసి కళ్లకద్దుకుని భార్యచేతిలో పెట్టాడు. ఆమె కూడా నాణాన్ని కళ్లకద్దుకుని పిల్లాడి చేతికిచ్చింది. అ పిల్లాడుకూడా దాన్ని కళ్లకు అద్దుకున్నాడు. ఆవిధంగా వాళ్లు ముగ్గురూ దానం చెయ్యడానికి ముందే దాని తాలూకూ పుణ్యాన్ని సరిసమానంగా పంచుకోవడం చూసి వినీత్కి నవ్వొచ్చింది.
పిల్లవాడు తన చేతిలోని నాణేన్ని బిచ్చగాడి ముందు పడేసి తల్లిదండ్రుల వెంట వెళ్లిపోయాడు.ఇప్పుడా బిచ్చగాడి స్పందనెలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో అతణ్నే గమనిస్తున్నాడు వినీత్.
బిచ్చగాడు ఆ నాణేన్ని తీసుకున్నాడు. నాలుగైదుసార్లు అటూఇటూ తిప్పి చూశాడు. తరువాత దాన్ని గుప్పిట్లో బిగించి గుండెలకి ఆన్చుకున్నాడు. అతని చర్యని చూడగానే..
‘బహుశా అతను చిల్లర నాణాలు తప్ప కాగితాలు తీసుకోడుగాబోలు!’ అనే అనుమానం కలిగింది. అయినా తరవాతేం చేస్తాడో చూద్దామనే కుతూహలమైతే తగ్గలేదు. బిచ్చగాడు నాణేన్ని గుండెలకి ఆన్చుకునే మనసులో ఏదో తలుచుకున్నాడు. ఆ తలుచుకున్నది జరుగుతుందో లేదో తేల్చుకోవడానికి బొమ్మా బొరుసూ వేశాడు. నాణెం గిర్రున తిరుగుతూ పైకి వెళ్లింది. కింద పడుతున్నప్పుడు రెండు చేతుల్తో పట్టుకున్నాడు. ఏం పడిందో ఆత్రంగా చూసుకున్నాడు. అనుకున్న ఫలితం వచ్చినట్టు లేదు. అందుకే ఈసారి మరింత పైకి ఎగరేశాడు. ఈసారి కూడా ఫలితం వచ్చినట్టు లేదు. ముచ్చెంగా మూడోసారి ఎగరేసి చూసుకున్నాడు. కోరుకున్న ఫలితం వచ్చుండదు. అందుకే నాణాన్ని కోపంతో విసిరికొట్టాడు. అది తిన్నగా వెళ్లి ఒక పెద్దాయన ముందు పడింది. ఆయన ఓసారి అటూఇటూ చూసి తనని ఎవరూ గమనించ లేదని నిశ్చయం కాగానే.. దాన్ని తీసుకొని జేబులో వేసుకున్నాడు. వినీత్ గుంభనంగా నవ్వుకున్నాడు.
మర్నాటి ఉదయం గుడికెళ్లడానికి తయారవుతూ కిటికీలోంచి చూస్తే వంతెన చివరే కనిపించాడా బిచ్చగాడు. క్రమశిక్షణలో వాడు తనలాంటి వాళ్లందరినీ తలదన్నేలా ఉన్నాడనిపించింది. అంత క్రమశిక్షణ కలిగినవాడు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంటే.. అది వెర్రితనమో పిచ్చితనమో అయివుండదు. అయినా దానం తీసుకోని బిచ్చగాడు ఎక్కడైనా ఉంటాడా? ఆ అనుమానంతోపాటుగానే అతణ్ని తన దగ్గర దానం తీసుకునేలా చెయ్యాలనే పట్టుదల కూడా కలిగింది. అందుకే గుడినుంచి వచ్చేప్పుడు బిచ్చగాడి ముందుకెళ్లి నిలబడ్డాడు. అతని కళ్లముందు యాభై రూపాయల కాయితం పెట్టాడు. ఆ బిచ్చగాడు కాగితాన్నే చూస్తున్నాడు. కానీ, అతని చూపుల్లోని భావరాహిత్యం మాత్రం అలాగే ఉంది. వందకాయితం చూపించినా.. రెండువందలు, ఐదువందల కాయితాలు చూపించినా ఆ కళ్లలోకి వెలుగు రాలేదు.
