‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
పరీక్ష చేసిన డాక్టర్‌కు అమ్మ కడుపులో బిడ్డ తేడాగా ఉన్నట్టు తెలిసింది. అప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేసుకున్నాడు. ఫోన్లూ.. వగైరాలు లేవు. ఉన్నదల్లా చదువుకున్న జ్ఞానమూ, ఆసుపత్రిలో ఉన్న పుస్తకాలూనూ! తోడుగా తల్లుల లాంటి నర్సులు.
“పెద్ద కష్టమేమీ కాదు.. నువ్వు సులభంగానే గుర్తుపట్టగలవు. మిగలముగ్గిన దోస పండును నిలువునా కోసినట్టు ఉంటాడాయన. వయసు తొంభై మూడు.. అయినా అరవై మూడుకు మించవని పందెం వేయొచ్చు. రోజుకు రెండు మొక్కజొన్న పొత్తులు తిని బతికేస్తున్నాడు. ఆయనతో నడకలో పోటీ పడ్డం మనవల్ల కాదంటే కాదు. చాలా ముఖ్యమైన పనన్నారు. ఏంటో చెప్పరు. నువ్వే చూస్తావుగా! వెళ్లి రిసీవ్ చేసుకో.. విమానం వచ్చేది పన్నెండున్నరకు. బయల్దేరు!.. అన్నట్టు ఆయన పేరు కూడా విచిత్రంగా ఉంటాది. యాజ్ఞవల్క్య కృష్ణ! ఈ రోజుల్లో ఆ గోల ఎందుకులే అనీ.. సింపుల్‌గా కె.వై. కృష్ణ గారనో.. బాగా దగ్గరి వాళ్లయితే యజ్ఞ కృష్ణ అనో పిలుస్తారు. అసలు ఇదేదీ కాదు.. ‘ఆయన పేరు కృష్ణ సోమయాజులు అంటాడు’ మన శర్మ. తమాషా ఏంటంటే.. ఎలా పిలిచినా పలుకుతాడు మహానుభావుడు. తానంత గొప్ప సైంటిస్ట్‌నని గానీ.. ఈ దేశమే గర్వించదగ్గ పనులు ఇన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయని గానీ.. పిసరంత గర్వం వెతికినా కనిపించదు. అసలు నేనే వద్దును. ఒప్పుకోడు. సీరియస్ అవుతాడు. ఆఫీస్ పని ఆగకూడదు. ఆయనతో మంచి అనుభవం నీకు. నాది పూచీ.. వెళ్లిరా!”..
గాల్లోనే రెండు చేతులూ జోడించి నమస్కారం చేసుకుంటూ.. చెప్పుకొంటూ పోతున్నాడు ఆఫీసర్.
ఆలోచనలతోనే రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను. నిజవే.. అంతమందిలోనూ ఆయన్ని గుర్తుపట్టడం అసలు కష్టం కాలేదు. పరిచయాలయ్యాయి. ఆయన పర్సనల్ బ్యాగ్ ఆయనే మోసుకుంటూ..
“లెట్మి హెల్ప్ మైసెల్ఫ్ డియర్ బాయ్”.. అంటూ కారెక్కారు.
ప్రభుత్వ వ్యవస్థ ప్రసాదించిన జన్మహక్కు లాంటి అతి వినయంతో ముందు సీట్లో కూర్చోబోయాను. ఆయన నవ్వి..
“నో ఫార్మాలిటీస్! ఇలా వచ్చి వెనక సీట్లో కూచో. మాట్లాడేప్పుడు మెడ నొప్పి రాకుండా ఉంటుంది. ఆ.. నీ పేరు నాకు చాలా ఇష్టం అంబేడ్కర్” అన్నారు.
ప్రయాణం మొదలైంది.
“మనం ఎలాగూ గంటన్నర ప్రయాణం చేశాక గానీ అమలాపురంలో నా బసకు చేరుకోలేం కదా?!” అంటూ.. కార్ అద్దాలు దించేసి, హాయిగా గోదారి గాలిని తనివితీరా ఆస్వాదిస్తూ.. ధ్యానంలోకి వెళ్లి
పోయారు ఆయన.
నాలో ఒకటే ఉత్సుకత.
‘సార్! మీ పేరేమిటి?’ అని అడగాలి.. ఎలా..?
‘పేరులో నేముంది!’ అని నవ్వేస్తాడా!!
