“అమ్మా!”..
హరిహరన్ అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు.
“కిచెన్‌లో ఉన్నా..” అని అరిచినట్టే చెప్పింది శారదాంబ.
వంటగదిలో గుత్తివంకాయలకు మసాలా పెడుతున్న శారద, పక్కన టమాటాలు కోస్తున్న చంద్రశేఖర్.. ఇద్దరూ కొడుకువైపు చూశారు.
హరి మొహం నిండా నవ్వు.
“ఏమైంది హరీ?”.
“నాకు ఎయిమ్స్‌లో మెడికల్ సీటు వచ్చింది డాడీ!”.
చంద్రశేఖర్ వచ్చి హరిని హత్తుకున్నాడు. శారద కళ్లనిండా నీళ్లు. దీనికోసం హరి ఎంత కష్టపడ్డాడో వాళ్లకు తెలుసు. శారద వచ్చి కొడుక్కు స్వీట్ తినిపించింది.
“ఇప్పటినుంచి డాక్టర్ హరిహరన్. సన్నాఫ్ చంద్రశేఖర్! ఈ విషయం అందరికీ చెప్పాలి!”.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు చంద్రశేఖర్.
“అక్కర్లేదు డాడీ.. కాసేపైతే ప్రెస్‌వాళ్లు వస్తారు”.
అన్నట్టుగానే ప్రెస్‌వాళ్లు వచ్చారు. వాళ్లు అడిగినదానికి సమాధానాలు ఇస్తున్నాడు హరి.
“ఇదంతా మా అమ్మనాన్నల వల్లే సాధ్యమైంది” అని చెప్పాడు.
ప్రెస్‌వాళ్లు చంద్రశేఖర్నూ అడిగారు.
“చాలా గర్వంగా ఉంది. నా కొడుకు ఒక తరానికి ఆదర్శంగా నిలబడ్డాడు” అన్నాడు.
బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచీ అభినందిస్తూ చాలా ఫోన్స్ వచ్చాయి.
ఆ తర్వాత ఎమ్మెల్యే రాజవర్ధన్‌ను కలిశారు.
“మీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్ను అడగండి. నీ కొడుకులాంటోడు ఊరికి ఒక్కడుంటే చాలు.. దేశం ఎప్పుడో బాగుపడేది!”.
ఎమ్మెల్యే మాటలకు చంద్రశేఖర్ ఆనందంతో తల ఊపుతున్నాడు. హరిని హత్తుకొని..
“హరిహరన్.. నువ్వు మీ నాన్ననే కాదు, మన నియోజకవర్గం మొత్తం తల ఎత్తుకునేలా చేశావ్!”.
హరికి ఇబ్బందిగా ఉన్నా.. ఏమీ అనలేకపోయాడు.
“హలో!”. “ఆ.. అమ్మా!”.
“ఏంట్రా ఈమధ్య ఫోన్ చేయడం లేదు. కొంపదీసి.. ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి?”.
అటునుంచి ఏ సమాధానమూ లేదు. పెళ్లి, అమ్మాయిల గురించి కానీ మాట్లాడితే హరి పెద్దగా ఏం మాట్లాడడు. హరి చాలారోజుల నుంచి ఫోన్ చేయకపోతే చాలు.. ఇదే విషయం గురించి శారద ఆటపట్టిస్తుంది.
“మా కోడలిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్?”.
“అలాంటిదేం లేదమ్మా”.
“ఉంటే చెప్పు రా.. మాకే ప్రాబ్లంలేదు. మాదీ
లవ్ మ్యారేజే! మేమంటే మావాళ్లతో కొట్లాడి
ఒప్పించుకున్నాం. నీకా ప్రాబ్లంలేదు. మాకు
ఉన్నది నువ్వొక్కడివే!”.
“అబ్బా.. అదంతా అయ్యే పని కాదులేమ్మా!”.
“అయితే, ఎవరూ లేరా..?”.