రెండువేల కాయితం రద్దయిపోయింది. లేకపోతే దాన్నీ చూపించి ఉండేవాడు. రద్దు చెయ్యడానికే ప్రవేశపెట్టిన కాయితమది. కనుక రద్దయినా బాధలేదు. కానీ, తన పట్టుదల మాత్రం రద్దుకాదు. అందుకే జేబులో ఉన్న డబ్బంతా తీసి అతని కళ్లముందు పెట్టాడు.
అయినా ఆ కళ్లలో అదే నిరాసక్తత. అదే నిర్లిప్తత. ఆ చూపుల్లోని భావరాహిత్యం వినీత్ని సవాలు చేస్తూనే ఉంది. అందుకే బిచ్చగాడివైపు కోపంగా చూస్తూ..
“అడుక్కునేవాడు ఎంతేస్తే అంత తీసుకోవాలి. ఐదు రూపాయలైనా డబ్బే. పది రూపాయలైనా డబ్బే. చాలకపోతే అడిగి తీసుకోవాలి. అంతేగానీ ఇచ్చినవాణ్ని అవమానించే హక్కులేదు నీకు” అన్నాడు.
బిచ్చగాడు మౌనంగానే తీసుకున్నాడు. వినీత్ ఇచ్చిన డబ్బు లెక్కపెట్టాడు. ఆ తరువాత..
“నేను అడుక్కునేవాడినని ఎవరు చెప్పారు మీకు?” అంటూ, ఆ డబ్బుని వినీత్ చేతిలో పెట్టేసి మళ్లీ భావరాహిత్యంలోకి వెళ్లిపోయాడు.
వినీత్కి ఒక్కసారిగా చెళ్లున చెంప పగలగొట్టినట్లయింది. ఆ తరువాత తను ఆవేశంతో ఎన్ని మాట్లాడినా, ఎన్ని మాటలన్నా ఆ బిచ్చగాడి నుంచి సమాధానంగా వచ్చింది మాత్రం కేవలం శూన్య దృక్కులే. చివరికి తనే మౌనం వహించి, వెనుదిరక్క తప్పలేదు.
వినీత్కి ఆరోజంతా పదేపదే గుర్తొస్తూనే ఉన్నాడా బిచ్చగాడు. అతనితో పంతానికిపోయి అవమానం పాలైనందుకు కాదు. అసలా గెడ్డం యువకుడు ఎవరు? ఎందుకక్కడే ఉంటున్నాడు? అతని సమస్యేమిటి? అక్కడే కూర్చుంటే పూటెలా గడుస్తుంది? అన్నీ ప్రశ్నలే. అన్ని ప్రశ్నలెదురైనా ఆ బిచ్చగాడితో నాకెందుకు? అనే ప్రశ్నమాత్రం పుట్టలేదు.
మర్నాడు గుడికెళ్లేప్పుడు వంతెన ఇవతలివైపు కాకుండా అవతలివైపు నుంచి వెళ్లాడు. కానీ వచ్చేప్పుడు మాత్రం బిచ్చగాడి మాట మర్చిపోయాడు. అందుకే ఇవతలివైపుగా వచ్చేశాడు. తన మతిమరుపును తనే తిట్టుకుంటూ హడావుడిగా నడుస్తున్నాడు. బిచ్చగాడి దగ్గరకొస్తున్నకొద్దీ ఏదో జంకు. ఏదో అపరాధభావం. కానీ, ఆ మనిషి చూపులు మాత్రం అలాగే ఉన్నాయి.. భావరహితంగా! ఇప్పుడెందుకో ఆ మనిషి గురించి ‘బిచ్చగాడు’ అనుకోవడానికి కూడా తటపటాయిస్తున్నది మనసు.
ఉంది.. ఏదో ఉంది. ఆ మనిషిలో తను ఊహించనిదేదో ఉంది. అందుకే చూపులు తిప్పుకోలేక పోతున్నాడు. అలా చూస్తుంటే మనసులోకి వస్తున్న ఆలోచనలన్నీ దగ్గరదాకా వచ్చి అక్కడే ఆగిపోతున్నాయి. తన జీవితంలో స్నిగ్ధ ప్రేమ తప్ప మరేదీ ఇంతగా వేటాడలేదు. అందుకే అతణ్ని దాటి వెళ్లిపోతున్నప్పుడు వినీత్ కాళ్లు సన్నగా కంపించాయి.