ఇంతలో డ్రైవర్ సెల్ మోగింది. అవతల అతని భార్యనుకుంటా. పిల్లాడి గురించో.. పిల్ల గురించో ర్యాంకుల ఫిర్యాదులు.
“సిజేరియన్ పిల్లలు మరీ!”.. అంటున్నాడు డ్రైవర్.
ఈయన అది విన్నారు. చిన్నగా నవ్వుకున్నారు. బయటినుంచి గోదారి గాలి చల్లగా వీస్తున్నది.
“అంటే! సిజేరియన్ పిల్లలు చదువులు చదవరంటావేంటోయ్!” అన్నారు.
డ్రైవర్‌కు ఎందుకో ఏమీ పాలుపోలేదు. నవ్వబోయి.. ఏం చెయ్యాలో తోచక హారన్ కొట్టాడు.
మళ్లీ నిశ్శబ్దం కార్లో.. గాలిహోరు తప్ప ఏమీలేదు.
ఆ నిశ్శబ్దాన్ని ఆయనే ఛేదించారు.
“నేను ఇక్కడే పుట్టానోయ్! నేనూ సిజేరియన్ బేబీనే.. ఆ మాటకొస్తే బహుశా ఇండియాలోనే మొట్టమొదటి సిజేరియన్ ఆపరేషన్ మా అమ్మదే అయ్యుంటుంది” అన్నారు.
పలకరిస్తున్నట్టు ధవళేశ్వరం గోదారి గాలి, కారులో మమ్మల్ని సృశిస్తూంది. జ్ఞాపకాల ఆనకట్ట తెగినట్టు.. వరద గోదారిలా ఆయన భావోద్వేగం. “ఆ! అన్నట్టూ నువ్వు కథలు రాస్తావంట కదా!?” అన్నారు నా వేపు తిరిగి.
కొంచెం సిగ్గూ.. కొంచెం గర్వం! ఒకేసారి ప్రదర్శిస్తూ తలూపాను.
“నా కథ చెప్పనా!? కాలక్షేపం కూడానూ..” అన్నారు.
“సరిగ్గా తొంభై మూడేళ్ల క్రితం.. మా అమ్మ సద్బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న పిల్ల.. నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న రోజులు. అత్తగారు, అమ్మగారు ఒకే ఊరు కావడంతో ఇబ్బందులు లేవు. అంబాజీపేటలో దొరల ఆసుపత్రికి పరీక్ష కోసం తీసుకెళ్లారు. ఆ డాక్టర్, నర్సుల పేర్లు కూడా నాకు గుర్తే! అమ్మ ఎంత మురిసిపోయేదో.. వాళ్లని తలుచుకుని. పీటర్సన్, మరియా! తెల్లదొరలు. పరీక్ష చేసిన డాక్టర్‌కు అమ్మ కడుపులో బిడ్డ తేడాగా ఉన్నట్టు తెలిసింది. అప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేసుకున్నాడు. ఫోన్లూ.. వగైరాలు లేవు. ఉన్నదల్లా చదువుకున్న జ్ఞానమూ, ఆసుపత్రిలో ఉన్న పుస్తకాలూనూ! తోడుగా తల్లుల లాంటి నర్సులు. రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మన్నారు అమ్మను. పరీక్ష చేశారు. ఆపరేషన్ చేస్తే తప్ప తల్లీ, బిడ్డా చెప్పలేమన్నారు.
ఆపరేషన్‌కు సిద్ధం కమ్మన్నారు.
‘పిదపకాలం కాకపోతే దేవుడిచ్చిన మేరకు కృష్ణా.. రామా.. అనుకోక ఈ ఆపరేషన్ ఏవిటి.. ఖర్మ! ఇంటా, వంటా లేని విడ్డూరం కాపోతే! చస్తే వాడి లీల అనుకోవాలి గానీ.. వీళ్లేం దిగొచ్చారా!? తలరాతలు కూడా మార్చేస్తారే! ససేమిరా ఒప్పుకొనేది లేదు’ అంటూ తోకతొక్కిన తాచే అయ్యాడు యాజులు.. మా నాన్న.
నానమ్మ అయితే ఒకటే శోకాలు పెరట్లో..
‘సంప్రదాయాలు మంట గలిపేస్తున్నార్రా దేవుడో! వద్దురా.. ఆ పిల్లవాళ్ల నాన్న ఇంగిలీసు చదువు చదివిన వాడంటే విన్నారా!?’ అంటూ..
