‘అమ్మా!’ అంటూ నన్ను అల్లుకుపోయిన నా ఆరేళ్ల కూతుర్ని దగ్గరికి తీసుకున్నాను. దానికి అన్నం పెట్టి.. నోరు మూయకుండా చెప్తున్న కబుర్లు వింటూ, దాని ముద్దు మొహం చూస్తూ ఉండిపోయాను. నేను, తమ్ముడు ఇలాగే అన్ని విషయాలూ ఏకరవు పెట్టడం, అమ్మ ఆసక్తిగా వినడం కళ్ల ముందు కదిలాయి. అంతలో గతమంతా గుర్తుకు వచ్చి నా కళ్లు తడిదేరాయి. నా ప్రమేయం లేకుండానే మనసు గతంలోకి పరిగెత్తడం వల్ల ‘ఊ!’ కొడుతూ ఆలోచనల్లోకి కూరుకుపోయాను.
“నేను వెళ్లనని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి? రేపో, మాపో పిల్ల పెద్దదవుతుంది. పిల్లాడు నేను లేకపోతే ఉండలేడు. అంతగా కావాలంటే మీరు వెళ్లి సంపాదించుకొని రండి. నేను పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఒక పనిచేస్తూ ఉంటాను” గట్టిగా అంటున్నది అమ్మ.
“నేను వెళ్లే పని ఉంటే నేను వెళ్లనా? ఈసారి వంటపని, ఇంటిపనులకు ఆడవాళ్లు కావాలని బ్రోకర్ చెప్పాడు. రెండేళ్లు సంపాదించుకుని వచ్చావంటే పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచొచ్చు. పిల్లకు పెళ్లి చేయాలన్నా.. పిల్లాణ్ని పెద్ద చదువులు చదివించాలన్నా మనవల్ల అయ్యే పనేనా? నువ్వు కాళ్లు అరిగేలా మిషిన్ తొక్కి, నేను దొరికిన పనల్లా చేస్తూ ఇలా ఎంతకాలం?”..
అమ్మానాన్న ఇద్దరూ చాలాసేపు గొడవపడ్డారు.
ఆఖరికి నాన్న మాటే నెగ్గింది. బహుశా మా గురించి ఆలోచించే అమ్మ ఒప్పుకొని ఉంటుంది. ఆరోజు నుంచి దుబాయ్ బయల్దేరే వరకూ అమ్మ కంటితడి ఆరలేదు. తమ్ముణ్ని జాగ్రత్తగా చూసుకోవాలని నాకు, మమ్మల్నిద్దర్నీ మంచిగా చూసుకోవాలని నాన్నకు పదేపదే చెప్పింది. వదల్లేక వదల్లేక బయల్దేరింది. నేను ఆరిందాలా మారిపోయినట్లు అనిపించింది. నాన్న సాయంతో వంటచేయడం, స్కూల్‌కు వెళ్లడం, తిరిగి వచ్చాక ఇంటిపని, వంటపని చేసి.. తమ్ముణ్ని చదివిస్తూ నేను చదువుకోవడం, వాడు బెంగపడకుండా చూసుకోవడం నాకు నెమ్మదిగా అలవాటయ్యాయి.
అమ్మ దగ్గరినుంచి ఫోన్ వచ్చినప్పుడు మాకు పండుగలా ఉండేది. అమ్మ మొదటిసారి పంపిన డబ్బులతో మాకిద్దరికీ బట్టలు, బొమ్మలు తెచ్చాడు నాన్న. కానీ, క్రమంగా నాన్న తాగుడుకు అలవాటుపడ్డాడు. అమ్మతో చెప్పేస్తానని బెదిరిస్తే జన్మలో ముట్టుకోనంటూ ఒట్టు పెట్టుకోవడం.. మళ్లీ కుక్క తోక వంకరలా మొదలుపెట్టడం.