“ఎవరూ లేరు. నెక్ట్స్ మంత్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్సామ్స్ ఉన్నాయి. అందుకే చదువుకుంటున్నా.. అంతే!”.. కొట్టినట్టుగా చెప్పాడు.
‘అమ్మాయిల గురించి అంటే చాలు, కంగారుపడిపోతాడు. ఎలా బతుకుతాడో ఏమో..!?’ అనుకొని ఫోన్ పెట్టేసింది శారద.
సూర్యుడు చీకట్లో కలవడానికి సిద్ధం అవుతున్నాడు. శారద, హరి ఇంటి పక్కనున్న పార్క్‌లో నడుస్తున్నారు. అక్కడ చాలా ప్రేమజంటలు ఉన్నాయి. హరి మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.
“ఆ అమ్మాయి చూడు.. నవ్వితే ఎంత బాగుందో! నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా ఇలాగే ఉంటుందా!?” మళ్లీ ఆటపట్టిస్తున్నది తల్లి.
“ఆ అబ్బాయి కూడా నవ్వితే భలే ఉన్నాడు. బుగ్గలు సొట్ట పడుతున్నాయి. బాడీ, హెయిర్ స్టయిల్ కూడా బాగుంది!”.. అంటున్న హరి కళ్లలో ఈర్ష్య..
హరివైపు చూసింది శారద. ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడినా, అలిగినట్టు ఉంటాడు. ఇప్పుడు అలా లేడు. శారద ముందుకు నడుస్తూ..
“నీ ఇంటర్న్‌షిప్ అయిపోగానే పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ నాన్న. ఇప్పటికే చాలా సంబంధాలు వస్తున్నాయి. మీ నాన్న ఫ్రెండ్ రఘునాథం అయితే చాలాసార్లు అడిగాడు. మీ నాన్నేమో.. ‘మావాడు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు’ అని చెప్పుకొంటూ తిరుగుతున్నాడు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు!” అంటూ చూసింది. హరి వెనకాలే ఆగిపోయాడు.
“ఏమైంది?”..
హరి ఏమీ మాట్లాడలేదు.
“కోపమొచ్చిందా?”.
హరి నేల చూపులు చూస్తున్నాడు.
“చూడు హరీ.. ప్రతి ఒక్కరూ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి భయపడతారు. నీవు భయపడాల్సిన పనిలేదు. ఏమున్నా అమ్మతో చెప్పేయి! అమ్మ చూసుకుంటుంది. సరేనా!”.. గదవ పట్టుకొని చెప్పింది.
ఒకసారి గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు. ఆ శ్వాసలోనే హరి భయాలన్నీ కొట్టుకుపోయాయి.
“అమ్మా.. ఇలా రా!” అని పక్కనే ఉన్న బెంచీపై కూర్చోబెట్టాడు.
ఎవరైనా అమ్మాయి పేరు చెప్తాడని ఆశగా, నవ్వుతూ కూర్చుంది శారద.
హరి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు.
“అమ్మా!”.
చీకట్లు సూర్యుణ్ని మింగేయడం వల్ల, అతని కళ్లలో భయం కనిపించడంలేదు. కానీ, గొంతులో వినిపించింది.
“అమ్మ దగ్గర చెప్పడానికి భయం ఎందుకు హరి?” అని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
“అమ్మా.. నాకు ఒకమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఇష్టంలేదు” అని తల కిందికి దింపుకొన్నాడు.
శారదకు ఏమీ అర్థంకాలేదు.
“అమ్మా! నాకు అమ్మాయిలు నచ్చరు. నేను ‘గే’ని”.
అంతరిక్షంలోని ఉల్క వచ్చి ఆమె నెత్తిన పడింది.
తల వెయ్యి ముక్కలై మళ్లీ అతుక్కుంది. ఆమె కాళ్ల కింద భూమి కదలడం ఆమెకు తెలుస్తున్నది. ఆమె నవ్వు కూడా సూర్యునిలాగే చీకట్లో కలిసిపోయింది.