ఇంత రాద్ధాంతంలోనూ ఆమెను సమర్థించినవాడు పుట్టింటి తరపున ఆమె తమ్ముడే. స్వతంత్ర పోరాటంలో చురుకైన కార్యకర్తగా అప్పుడప్పుడే ఎదుగుతున్నవాడు. బ్రిటిష్ వాళ్లను ఎంత శత్రువులుగా చూసినా.. వాళ్ల ఆసుపత్రుల సేవలూ, రైల్వే తదితరాలు నిశితంగా గమనిస్తున్న తరం వాడు. ఆ విధంగా మా అమ్మకు పెట్రొమాక్స్ లైట్ల కాంతిలో పీటర్సన్గారు సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ఇదిగో ఇన్నేళ్లకు నేనిలా!” అంటూ నవ్వారాయన.
డ్రైవర్‌కు వింతగా, విశేషంగా తోచిందన్నది అతని చూపుల్లోనే తెలుస్తున్నది.
“ఏవోయ్.. మరి నేనెలా సైంటిస్ట్ అయ్యానంటావు?” అంటూ మేల మాడేరు.
కారు రోడ్డు పక్కన టీ బంకు దగ్గర ఆపమన్నారు. ముగ్గురం దిగేం.
“ఇలా రోడ్డు పక్క బంకుల్లో టీగానీ, రొట్టెలు గానీ.. ఏ స్టార్ హోటల్లో కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. తెలుసా!?” అంటూ, అక్కడే నులక మంచం మీద కూర్చుంటూ.. నన్నూ, డ్రైవర్‌ను కూడా కూర్చోమన్నారు.
డ్రైవర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఆయన ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు.
“ఇక్కడ సరే! మరి కారులో తప్పకుండా కూర్చోవాల్సిందే కదా!” అంటూ నవ్వారు.
డ్రైవర్‌కు ఓ క్షణంలో అర్థమైంది. వెంటనే కూర్చున్నాడు. టీ, పకోడీ ఆర్డర్ ఇచ్చేరు. వేడిగా పకోడీలు నముల్తూ మళ్లీ కబుర్లు మొదలెట్టారు.
“అలా రికార్డులలో లేకపోయినప్పటికీ.. నేను బహుశా ఈ దేశంలోనే మొట్టమొదటి సిజేరియన్ పిల్లాడినయ్యాను. ఇంటికొచ్చాక మా నాన్న.. ‘అప్రాచ్యపు ముండా!’ అన్నాట్ట అమ్మను. నన్ను చూడనే లేదంట.
‘వాడా!? అప్రాచ్యపు వెధవ. వాడి మొహం చూస్తేనే అష్ట మహాపాతకాలూ మెడకు చుట్టుకున్నట్టు. నేను చూడను.. ఆ అప్రాచ్యుణ్ని’ అనే వారంట.
మా మావయ్య నన్ను ఎత్తుకుని మురిసిపోతూ, ఆడిస్తూ ఉన్నప్పుడల్లా.. నాన్న గారి తిట్ల దండకం మొదలయ్యేది.
‘పిల్లాడి జాతక చక్రం’ అంటూ.. మావయ్య ఓ కాయితం పట్టుకొచ్చి నాన్నకు వినిపించేలా చదివిన రోజు నుంచీ ఆయన ధోరణిలో కొద్దిగా మార్పొచ్చింది.
‘పిల్లాడు తండ్రి పుణ్యకార్యాల ఫలంగా పుట్టాడు. ప్రపంచం గర్వించదగ్గ మహాపురుషుడి చిన్నెలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నక్షత్ర బలం.. ఆ తెల్లోడు తెలిసి చేశాడో, దైవ సంకల్పమో చెప్పలేం గానీ.. భూపతన సమయం అమోఘం. అద్భుతం! అంతెందుకు.. ఒక్కమాటలో యాజులి కొడుకు కోటికి ఒక్కడు. అన్నిటికంటే ముఖ్యం.. తన తండ్రి తాలూకు పూర్వజన్మ బాకీగా ఉన్న అకాల మరణగండం వీడి జన్మ సమయం పుణ్యమా అనీ పూర్తిగా గడిచినట్టే!’
(ఏరా తమ్ముడూ! నిజం చెప్పు.. ఇది నీ పనేగదూ! భడవా! బావకు టోపీ వేస్తావూ!)