ఆ రాత్రి ఫోన్లో స్నిగ్ధతో మాట్లాడుతూ వంతెన యువకుడి గురించి చెప్పాడు.
“అలాంటి మనుషుల్లో మనం చదవని శాస్త్రాలు, మనం చూడని సత్యాలు ఎన్నో ఉంటాయి. వదిలి పెట్టద్దు. విషయం కనుక్కో!” అన్నది స్నిగ్ధ. సమయానికి తగిన సలహాలివ్వడంలోనూ, సహకారం అందించడంలోనూ తనని మించినవారు లేరు.
రాత్రంతా ఆ యువకుడికి పూటెలా గడుస్తుందో తెలుసుకోవాలన్న ఆలోచనతోనే గడిచిపోయింది.
మరునాటి ఉదయం ఫలహారం చేస్తున్నప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే రెండు ఇడ్లీలు, మసాలా దోశ పొట్లం కట్టించుకున్నాడు వినీత్. అరడజను పూతరేకులు కూడా కొన్నాడు. తిన్నగా గెడ్డం యువకుడి దగ్గరికి వెళ్లాడు. వినీత్ చేతిలోని పొట్లాలు చూడగానే భావరహితమైన ఆ శూన్యదృక్కుల్లోకి ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. ఇవ్వకముందే పొట్లాలు లాగేసుకున్నాడు.. పూతరేకుల్ని ఒళ్లో పెట్టుకున్నాడు. ఇడ్లీ విరుచుకుని తినబోయే ముందు వినీత్ వైపు చూస్తూ..“అన్నదాతా సుఖీభవ!” అన్నాడు.
అక్కడితో ఆగలేదు,
“తినగా మిగిలింది ఊరికే పడెయ్యడం ఎందుకని నాకు ఇస్తారంతే! కానీ ఇలా నాకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది మీరొక్కరే!” అన్నాడు.
అతను తింటుండటాన్ని చూసి తృప్తిగా ముందుకు నడిచాడు వినీత్. అలా నడుస్తుంటే అమ్మ గుర్తొచ్చింది.
‘అన్నపూర్ణమ్మ తల్లి పట్టెడన్నంతో అంతులేని తృప్తినిస్తుంది. కానీ, లక్ష్మీదేవికి తృప్తి అనే మాటే తెలీదు. మా చిన్నప్పుడు బియ్యమో పప్పులో కూరలో వేస్తే తీసుకునేవారు. ఇప్పుడు డబ్బులు తప్ప ఇంకేమీ తీసుకోవడం లేదు. మనుషుల్లో తృప్తి అనేదే లేకుండా పోతున్నది’ అని బాధపడుతూ ఉంటుంది.
అమ్మ గనుక ఈ యువకుణ్ని చూస్తే ఎంత సంతోషిస్తుందో అనుకున్నాడు.
హైదరాబాద్ వచ్చిన పని పూర్తయింది. మధ్యాహ్నం తను భోజనం చేశాక గడ్డం యువకుడి కోసం భోజనం కట్టించుకొచ్చాడు వినీత్. ఈ వారం రోజుల్లోనూ వినీత్తో కొంచెం స్నేహం కలిసినట్లు అనిపించింది. అందుకే, అతణ్ని అల్లంత దూరంలో చూడగానే సంబరంగా ఎదురొచ్చాడు గడ్డం యువకుడు. భోజనం పొట్లం అందుకున్నాడు.
ఇద్దరూ నడుస్తున్నారు. అతని స్థానం చేరగానే ఒక్కసారిగా చతికిలబడ్డాడు.
వినీత్ జేబులో చెయ్యిపెట్టాడు. అంతకుముందు ఆ యువకుడు వెనక్కిచ్చిన డబ్బు అలాగే మడతపెట్టి ఉంది. దాన్ని బయటికి తీశాడు.
“నేను మా ఊరెళ్లిపోతున్నాను. ఈ డబ్బుంచు! అవసరానికి పనికొస్తుంది”.
“తీసుకుంటాను. కానీ, నాకు కావాల్సినంత మీరివ్వలేరు”.
“ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చెప్పండి.. ఎంత కావాలి?”.
“లక్ష?”.
“ఇస్తాను”.
“రెండు లక్షలు?”.
“చూస్తాను”.