ఇంతలో అశనిపాతం లాంటి వార్త. అమ్మ పనిచేసే ఇల్లు గలావిడ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోవడం అమ్మ చూసిందట. ఆ విషయం బయటికి చెబుతుందేమోననే భయంతో తన ఏడాది బిడ్డను ప్రియుని సహాయంతో చంపేసి.. ఆ నేరం అమ్మ మీదికి తోసేసిందిట ఆమె. దాంతో అమ్మను జైల్లో వేసేశారు. కష్టపడి సంపాదించి, పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దామని దుబాయ్ వెళ్లిన అమ్మ జైలు పాలైంది. కానీ ఆమె జైల్లో చేసిన పనులకు వచ్చిన డబ్బును ఇంటికి పంపేది. ఆ డబ్బు నాన్న సారా కొట్టుకు జమయ్యేది. నాన్న పూర్తిగా మారిపోయాడు. మేము తిరగబడుతున్నామని మా మీద చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. అమ్మకు చెప్పుకొందామంటే.. జైల్లో నుంచి ఫోన్ ఎప్పుడో గానీ రాదు. ఇవన్నీ చెప్పి అమ్మను బాధపెట్టడం ఎందుకని, చెప్పినా ఏం చేయగలదని చెప్పేదాన్ని కాదు.
“ఎందుకు సుమా! అలా కొడుతున్నావు వాణ్ని?” అంటూ నా చేతిలోని కర్రను లాక్కుని కింద పడేశారు భారతి టీచర్.
ఒక్కసారిగా నా బాధంతా కరిగి కన్నీటి రూపంలో బయటికి వచ్చింది.
“ఏమైందమ్మా?” అంటూ దగ్గరికి తీసుకున్నారు.
ఆవిడ అమ్మలా అనిపించి.. అన్ని విషయాలు చెప్పేశాను.
“ఇప్పుడు చూడండి టీచర్! వీడు స్కూల్ మానేసి తిరుగుతున్నాడు” అన్నాను.
“సరే తల్లీ! ఏదో తెలియక చేశాడులే. ఇవాల్టినుంచి మా ఇంటికి వచ్చి మా పిల్లలతోపాటు చదువుకోండి!” అని చెప్పారావిడ.
అప్పటినుంచి రోజూ సాయంత్రం టీచర్ వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. టీచర్ గారు, ఆవిడ భర్త కూడా చాలా మంచివారు. నేను టెన్త్‌క్లాస్ స్కూల్ సెకండ్ వచ్చినప్పుడు నాకన్నా వాళ్లే ఎక్కువ సంతోషించారు.
“నాన్నా! ఇంటర్లో చేర్పించవా?” భయపడుతూనే అడిగాను.
“చూద్దాంలే!” అన్న చిన్న మాటకే నా మనసు ఆనందపడింది.
ఆరోజు సాయంత్రం నన్ను, తమ్ముణ్ని బయటికి తీసుకువెళ్లాడు నాన్న. తమ్ముడు గాలిపటంతో ఆడుకుంటున్నాడు.
‘కాలేజీలో చేరబోతున్నాను!’ అనే ఆనందంతో నేను కూడా వాడితోపాటు ఎంజాయ్ చేస్తున్నాను. కాస్త దూరంలో చిన్నకారు ఆగింది. నాన్న నన్ను పిలిచాడు.
“వీళ్లు పేద పిల్లలను చదివిస్తూ ఉంటారు. నీకు టెన్త్‌లో మంచి మార్కులు వచ్చాయని చెప్తే.. చదివిస్తామని చెప్పారు” అని చెబుతున్నాడు.
కానీ, వాళ్ల చూపులు నాకెందుకో నచ్చలేదు. నమస్కారం చెప్పి వెనక్కి తిరగబోతున్నప్పుడు నా ముక్కు మీద ఏదో అదిమి పెట్టినట్లు అనిపించింది. ఆ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి నాకు తెలియకుండానే రెండు చేతులతోనూ తోసెయ్యడానికి ప్రయత్నించాను. నన్ను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని కారు లోపలికి నెట్టారు. అందులో ఉన్న ఒకరు నాన్న చేతిలో డబ్బుకట్ట పెట్టడం కనిపించింది. గింజుకుంటున్న నాకు కళ్లు మూతలు పడిపోసాగాయి. స్పృహ పోతుండగా తమ్ముడు కారు వైపు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది.