అప్పటినుంచీ నేను యాజులు గారబ్బాయిగా.. గారాల పుత్రుడినయ్యాను. ఇంతలో నా నామకరణ మహోత్సవం!”..
నామకరణం అనగానే.. ఉన్నట్టుండి నాలో ఉత్సుకత పెరిగింది. కారులో కాస్తంత ముందుకు జరిగాను.
కారు కడియం పూల తోటల మధ్య హైవే మీద పరిగెడుతున్నది. రంగురంగుల పూలు.. నేలకు ఇంద్రధనుస్సులు దిగివచ్చినట్టు. ఆయన కళ్లు మూసుకుని తిరిగి చెప్పడం మొదలెట్టారు.
“పంతులు గారి లెక్కల ప్రకారం ‘య’తో మొదలవ్వాలి పిల్లాడి పేరు. అలానే పెట్టాడు మా నాన్న. ఆ రోజుల్లో ఘనంగా జరిగిన ఆ నామకరణ మహోత్సవంలో మా అమ్మ ఓ అపురూపమైన నిర్ణయం తీసుకుంది. అంతా విని మా మావయ్య ముందు కాస్త ఆశ్చర్యం.. ఆపై సంతోషం వెలిబుచ్చాడు. (అప్పుడు నువ్వు ఎంతో ముద్దొచ్చావట్రా.. మావయ్యకు)
ఆరో ఏట బళ్లో వేయడానికి వెళ్లినప్పుడు (ఏవిటీ.. ఈ అప్రాచ్యుడు అప్పుడే బడీడుకు వచ్చాడూ!?) నా పేరు మాస్టారికి చెప్పి.. ఇంటిపేరుతో కె.వై. కృష్ణ అని మాత్రం రాయించింది. నాన్నకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. మాస్టారు కాస్త తడబడ్డాడు. కానీ, అక్కడున్నది బుచ్చమ్మ! మా అమ్మ! కొడుకును కన్నప్పటి నుంచీ అమ్మలో ఆత్మస్థయిర్యం అలవోకగా పెరిగిపోయింది. ఇప్పుడు తను మామూలు అణిగిమణిగి ఉండే ఇంట్లోమనిషి కాదుమరి. ఆయనేం అనలేదు. ఎప్పటిలానే మా నాన్న.. నన్ను ‘ఈ అప్రాచ్యపు వాడికి ఇంగిలీసు స్టయిల్ పేరెట్టుకుంది చూసావుటే.. అమ్మా!’ అంటూ దండకం మొదలెట్టాడు. అలా నేను అప్రాచ్యుడిగా మా అగ్రహారంలో పేరెళ్లిపోయాను”.
“ఇంతకీ అప్రాచ్యుడు అంటే.. ఏంటి సార్!!?” అని అడిగాడు డ్రైవర్.
ఆయన నవ్వేరు. కారు రావులపాలెం వంతెన మీదికొచ్చింది.
“గోదారిని చూడగానే అమ్మమ్మనో.. మేనత్తనో.. చూసినట్టు ఉంటుందయ్యా!” అన్నారు.
విశాల ప్రశాంత గంభీరంగా ప్రవహిస్తున్నది గోదారి. వందల సంవత్సరాల చరిత్రల్ని తనలో కలిపేసుకునీ.. ఏమీ తెలియని అమాయకత్వం నిండిన మార్మిక తత్వవేత్తలా! ఆయన నిజంగానే ఎవరో చిన్నప్పటి చుట్టాల్ని చూసినంత ఆప్యాయంగా గోదారి వేపు చూస్తూ మౌనంగా ఉండిపోయేరు. నేనూ కదిలించలేదు.
కారు బ్రిడ్జి దాటుతుండగా అడిగేరు..
“నేను ఇక్కడికి ఎందుకొస్తున్నానో తెలుసా నీకూ?!” అని.
లేదంటూ తలూపాను.
ఆయన చెప్పిన సంగతిని విని ఆశ్చర్యపోవడం తప్ప ఏం చెయ్యాలో తోచలేదు.