“ఈ విషయం డాడీకి నువ్వే చెప్పాలి” అని అలాగే ఒళ్లో పడుకున్నాడు.
అతని గొంతులో కంటే, అతని కళ్లలోనే తడి
ఎక్కువగా ఉంది.
“ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాలనుకున్నా. కానీ భయమేసిందమ్మా!”.
పొరలుపొరలుగా అతని ఏడుపు వినిపించింది. ఆమె మాత్రం తన ఏడుపును గొంతు దాటనివ్వడం లేదు.
“పోనీ.. ఎవరైనా డాక్టర్ని కలుద్దామా.?”
అంటూ తల నిమిరింది.
“నేను కూడా డాక్టర్నే అమ్మా”.
“సరే! నాకు ఏం చేయాలో, ఏమని చెప్పాలో, ఎలా ఒప్పించాలో తెలియట్లేదు. నీ ఇంటర్న్‌షిప్ అయిపోగానే ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్లు! అది అయిపోయేలోపు ఏదో ఒకటి చేద్దాం”.
‘ప్రకృతిలో ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటది. కానీ, ప్రతిసారీ పరిష్కారం లేని ఒక సమస్య పరిష్కరించమని సవాలుగా విసురుతుంది. అదే జీవితం’ అనుకొని హరిని ఓదార్చింది.
హరి ఫోన్ చేయకపోతే శారదే చేసేది. అప్పుడప్పుడూ వీడియో కాల్ కూడా. వీలైనంత నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నం చేసేది. శారద వేరే విషయాలు మాట్లాడినా.. హరి తిరిగితిరిగి అక్కడికే వెళ్లేవాడు.
“అమ్మా.. డాడీకి చెప్పావా!?”.
“ఇంకా లేదు”.
“ఏమంటాడోనని భయంగా ఉందమ్మా”.
“అవన్నీ నేను చూసుకుంటానని చెప్పానుగా. నీవు నీ స్టడీస్ మీద కాన్సెంట్రేట్ చేయి. నీవు అనుకున్న హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు రావాలి. సరేనా!?”.
అనుకున్నట్టుగానే హరికి హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. అదే విషయం శారదకు వీడియోకాల్ చేసి చెప్పాడు. చాలా సంతోషించింది.
“అమ్మా.. ఇంటికి రావాలని ఉంది”.
“ఇప్పుడొద్దు హరి”.
“మరి ఎప్పుడమ్మా? ఇప్పుడు అమెరికా వెళ్తే.. ఎప్పుడంటే అప్పుడు రావడానికి కుదరదు”.
“ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో అదే కరెక్ట్. ఎప్పుడు రావాలో నేను చెప్పే పనిలేదు. నీకు తెలుస్తుంది.. అప్పుడు రా!”.
“అమ్మా.. నా లాఫింగ్ బుద్ధా లేదేంటి?”.
“పగిలిపోయింది. నిన్న మీ నాన్నతో గొడవైంది!”.
“అమ్మా.. ఇలా పుట్టడం నా తప్పా..!?”
“నువ్వు గైనకాలజిస్ట్వి కదా.. నువ్వే చెప్పు!? ఇందులో నీ తప్పు ఉందా? మా తప్పు ఉందా??”.
హరి ఏం మాట్లాడలేదు.
“నేను చెప్పనా.. ఆడవాళ్లలో ఎక్స్ క్రోమోజోమ్స్.. మగవాళ్లలో ఎక్స్ అండ్ వై రెండూ ఉంటాయి. మగవాళ్లలోని ఎక్స్, ఆడవాళ్ల ఎక్స్‌తో కలిస్తే.. ఆడపిల్ల (ఎక్స్ఎక్స్). మగవాళ్లలోని వై, ఆడవాళ్ల ఎక్స్ క్రోమోజోమ్‌తో కలిస్తే.. మగ పిల్లాడు(ఎక్స్‌వై) పుడతారు. ఇందులో తేడాలు వస్తే.. ఎక్స్ఎక్స్వై అండ్ ఎక్స్వైవైగా మారుతుంది. వాళ్లే ఈ గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్లుగా పుడతారు. ఇది పుట్టుకతో కాకుండా పెరిగేకొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు.. ఇందులో ఎవరి తప్పు ఉంది!?”.