మళ్లీ నాకు మెలకువ వచ్చేసరికి ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. తలంతా దిమ్మెక్కి ఉంది. తలుపు దగ్గర ఏవో నవ్వులు వినిపించాయి. మొరటుగా కనిపించే ఒకతను లోపలికి వచ్చి మీద చేయి వేశాడు.
లాగిపెట్టి కొట్టాను.
“అబ్బో.. చాలా ఉందే!” అంటూ వెకిలిగా నవ్వాడు.
వాడినుంచి తప్పించుకుందామని తలుపులు బాదినా, అరిచినా లాభం లేకపోయింది. ఆ నాలుగు గోడలు నాకు సమాధి కట్టాయనిపించింది.
‘నాన్న’.. ఆ పేరు తలుచుకోవడానికే కంపరంగా అనిపిస్తున్నది. తాగి పడిపోతే తల్లిలా అన్నం తినిపించేదాన్ని. కన్న కూతుర్ని కసాయివాడిలా ఇలా ఎలా చేయగలిగాడు? తాగుడు.. ఒక మనిషిని ఇంతలా దిగజారుస్తుందా!? చదువు పేరుతో ఎంత మోసం చేశాడు! అమ్మ మా గురించి వెళ్లి దేశం కానీ దేశంలో జైలు పాలైంది. మమ్మల్నిద్దర్నీ బాగా చూసుకుంటున్నాడని అమాయకంగా నమ్మి రెక్కలు ముక్కలు చేసుకుని మరీ డబ్బు పంపుతున్నది. తమ్ముడు ఎంత బెంగ పెట్టుకున్నాడో? అమ్మ వెళ్లినప్పటి నుంచి నన్ను అసలు వదలకుండా తిరిగేవాడు. అసలు నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నా బతుకు ఇంతగా బండలైంది. ఇలా.. ఆలోచనలు తెగేవి కాదు.
అక్కణ్నుంచి తప్పించుకుందామని నేను చేసే ప్రయత్నాన్ని గమనించిన గంగవ్వ నన్ను ఆపింది.
“వద్దమ్మా! నేను చెప్పే మాట విను. ఇక్కణ్నుంచి తప్పించుకోవడం మనవల్ల కానిపని. అది తెలిస్తే ఇంకా నరకం చూపిస్తారు”.. బతిమాలుతూ చెప్పిన ఆమె మాటల్లోని చేదు నిజం నాకు అర్థమైంది. గంగవ్వ చాలా మంచిది. ఆమె వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదిట. ప్రేమ అంటూ ఎవరో మోసం చేసి జమునాబాయికి అమ్మేశాడుట. అప్పట్లో తప్పించుకుందామని చాలాసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆమె అందం మీద జమునాబాయి బాగా సంపాదించింది. ఒకసారి ఒకడు వాడి వెర్రి మొర్రి కోరికలను తీర్చలేదని గంగవ్వ మొహం మీద కత్తితో పొడిచేశాడుట. మొహం అలా అందవికారంగా తయారవడం వల్ల ఆకర్షణ కోల్పోయింది. అప్పట్నుంచి పనులు చేసి పెడుతూ జమునాబాయి దగ్గరే ఉండిపోయింది. తిరిగి వెళ్లిన ఆడవాళ్లకు సంఘంలో గౌరవం దక్కదని ఆమె తెలుసుకుంది.