“పిల్లలు ఇద్దరూ రెండు దేశాల్లో సెటిల్ అయిపోయారు. నేనేమో రిటైర్ అయ్యి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఆవిడ వెళ్లిపోయి.. అవును ఆ మేనమావ గారి కూతురే! ఇప్పటికే పాతికేళ్లు దాటేసింది. హైదరాబాద్‌లో ఉన్న కోటి రూపాయల ఆస్తినీ ఇక్కడి కోనసీమ పల్లెలో ఒక ఆసుపత్రి అభివృద్ధికీ, కొన్ని స్కూళ్ల కోసమూ డొనేషన్ ఇద్దామని. దానికి మీవాళ్లను అడిగితే.. ఇదిగో నిన్ను పంపించేరు. నీకు ఇలాంటి విషయాలు బాగా తెలుసనీ.. నువ్వయితే నన్ను గైడ్ చెయ్యగలవనీనూ!”..
ఆయన చెప్తున్న ప్రతిసంగతీ కొత్తగానే ఉంది. అది గతంలో జరిగిందైనా, ప్రస్తుతం ఆయన నిర్ణయమైనా.. నన్ను విచిత్రమైన అనుభూతికి లోను చేస్తున్నది. అన్నిటికంటే ముఖ్యం.. ఆయన నామకరణం దగ్గరే ఆగిపోయిన నా ఆలోచనలు. అందులో ఏం విశేషం లేదు గానీ.. ఇంతవరకూ ఆయన అసలు పేరు ఎవరికీ తెలీదన్న తమాషా! నన్ను ఆట పట్టిస్తున్నది. ఆయనా అంతే సరదాగా దాటేస్తున్నారు. అయితే ఇప్పుడు పేరుకు బదులు ఆయన ఆశయాలు ఇంకా ముచ్చటేస్తున్నాయి.
కథ అర్ధాంతరంగా ఆపేసి ప్రస్తుతంలోకి వచ్చేరు.
“ఎంత సంపాయించి ఏం లాభం మై బోయ్! దాంతో నువ్వు బతకడం. నీ కుటుంబం బతకడం. ఇంకా.. ఇంకేమీ లేనప్పుడు నీ జీవితానికి అర్థం ఏవిటి? ఇంత ఆస్తినీ నేను ఏం చేసుకోను? పిల్లలా? రమ్మన్నా రారు.. (ఎన్ని యుగాలైనా ఈ డిసిప్లిన్ ఇండియాలో రాదు డాడీ!). ఒక పేరొందిన సైంటిస్ట్‌గా నా పిల్లలకు నేను నేర్పించింది ఇదా? కార్పొరేట్ పరుగులు.. ఆయాసాలు.. డబ్బులూ.. ఆపైన జబ్బులూ! ఇంతేనా!? అందుకే అమ్మ పుట్టిన ఊరికి నన్ను గన్న మా నేలకు నావంతు సాయంగా ఈ చిన్న పని చేద్దామని నిశ్చయించుకున్నా. అందుకే ఈ ప్రయాణం. ఇప్పుడు నీ సాయం. నువ్వు చేయాల్సింది.. నిజంగా సేవ చేయగలిగే ఆసుపత్రిని నాకు చూపించడం. ఇంతకంటే కఠిన పరీక్ష.. హే భగవాన్! ఆపై నేను చెప్పిన గ్రామాల్లో కులాలకు అతీతంగా కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేద్దాం. నేను కూడా వీలైతే గోదారొడ్డున ఒక చిన్న కుటీరం వేసుకుంటా. ఇక్కడే ఉంటా!”..
ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు చెప్పుకొంటూ పోతున్నారు.
“ఇంకా ఎంతకాలమో ఈ ప్రయాణం.. నాకైతే తెలీదు. సంకల్పం చేసుకున్నాను. వచ్చేశాను. ఇక నువ్వు సహాయం చెయ్యడవే! నీ గురించి కనుక్కు
న్నా లే!” అంటూ ఆపారు.
ఒక పేరొందిన సైంటిస్ట్‌గా నా పిల్లలకు నేను నేర్పించింది ఇదా? కార్పొరేట్ పరుగులు.. ఆయాసాలు.. డబ్బులూ.. ఆపైన జబ్బులూ! ఇంతేనా!? అందుకే అమ్మ పుట్టిన ఊరికి నన్ను గన్న మా నేలకు నావంతు సాయంగా ఈ చిన్న పని చేద్దామని నిశ్చయించుకున్నా. అందుకే ఈ ప్రయాణం. ఇప్పుడు నీ సాయం. నువ్వు చేయాల్సింది.. నిజంగా సేవ చేయగలిగే ఆసుపత్రిని నాకు చూపించడం.