ఇదంతా బాగానే స్టడీ చేసిందనే ఆశ్చర్యంతో అమ్మనే చూస్తున్నాడు.
“ఈ మనుషులలో ఒక భయంకరమైన రోగం ఉంది. అదేంటో తెలుసా.. పరువు. దానికోసం హత్యలు కూడా చేస్తారు. తప్పును, మార్పును ఒప్పుకోవడం ఈ సమాజానికి చేతకాదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా.. ‘సమాజం ఏమనుకుంటుందో’ అనే భయం ఉంటుంది. దాన్ని దాటుకొని ‘ఏమనుకుంటే నాకెందుకు’ అన్న తెగింపు రావాలి. తర్వాత అవమానపడటం అలవాటు కావాలి. ఇవన్నీ దాటుకొని రావాలంటే ఎవరికైనా కొంచెం టైమ్ పడుతుంది. అందుకే.. అప్పటివరకూ నీ ఎమ్మెస్ చేసుకో!”.
ఆమె చదివిన సోషియాలాజీ.. హరిని నార్మల్‌గా చేయడానికి పనికొస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
“ఏమంటున్నాడు.. నీ పుత్రరత్నం. అమెరికా ఎలా ఉందట?”.
“అదేదో మీరే ఫోన్ చేసి అడగొచ్చుగా”.
ఈ మధ్య శారద – చంద్రశేఖర్ మాట్లాడుకున్నా.. పోట్లాడుకున్నట్టే ఉంటున్నది.
“ఏమని మాట్లాడాలి. ‘కొడుకా!’ అని పిలవాలా.. ‘కొజ్జా!’ అని పిలవాలా.. చెప్పు” అని అరిచాడు.
ఆమె మాత్రం నిశ్శబ్దంగా నిలబడింది. ఫ్యాన్.. గడియారం శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి.
“శారదా.. మనిద్దరి అభిప్రాయాలు ఒక్కటే అన్నావ్. వాడు పుట్టినప్పుడు మన ప్రేమకు ప్రతిరూపం అన్నావ్. మన ప్రేమ అటూఇటూ కానిదై., మనల్ని ఎటూ కానివాళ్లని చేసింది. ఇప్పుడు బయట తల ఎత్తుకొని ఎలా తిరుగుతాం. ఇంత జరిగినా.. అసలు వాడితో ఎలా మాట్లాడగలుగుతున్నావ్!?”.. నిజానికి అది అతని బాధ. కానీ, మగవాడు కదా కోపంగానే చెప్తాడు. కోపంతో మొదలై.. బాధతో ఆపాడు.
“ఇప్పటికీ మన అభిప్రాయాలు ఒక్కటే! కాకపోతే మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారు. నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నా.. అంతే! అప్పుడు మన పేరెంట్స్ సమాజం గురించి ఆలోచించి మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు నీవు, వాళ్ల స్థానంలోకెళ్లి ‘వద్దు’ అంటున్నావ్.. నేనిప్పటికీ నా స్థానంలోనే ఉన్నా! అప్పుడు మన కోసం పోరాడా. ఇప్పుడు నా కొడుకు కోసం పోరాడుతున్నా!”.
గడియారం ఒక్క క్షణం ఆగి, శారద వైపు గర్వంగా చూసి.. మళ్లీ పరుగెడుతున్నది. చంద్రశేఖర్ చూపు తిప్పుకొని గడియారం వంక చూశాడు. అందులో అతని గతమంతా సెకన్ల ముల్లు కంటే వేగంగా తిరిగింది.