జమునాబాయి షుగరు, హైబీపీతో మంచం పట్టింది. గంగవ్వ ఆమెకు సేవలు చేస్తున్నది. జమునాబాయి చేసిన పాపాలు చివరి దశలో ఆమెను మానసికంగా వేధిస్తున్నట్లున్నాయి. అమ్మాయిలు అందరి వైపు చూస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నది. ఆరోజు అర్ధరాత్రి ఆమె ప్రాణాలు పోయాయి. తెల్లవారితే ఆమె దగ్గర ఉండే గూండాలు ఆడపిల్లలందర్నీ వేరే కంపెనీలకు అమ్మేస్తారని గంగవ్వకు తెలుసు. నేను, మరొక అమ్మాయి షబానా ఈ నిత్యనరకాన్ని పడలేకపోతున్నామని తెలిసిన గంగవ్వ మమ్మల్ని తెల్లవారేలోగా తప్పించింది. రెండేళ్ల క్రితం షబానా, ఆమెను ప్రేమించిన నరేశ్ ఇంటినుంచి పారిపోతుండగా అతణ్ని బాగా కొట్టి, షబానాను తెచ్చి జమునాబాయికి అమ్మేశాడు ఒక లారీ డ్రైవర్. ఆమె ఆచూకీ తెలుసుకున్న నరేశ్ ఆమె కోసం తరచూ వచ్చేవాడు. ఆమె మీద ప్రేమను చంపుకోలేక, ఆమెను విడిపించలేక తల్లడిల్లి పోయేవాడు. బయటపడిన వార్త గంగవ్వ ద్వారా తెలిసిన నరేశ్ వెంటనే వచ్చి షబానాను కలిసాడు. ఎక్కడికో దూరంగా వెళ్లిపోయి బతుకుతామని గంగవ్వకు కృతజ్ఞతలు చెప్పి, షబానాను తీసుకుని వెళ్లిపోయాడు.
నేను, గంగవ్వ వేరే ఊరికి ప్రయాణమయ్యాం. ఇంతలో నేను గర్భవతిననే విషయం తెలిసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి నాకు మనసు రావడం లేదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించి, గౌరవంగా బతకాలని నిర్ణయించుకున్నాను. కానీ, నా అందం నాకు శాపం అయ్యిందో లేక తోడులేని ఆడది కంచె లేని చేనులా కనిపిస్తుందేమో తెలియదు. ఎక్కడికి వెళ్లినా.. ‘వస్తావా?’ అని అడిగేవాళ్లే ఎదురయ్యారు. గంగవ్వ నాలుగిళ్లల్లో పాచి పనికి కుదిరి నన్ను కూడా పోషించసాగింది. పోనీ చిన్నపిల్లలు నలుగుర్ని చేరదీసి ప్రైవేట్ చెబుదామన్నా.. ‘ఎక్కణ్నుంచి వచ్చారో ఏమిటో?’ అనుకుంటూ పిల్లల్ని పంపేవారు కాదు. అనాథ స్త్రీల సంక్షేమ నిలయాలు ఉంటాయని వినడమే కానీ.. ఎక్కడ ఉంటాయో తెలియదు. ఒక పెద్దమనిషి.. ‘నేను చూపిస్తా!’ అంటూ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్లబోయాడు. అక్కణ్నుంచి తప్పించుకోడానికి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు అయ్యింది. వెక్కివెక్కి ఏడుస్తున్న నన్ను గంగవ్వ ఓదార్చింది.
“అంతే తల్లీ మన బతుకులు! మంచిగా ఉందామన్నా ఈ లోకం పడనివ్వదు. నువ్వు మసిగుడ్డలో కట్టిన మానిక్కం లాంటి దానివి. నీ అందం దాచడం కట్టం. నువ్వా.. కడుపు తీయించుకోవడానికి ఇట్టపడటం నేదు. కొన్నాళ్లు పోతే యాపారం చేసుకోలేవు. ఇంకో నాలుగైదు నెలలు పని చేసుకుని సంపాదించుకున్న డబ్బు ఉంటేనే గండం గడిచి పిండం బయటపడుద్ది. నేను సెప్పిన ఇసయం ఆలోసించుకో తల్లి!”.. తల నిమురుతూ చెప్పింది. నా గుండె మెలిపెట్టినట్లు అయ్యింది. ఆమె మాటల్లోని నిజం నన్ను మళ్లీ బురదలోకి లాగింది. విటులను ఆకర్షించే కిటుకులు గంగవ్వ చెప్పేది.
కొత్త వాళ్లయితే..
“యాపారానికి కొత్తబాబు! మా అన్న కూతురు కాత్త చూసి..” అంటూ నసిగేది.
నన్ను కూడా అలానే నడుచుకోమనేది. దాంతో వాళ్లు కన్నెరికం చేస్తున్నట్లు పొంగిపోయి డబ్బు వెదజల్లేవారు.
పాత వాళ్లయితే..
“మా పిల్ల ఎప్పుడు మిమ్మల్నే తలుత్తా ఉంటది” అంటూ ఉబ్బేసేది.