కారు అమలాపురం గెస్ట్‌హౌస్ దగ్గర ఆగింది.
ఆయన స్నానం చేసి రిఫ్రెష్ అవుతున్నారు.
నేను ఆఫీస్‌కు ఫోన్ చేశాను. విషయం క్లుప్తంగా వివరించాను. నాకు తెలిసినంతలో ఆయన ఔదార్యానికి తగ్గ ప్లాన్ అప్పటికే నా మనసులో ఒకటి తయారయింది. అదే మా ఆఫీసర్‌కు వివరించాను.
“అందుకే కదా నిన్ను పని గట్టుకుని ఆయన ప్రొటోకాల్‌కు వేశాను. కానీయి! ఆల్ ద బెస్ట్!” అన్నాడు మా ఆఫీసర్.
కృష్ణ గారు కాసేపు విశ్రాంతి తర్వాత నన్ను పిలిచేరు.
“మీలాంటి వారు ఇలా పల్లెల్లోకీ, దళిత వాడల్లోకీ వచ్చి.. ‘ఏ స్వార్థమూ లేకుండా ఇంత చేస్తా!’ అంటే, బహుశా మావాళ్లు నమ్మరండి” అంటూ నేను అనుకున్నది చెప్పాను.
ఆయన నవ్వేరు. నవ్వితే పారిజాతం చెట్టు ఊగినట్టు ఉంది. నిండా మానవత్వపు పరిమళం.
“ఓ పనిచేయి. నా పేరు చెప్పు. అప్పుడు నమ్ముతారు” అన్నారు.
మళ్లీ ఆయనే గుర్తు చేశారు. నాకు ఉత్సుకత.. మళ్లీ!
“నా పేరు చెప్పలేదు కదూ.. యేసు కృష్ణ! ఆవేళ మా అమ్మ బళ్లో మాస్టారితో ఈ విషయం చెప్పి, ఎవరికీ తెలీకుండా ఇనీషియల్ మాత్రం రాయించింది. అప్పట్నుంచీ నా పేరు కె.వై. కృష్ణ గానే అందరికీ తెలుసు. యేసు కృష్ణ అని దాదాపు ఎవరికీ తెలీదు. మా మిత్రులు మిగతా కథనంతా పుట్టించేరు. నాకు బోలెడంత సరదా! కామెడీ సినిమా అన్నమాట. మనుషులు మనుషులుగా కృతజ్ఞతతో ఉండటానికి పేరుతో పనేముంది!? మత మార్పిడి చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది!? కావాల్సింది మనసు.. కదా!?” అన్నారు.
ఆపై ఆయన అకౌంట్ వివరాలు చెప్పేరు. ఇన్నాళ్లూ ఉన్న ఫ్లాటు అడ్రెస్ వగైరాలు. ఆయన రాబోయే రెండేళ్లలో ఏమేమి పనులు అనుకుంటున్నారో వివరంగా చెప్పేరు.
“ఇవన్నీ కొనసాగించడం అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ నువ్వు.. నీలాంటి వాళ్లూ తలుచుకుంటే చెయ్యగలరు. నిజాయితీ.. అంతే! అంతకుమించిన పెట్టుబడి జీవితంలో ఇంకేం ఉండదు. డబ్బంటావా.. ఇదిగో నేనిస్తా. నీ గురించి పూర్తి వివరాలు చాలాకాలంగా కనుక్కున్నాకే నిన్ను నా కూడా పంపమన్నాను. ఎంతైనా సైంటిస్ట్‌ని కదా.. ఏదీ ఊరకే నమ్మను. ‘పిల్లాడు రత్నం సార్.. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదూకుని ఇంత వాడయ్యాడు. సిన్సియర్. తనకొచ్చే జీతంలోంచి ప్రతినెలా కొంత హాస్టల్లో పిల్లలకు ఖర్చు పెడుతూ.. రాత్రిళ్లు వాళ్లకు టూషన్లు చెప్తూ ఉంటాడు. మీకు నచ్చుతాడు’.. ఇదీ నీ గురించి నాకు వచ్చిన అచ్చమైన సమాచారం” అంటూ నవ్వారాయన.
“కోటి రూపాయలా!? బాబోయ్!” అన్నాడు చంద్ర.
అంతా చెప్పేసరికి వాడికి దాదాపు మతిపోయింది.