“నాకొక విషయం చెప్పండి. ఒకవేళ మనకు కుంటివాడో.. గుడ్డివాడో.. పుడితే ఏం చేసేవారు? కొందరికి కన్ను, కాలు ఉండికూడా ఎలా పనిచేయవో.. అలాంటిదే నా కొడుకు శరీరంలో ఒక అవయవం పనిచేయట్లేదు. అంతే!”.. చంద్రశేఖర్‌కు తల్లి ప్రేమ కనిపిస్తున్నది. ఆమె తల్లిగానే కాదు.. మామూలు మనిషిగా కూడా ఇలానే ఉంటుంది. ఎవరూ జీర్ణించుకోలేని వాటిని అరిగించడం ఆమె ప్రత్యేకత. చంద్ర శూన్యంలోకి వెళ్లాడు. అతని మైండ్ కాంతికంటే వేగంగా పరుగెడుతున్నది. ఆ వేగంలో అతని కన్నీళ్లు అతనికి కనిపించలేదు.
“తల్లిగా వాడి మనసుకు తగ్గ శరీరాన్ని ఇవ్వలేకపోయాను. కనీసం జీవితాన్నయినా సరిగ్గా ఇద్దాం. వాడి అవయవాల్లో లోపం ఉన్నంత మాత్రాన, మన ప్రేమలో లోపం ఉన్నట్టు కాదు!”.
కూరగాయల త్రాసు కూడా మధ్యలో నిలబడదు. దాన్ని సరిగ్గా పట్టుకోగలిగితే సగం సమస్యలు తీరినట్టే! చంద్రశేఖర్ గుండె.. రాయి నుంచి కండరంగా మారింది.
“ఒకసారి వాడికి ఫోన్ చేయి.. మాట్లాడతా!” అంటూ, కన్నీరు తుడుచుకున్నాడు.
ఆమె ఆనందంగా ఫోన్ తీసుకుంది.
అప్పుడే హరి ఫోన్ చేశాడు.
“వాడే చేస్తున్నాడు!”..
‘స్పీకర్ ఆన్ చేయి!’ అన్నట్టుగా సైగ చేశాడు.
“హలో!”..
“అమ్మా!”..
పిలుపులో కాస్త భయం కనిపించింది.
“ఏమైంది హరీ!?”.
“అమ్మా.. నేను ‘గే’ కాదు!”..
శారద, చంద్రం.. ఆనందంతో ఒకరి మొహం
ఒకరు చూసుకున్నారు.
“నేను అమ్మాయిని”..
శారదకు సరిగ్గా అర్థంకాలేదు.
“ఏం మాట్లాడుతున్నావ్ హరి!?”.
“నిజం అమ్మా.. నేను బయటికి మగవాడిలా కనిపించినా.. నా లోపల ఆడవాళ్ల ఆర్గాన్స్ డెవలప్ అయ్యాయి. అంటే నేను ‘హీఫీమేల్’ అన్నమాట!”.
“అంటే ట్రాన్స్‌జెండర్ వా!?”.
‘అవును’ అన్నట్టుగా మూలిగాడు హరి.
చంద్రశేఖర్‌కు హరి మొహం.. మగవాడి రూపం నుంచి ఆడ రూపంగా మారుతూ కనిపించింది. గుండె కండరం నుంచి రాయిగా మారడానికి పెద్దగా సమయం పట్టలేదు. శారద చేతిలోని ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టి.. విసురుగా బయటికి వెళ్లిపోయాడు.
చంద్రం ఏం చేసినా.. హరి ఏం చెప్పినా.. శారద నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే.. ఆమె గుండె రాయిగా మారి చాలా రోజులైపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ రాయి పగిలి అందులోంచి ఏ మాత్రం రుచించని నీరు బయటికొచ్చి.. ఆమె చీర కొంగును తడుపుతుంది.
రెండు రోజులుగా ఆ ఇంట్లో మాటల్లేవు. శారదకు మాత్రం హరితో మాట్లాడాలని ఉంది. చంద్రానికి కూడా కాస్తా సమయం ఇద్దామని ఆగింది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తింటున్నారు.