పులి మీద పుట్రలా వచ్చిపడిన కరోనా మమ్మల్ని చావు దెబ్బ కొట్టింది. అప్పటివరకూ ఉన్న డబ్బులు పురిటికి, పాప వైద్యానికి సరిపోయాయి. గంగవ్వ ఎంత జాగ్రత్తగా వాడుతున్నా సరుకులు నిండుకుంటున్నాయి. ఒకరోజు నీరసంగా పడుకుని ఉన్న నన్ను లేపి టీ గ్లాసు, బన్ను చేతిలో పెట్టిన గంగవ్వకు సగం విరిచి ఇవ్వబోయాను.
“వద్దమ్మా! నువ్వు తిను తల్లి! మద్దేనం నూకలు కాసినప్పుడు నేను కూడా జావ తాగుతాలే. కడుపులో ఏమీ లేకుంటే పాపకు పాలు రావు. తిను తల్లి!” అంటూ బలవంతంగా తినిపించింది. నిజమే.. రాత్రంతా పాలు సరిపోక పాప ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు సొమ్మసిల్లినట్లు పడుకుంది. ‘ఆకలి’ ఇది ఒక్కటి పెట్టి దేవుడు మనిషి మీద కక్ష సాధిస్తున్నాడు అనిపించింది నాకు. గట్టి పడిపోయిన ఆ బన్నును టీలో నానబెట్టి తిని పడుకున్నాను.
కరోనా వల్ల గంగవ్వ పనిచేసే ఇళ్లవాళ్లు కూడా పనివాళ్లను రానివ్వకుండా వాళ్లే పనులు చేసుకుంటున్నారు. లేకపోతే ఒక్కపూటైనా మా కడుపులు నిండేవి. కాసేపటికి నిద్దట్లో పాల కోసం తడుముకుంటున్న పాప నోటికి రొమ్ము అందించాను. కాసిన్ని చుక్కలు వచ్చినట్లు ఉన్నాయి. వాటినే చప్పరిస్తూ తాగి, నిద్రలోనే నవ్వుకుంటున్న పాపను..
‘ఎంత అందంగా ఉంది నా పాప!’ అనుకుంటూ మరింత దగ్గరికి తీసుకున్నాను. అంతలోనే నా మొహం మ్లానమైంది. ఆలోచనలు తేనెపట్టును కదిపినట్లు ముసురుకుంటున్నాయి.
“దొంగ సచ్చినోడు! ఎంత మాటన్నాడు. ఈడి దివసం పెట్టా!” తిట్టుకుంటూ లోపలికి వచ్చింది గంగవ్వ.
“ఎవర్ని అంతలా శాపనార్థాలు పెడుతున్నావు?” పేలవంగా నవ్వుతూ అడిగాను.
“ఆ గౌడుగేద గాడికి, ఆ కర్రి మొహం గాడికి నువ్వు కావాలంట. నేకపోతే అప్పు పుట్టదని సెప్పీసినాడు” మెటికలు విరిచింది గంగవ్వ.
కరోనా వల్లగాని.. లేకుంటే గురవయ్యకు ఆమాట అనే ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడు అవసరం కొద్దీ లొంగుతానని వాడి ప్లాన్ అయ్యుంటుంది.
మర్నాడు గంగవ్వను పిలిచి..
“అతణ్ని రమ్మన్నానని చెప్పు” అన్నాను.
కళ్లు పెద్దవి చేస్తూ చూస్తున్న గంగవ్వను చూసి..
“ఈరోజుల్లో ఏదీ ఆశించకుండా ఎవరైనా ఏం చేస్తారు గంగవ్వ! ఎవరో నీలాంటి పిచ్చి తల్లులు తప్ప!”.. నవ్వుతున్న నన్ను చూసి గంగవ్వ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి తొమ్మిది దాటాక రమ్మని గురవయ్యకు చెప్పి వచ్చింది.
పక్క గదిలో మంచం మీద ఉతికిన దుప్పటి వేసి రెండు అగరొత్తులు వెలిగించింది. గురవయ్య రాగానే పాల గ్లాస్ చేతికి అందించింది.