“ఐదు లక్షలు?”.
“ఆలోచిస్తాను”.
“పది లక్షలు?.. చెప్పండి, ఇవ్వగలరా? మీరు ఇవ్వలేకపోయినా ఇవ్వగలిగినవాళ్లు సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు కావాల్సింది డబ్బు కాదు. ఎందుకంటే.. డబ్బు కొనలేనివి ఎన్నో ఉంటాయి. నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది. మీ దగ్గరే కాదు.. అందరి దగ్గరా ఉంది. కానీ, ఎవ్వరూ ఇవ్వరు. ఇవ్వనిదాన్ని దానంగా కోరడంలో అర్థం లేదు!”.“నేను మాట తప్పను. ఒకవేళ నేను తప్పాలనుకున్నా మా స్నిగ్ధ తప్పనివ్వదు. అడగండి.. నా దగ్గర ఉన్నదైతే తప్పకుండా ఇస్తాను”.“అందరూ ఇంతే! అడక్కముందు పెద్ద దానకర్ణుడిలా ఏం కావాలన్నా ఇస్తామంటారు. అడిగాక మళ్లీ ముఖం చూపించరు”.
“అందరూ అలాగే ఉండరు. నిస్సంకోచంగా అడగండి”.“ఇవ్వడానికి మీరొప్పుకొంటే చాలదు. మీవాళ్లూ ఒప్పుకోవాలి. కానీ, వాళ్లొప్పుకోరు. వాళ్లు ఒప్పుకోకపోతే చట్టం ఒప్పుకోదు”.
“మావాళ్లు ఒప్పుకొంటారో లేదో మీకెలా తెలుసు? కేవలం మీ అనుభవాల్ని మించిన సత్యం ఉండదనే భ్రమలోంచి బయటకు రండి. నిస్సందేహంగా అడగండి.. మీకు కావాల్సిందేమిటి?”.
“నా మూత్రపిండాల్లో ఒకటి చెడిపోయింది. నెలరోజుల్లో మార్చకపోతే నేను బతకను. ఇప్పుడు చెప్పండి.. నాకో మూత్రపిండం దానం చేయగలరా?”.
“పది లక్షలు?..
చెప్పండి, ఇవ్వగలరా? మీరు ఇవ్వలేకపోయినా ఇవ్వగలిగినవాళ్లు సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు కావాల్సింది డబ్బు కాదు. ఎందుకంటే.. డబ్బు కొనలేనివి ఎన్నో ఉంటాయి. నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది. మీ దగ్గరే కాదు.. అందరి దగ్గరా ఉంది. కానీ, ఎవ్వరూ ఇవ్వరు. ఇవ్వనిదాన్ని దానంగా కోరడంలో అర్థం లేదు!”.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
కథా నవలా రచయితగా, అనువాదకులుగా తెలుగువారికి చిరపరిచితులు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. స్వస్థలం భీమవరం. ఈటీవీలో కన్నడ రచయితగా, మాటీవీలో తెలుగు రచయితగా 30 ఏళ్లు పనిచేశారు. టీవీ సీరియళ్లను హిందీ, కన్నడ భాషలనుంచి తెలుగులోకి అందిస్తుంటారు. ఇప్పటివరకూ వందకుపైగా కథలు రాశారు. ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ నవలలు; ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’, ‘నూటొకటో మార్కు’, ‘తెలకోవెల’ కథాసంపుటాలను వెలువరించారు. విశ్వర్షి వాసిలి వసంతకుమార్ యౌగిక కావ్యం ‘నేను’, బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా ‘విజ్ఞానజ్యోతి’ మొదలైన గ్రంథాలను కన్నడ భాషలోకి అనువదించారు. కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం పొందిన నవలని ‘భలేతాత మన బాపూజీ’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తొలి నవలల పోటీలో ‘వలసదేవర’ నవలకి మొదటి బహుమతి అందుకున్నారు. ‘జంగమదేవర’ నవలకి సంయుక్త ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ నుంచి నవలల పోటీలో బహుమతులు పొందారు. ఇవి కాకుండా.. అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్, తెల్సా, నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం, కౌముది, రచన, ఆంధ్రప్రభ, స్వాతి మొదలైన పత్రికలు, సంస్థల నుంచి వివిధ సందర్భాలలో బహుమతులను పొందారు.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
99488 96984