“ఒకసారి ఫోన్ ఇవ్వండి, హరితో మాట్లాడాలి”.
“శారదా! నన్ను కాస్త ప్రశాంతంగా బతకనివ్వు!”.
“వాడు చేసిన తప్పేంటి?”.
“శారదా! వాడిప్పుడు ఆడదానిలా మారతాడు.
అది నాకు ఇష్టంలేదు”..
“అదే విషయం వాడితో మాట్లాడు.. వాడు ఏం అంటాడో విందాం. తర్వాత నీ ఇష్టం!”.
చంద్రశేఖర్ కాసేపు ఆలోచించి ఫోన్ ఇచ్చాడు.
“హలో.. డాడీ!”.
“హరీ!”.
“అమ్మా.. ఏమైపోయావ్!? రెండు రోజులనుంచి నీ ఫోన్ కలవట్లేదు”..
“నువ్వు ఫోన్ చేసినప్పుడు మీ నాన్న పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు”.. కాస్త ఆగి,
“నీవు ట్రాన్స్‌జెండర్‌గా మారడం ఆయనకు ఇష్టంలేదు”.. కొంచెం కఠినంగానే చెప్పింది.
“అమ్మా.. ప్లీజ్! ఇన్నాళ్లూ గొంగళి పురుగులా బతికానమ్మా! ఇవ్వాళ నాలో ఓ సీతాకోకచిలుక ఉందని తెలిశాక.. నా రూపం నాకు నచ్చట్లేదమ్మా!”.. చిన్నప్పుడు చాక్లెట్ కోసం బతిమాలినట్టు బతిమాలుతున్నాడు.
“అంటే.. నేనిచ్చిన రూపం నీకు నచ్చట్లేదా హరి!?”.. ఆమె గొంతే కాస్త జీరబోయింది.
“అలా కాదమ్మా! ఇది నువ్విచ్చిన రూపమే! ఇన్ని రోజులూ కొడుకులా బతికా, ఇకపై కూతురిలా బతుకుతా!”.. ఇదే చివరి కోరికన్నట్టుగా బతిమాలుతున్నాడు.
ఇటు.. చంద్రశేఖర్ మాత్రం పరువుకీ – బతుక్కీ మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శారద చెప్పిన మాటలు ఓ వైపు.. సమాజం ఛీత్కరించే మాటలు ఓ వైపు..
“హరీ!”.
“డాడీ!”.
“మనసు మార్చుకున్నంతా తేలిక కాదు.. శరీరాన్ని మార్చుకోవడం!”.
“ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి డాడీ. నాకు తెలిసిన స్పెషలిస్ట్‌లు ఉన్నారు. సర్జరీ తర్వాత వన్‌మంత్ ఇబ్బంది ఉంటుంది. అంతే! కానీ డాడీ.. వైద్యశాస్త్రంలో ఎన్ని మందులు వచ్చినా.. అవి శరీరానికే! నా మనసుకు మందు మాత్రం మీరే!”.. ఆ మాటలు సూదిలా చిన్నగా కపాలం దాటి మెదడులోకి దిగాయి. అక్కడనుంచి న్యూరాన్స్ పరుగెత్తి గుండెను కదిలించాయి.
“సరే అయితే.. జాగ్రత్త!”.
“థాంక్స్ డాడీ.. థాంక్ యు సో మచ్!”..
“హరీ!.. నీవు ఎవరైనా అబ్బాయిని ఇష్టపడ్డావా!?”.
శారద ఆశ్చర్యంగా చూసింది. పాత చంద్రం కనిపించాడు. ఏదైనా పని భుజానికి వేసుకున్నాడు అంటే.. అది పూర్తయి తీరాల్సిందే!
“లేదు డాడీ! కాకపోతే.. అందరిలాగే నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది”.
చంద్రం ఆలోచనలో పడ్డాడు.