“గదిలో తాగేవాణ్నిగా?” వెకిలిగా అంటూ, నన్ను తినేసేలా చూస్తూ పాలు తాగాడు.
“తమరు గదిలో పడుకోండి బాబు! అమ్మాయిని సిటికలో అంపేత్తాను!” అంటూ గదిలోకి దారితీసింది. వాడి చవక రకం సెంటు వాసన గుప్పున కొట్టి నా కడుపులో తిప్పింది.
“ఏంటది లైట్ తీసేసావు?” అంటున్న గురవయ్యతో..
“మా పిల్లకు లైట్ ఉంటే నచ్చదు బాబు!” అంటున్న గంగవ్వ మాటలు వినిపించాయి.
“బెడ్‌లైట్ అయినా ఉంచు” అంటుంటే..
“అది పాడైపోనాది బాబు! అయినా సిత్రాలు పోతున్నారు ఏంటి? మా పిల్ల పెద్ద ఎలుగు కాదేంటి తమరికి?”.
కితకితలు పెట్టినట్లు గురవయ్య నవ్వు వినిపించింది.
“సుమమ్మా! నువ్వు పాపను ఏడవకుండా సూడు” అంటూ గబగబా సిల్క్ చీర చుట్టబెట్టుకుని, మొహానికి పౌడర్ రాసుకుని గదిలోకి వెళ్లి, తలుపు గడియ పెట్టేసింది గంగవ్వ. ఏం జరిగిందో నా మెదడు గ్రహించడానికి కొన్ని నిమిషాలు పట్టింది. తెలతెలవారుతుండగా గురవయ్య తూలుతూ బయటికి వెళ్లిపోయాడు.
మర్నాడు గంగవ్వ పగిలి, రక్తం కారుతున్న పెదాలు, గోళ్లలతో నిండి ఉన్న ఒళ్లు చూస్తే నా కళ్లు ధారాపాతంగా వర్షించాయి.
“ఎందుకు తల్లీ అలా బాధపడతావ్? నేనేమైనా మగాడి సెయ్యి ఎరగని దాన్నా? నీదసలే పచ్చి బాలింత ఒళ్లు. ఆడ్ని తట్టుకోగల్దు వేటి? పాలల్లో కాసంత నల్లమందు కలిపినాను కాబట్టి ఆ మాత్తరం అయినా ఉన్నాడు. నువ్వే అనుకుని.. ‘సుమా! సుమా!’ అంటానే ఉన్నాడు ఎదవ!”.. నవ్వుతున్న గంగవ్వను చూస్తూ దండం పెట్టాను.
“సాల్లే తల్లీ.. తప్పు! కూసేపు పడుకుని లేసి ఆడి కొట్లో సరుకులు తెత్త!” అంటూ ఒరిగింది గంగవ్వ.
కాపాడాల్సిన కన్నతండ్రి అన్యాయం చేసాడు. ఎటువంటి బంధం లేని ఈ మహాతల్లి కంటికి రెప్పలా కాస్తున్నది. ఎంత నల్లమబ్బుకైనా వెండి అంచు ఉంటుందంటే ఇదే కాబోలు అనుకున్నాను.
“ఎవరైనా ఉన్నారా లోపల?”.. బయటి నుంచి ఆడగొంతు వినిపించింది.
“ఎవరూ?” అంటూ బయటికి నడిచింది గంగవ్వ.
నేను తొంగి చూశాను. కొంచెం దూరంగా కారు కనిపిస్తున్నది. గంగవ్వతో మాట్లాడుతున్న ఆవిడ చీర కొంగు రెపరెపలాడుతూ కనిపించింది.
“మరేం లేదమ్మా.. ఈ రోజుల్లో అందరిలాగానే మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారని అనిపించింది. కాస్త బియ్యం, పప్పు కొన్ని నిత్యావసరాలు పంచుదామని వచ్చాం. ఇల్లిల్లు తిరిగి ఇవ్వడం కష్టం కదా.. నువ్వు అందర్నీ అంటే ఇంటికి ఒకరు చొప్పున ఇక్కడికి తీసుకురాగలవా?” అడుగుతున్నది ఆవిడ.