“ఎంత ఆస్తి ఉంటే మాత్రం.. ఇలా గుర్తు పెట్టుకుని మరీ మనూరొచ్చి ఈ మంచి పనులేంటీ? ఎవరో మామూలు ఆయనలా లేడీయన.. రేపే వచ్చి ఓపాలి చూడాలనుంది” అన్నాడు.
ఆ రాత్రి నాకో అంతర్జాతీయ కాల్ వచ్చింది.
“నేను.. ఆస్ట్రేలియా నుంచి కృష్ణ గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. ఆయన ఇవ్వాళే అక్కడ దిగారని తెలిసింది. కొడుకూ.. వారసుడు.. అనేం లేదా ఆ పెద్దమనిషికి. కోట్ల రూపాయల ఆస్తిని ఏదో దానం చేస్తానని తిరుగుతున్నాడట. ఇలాంటి అప్రాచ్యపు వేషాలతోనే జీవితం అంతా గడిపాడు. మీరెవరో తెలీదు. వాకబు చేస్తే చెప్పారు. చూడండి మిస్టర్.. మీరీ విషయంలో జాగర్తగా ఉండటం మంచిది. మా చెల్లాయి అమెరికాలో ఉంటుంది. అది నా కంటే సీరియస్‌గా ఉందీ విషయంలో! రేపు లీగల్ విషయాల్లో మీ పేరు చేర్చడం.. మీరు అనవసరంగా ఇబ్బందుల్లో పడటం.. అందుకే ముందుగా ఓ మాట చెప్తున్నా. ఆయన్ని ఎలా కన్విన్స్ చేస్తారో మీ ఇష్టం. ముదనష్టపు మనిషి.. అప్రాచ్యుడు. వీయ్ డోంట్ లైక్ హిం!”..
కాల్ కట్ అయ్యింది.
నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నిజానికి ఇది ఊహించిందే. కానీ ఇంత గొప్ప పెద్దాయన పెంపకంలో ఇలాంటిది ఉంటుందని అనుకోకపోవడంతో వచ్చింది దిగులు. ఇంకో భాషలో చెప్పాలంటే.. అదీ నిజమేనేమో అని కూడా అనిపించింది ఓ క్షణం. కోటి రూపాయల ఆస్తి. దానం ఇచ్చేయడవే!?.. వెంటనే ఎందుకో నా మీద నాకే చిరాకేసింది. పొద్దున్నే ఈ సంగతి ఎలా వివరించాలా అని ఆలోచిస్తూ కలత నిద్రలో గడిపాను.
“ఆరు లేరండీ! తెల్లారగట్టే ఎల్లిపోయారు. మీరొస్తే థాంక్స్ చెప్పమన్నారు”.. అన్నాడు వాచ్‌మన్.
ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. హిమాలయాలకు వెళ్లిపోయారని అన్నారు. ఎక్కడో మారుమూల వృద్ధాశ్రమంలో ఉంటున్నారని కొందరన్నారు. చనిపోయారని కొందరు.. కాదని ఇంకొందరూ అనుకుంటూనే ఉన్నారు. ఏమైనా.. ఆయనెక్కడున్నా వాళ్ల పిల్లలకు మాత్రం తెలియనివ్వరని నాకు తెలుసు. ఆయనతో సరదాపడి తీసుకున్న సెల్ఫీలు చూస్తున్నప్పుడెల్లా..
‘తెలిసిందా.. అప్రాచ్యుడు అంటే ఏంటో!?’ అని కవ్విస్తూ నవ్వుతుంటారాయన ఫొటోలోంచి..
డా. ఎల్.కె. సుధాకర్
ఎల్.కె. సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. రచయితలు, సాహితీ అభిమానులకు ‘కొబ్బరాకు సుధాకర్’గా ఈయన సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ అనేక కథలు, కవితలు రాశారు. కొబ్బరాకు కవిత్వం, గొబ్బిపూలు కథలు పుస్తకాలను వెలువరించారు. కైలాస మానసరోవరం అనువాదం, కుంకుమ రజను పేరుతో భారతీయ కవితల అనువాదం, స్వామి నిగమానంద జీవిత చరిత్రను పుస్తకాలుగా తీసుకొచ్చారు. వివిధ పత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో 17 (ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక) బహుమతులు గెలుచుకున్నారు. మూడు బంగారు పతకాలు అందుకున్నారు.
డా. ఎల్.కె. సుధాకర్