“ఎంత మంచి మనసమ్మా మీది? మాలాంటి వాళ్ల ఇళ్లకు వచ్చి మరీ ఇత్తామంటున్నారు. మా బాధలను తీర్సమని ఆ బగవంతుడే మిమ్మల్ని అంపించి ఉంటాడు. నే ఎళ్లి తీసుకు వత్త తల్లి! మీకు అబ్బెంతరం నేకపోతే ఇలా కూసోండి తల్లి!” అంటూ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేసింది. కారు దగ్గర ఉన్న ఆమె భర్తను కూడా పిలిచింది. ఆయన కుర్చీ మీద, ఆవిడ చెక్కపెట్టె మీద కూర్చున్నారు.
“భారతి టీచర్!”.. వయసు పైబడిన ఛాయలు తప్ప ఆమెలో పెద్దగా మార్పు లేదు. పరుగున వెళ్లి ఆవిడ కాళ్ల మీద పడ్డాను. ఆవిడ తెల్లబోయి చూసినా వెంటనే గుర్తుపట్టారు.
“సుమా! నువ్వేంటి ఇలాంటి చోట!?” అంటున్న ఆవిడ బాధాకరమైన ప్రశ్నకు నా గాథ అంతా కన్నీళ్ల మధ్య వెళ్లబోసుకున్నాను. భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడ్డారు.
“చక్కగా సుమ అని పేరు పెట్టుకున్న నీ జీవితం పువ్వులాగే వాడిపోయింది తల్లీ!” అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
“నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు సుమా! నీ పాపకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి. మేం నిన్ను తీసుకెళ్లి నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తాం. నీకు అండగా ఉన్న గంగవ్వ కూడా నీతోనే వస్తుంది” అన్నారు అంకుల్.
“నేను వస్తే మీకు మీకు..” అంటూ మాట పూర్తి చేయలేకపోయాను.
“మంచిపని చేయడానికి మేం ఎవ్వర్నీ లెక్కచేయం. నువ్వు ఎలాంటి భయాలు, శంకలు పెట్టుకోకు!” అంటున్న శివపార్వతుల్లాంటి వాళ్ల కాళ్ల మీద పడితే నా బాధలన్నీ దూరమైనట్లు, నాకు నిజమైన రక్షణ లభించినట్లు అనిపించింది. ఇప్పుడు గంగవ్వ నా పాపకు అమ్మమ్మగా నాతోనే ఉంది. అమ్మ, తమ్ముడు ఇద్దరి గురించీ వాకబు చేస్తానని అంకుల్ మాట ఇచ్చారు.
కాపాడాల్సిన కన్నతండ్రి అన్యాయం చేసాడు. ఎటువంటి బంధం లేని ఈ మహాతల్లి కంటికి రెప్పలా కాస్తున్నది. ఎంత నల్లమబ్బుకైనా వెండి అంచు ఉంటుందంటే ఇదే కాబోలు అనుకున్నాను.
తాడిమేటి శ్రీదేవి
పాఠకుల మనసులను గెలుచుకునేలా కథలను మలచడంలో రచయిత్రి తాడిమేటి శ్రీదేవి నిష్ణాతులు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామం. ఎంఏ, బీఎస్సీ, బీఈడీ చేశారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విరమణ పొందారు. సాహిత్యాభిలాషతో 1998 నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. వీరు రాసిన పలు కథలు ఈనాడు, ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ప్రచురితమయ్యాయి. ఆంధ్రభూమి పత్రిక నిర్వహించిన కథల పోటీలో.. ‘రీఛార్జ్’ కథ రూ.2000 ప్రత్యేక బహుమతి గెలుచుకున్నది. ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన ‘అలా అలా అనంతంగా’, ‘ఓ తల్లి తీర్పు’, ‘వాక్భూషణం భూషణం’, ‘లక్ష్మణరేఖ’ కథలు పాఠకుల మన్ననలు పొందాయి. నమస్తే తెలంగాణ – ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ – 2022లో వీరి కథ.. ‘కంచె’ రూ.2000 బహుమతి పొందింది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి
పొందిన కథ.
-తాడిమేటి శ్రీదేవి
99126 07227