“డాడీ.. ఒకవేళ మీకు అమ్మాయి పుడితే
ఏం పేరు పెట్టేవారు?”.
“రమ్య!”.
‘మా కొడుక్కి వరుడు కావలెను’.
పేపర్లో ప్రకటన. అన్ని వివరాలతోపాటు, చంద్రశేఖర్ నంబర్ కూడా ఉంది. ఆ ప్రకటన చూసి చాలామంది గేలి చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ‘ఎయిమ్స్ నుంచి ట్రాన్స్‌జెండర్ దాకా’ అంటూ టీవీల్లో ప్రోగ్రామ్స్ కూడా నడిచాయి. బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి తిడుతూ చాలా ఫోన్స్ వచ్చాయి. చంద్రశేఖర్ అన్నిటికీ సమాధానం ఇస్తున్నాడు. అప్పుడే రఘునాథం ఫోన్ చేశాడు.
“చెప్పు.. రఘు!”.
“ఏరా.. మీవాడికి మా అమ్మాయిని కట్టబెట్టరా అన్నా.. వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో!? పోనీ.. మీ అమ్మాయిని మావాడికి ఇస్తావా!?”.. వెటకారం.. పాలు పొంగినట్టు పొంగిపోతున్నది.
“నేను మళ్లీ.. చెప్తున్నా! నా కూతురికి ఇష్టం అయితేనే చేస్తా.. ఏ సంబంధం వస్తే అది చేయడానికి కాదు. తనకి నచ్చితేనే చేస్తా. నేను ఆ ప్రకటన ఇచ్చింది.. రేపు నా కూతురు ఇంటికి వచ్చినప్పుడు బయటికి వెళ్లాలంటే భయపడకూడదు. ఆ అవమానాలు.. ఇబ్బందులేవో మేమే పడతాం. నువ్వు కూడా నీ పిల్లలకి ఇష్టమైతేనే చేయి” అంటూ ఫోన్ పెట్టేశాడు.
తర్వాత ఒక యూట్యూబ్ చానెల్ వాళ్లు చంద్రశేఖర్‌ను ఇంటర్వ్యూ చేశారు.
“ఒకప్పుడు మీ కొడుకు, ఇప్పుడు మీ కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. సమాజం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?”.
“ఈ సమాజం ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా నేను ఈ పెళ్లి జరిపిస్తా. అది కూడా చాలా ఘనంగా.. మీరు ఏ పేరుతో పిలిచినా సరే, పుట్టింది ఆడైనా మగైనా.. ముందు నా బిడ్డ! ఈ సమాజం ఎప్పుడైనా మార్పును మొదట తిరస్కరిస్తుంది. కానీ, అర్థం చేసుకుంటుంది. దాన్ని ఆపడం ఎవరివల్లా కాదు. మహా అయితే కాస్తా లేట్ అవ్వొచ్చు. కాలమైనా.. మనిషైనా.. శక్తయినా.. రూపాంతరం చెందాల్సిందే! అది ప్రకృతి నియమం. దాన్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. అలాగే, ప్రేమ కూడా రూపాంతరం చెందుతుంది. దాన్ని కాపాడుకోవాలి. సమస్య కూడా రూపాంతరం చెందుతుంది. దాన్ని ఎదుర్కోవాలి”.
ఇంత జరుగుతున్నా శారద అస్సలు తలదూర్చలేదు. కూతురు ట్రీట్మెంట్ను చూసుకుంటూ ఉంది. కొన్ని రోజులకు దీనిపై చర్చ తగ్గింది. రమ్య ఇంటికి వచ్చింది. తనకి ఎవరూ నచ్చలేదని పెళ్లిని పక్కన పెట్టి.. హాస్పిటల్ పెట్టాలని అనుకుంది.
ఇండియాలో హాస్పిటల్ పెట్టడం అంతా తేలికైన విషయం కాదని తెలవడానికి, వాళ్ల చెప్పులను చూస్తేనే అర్థమవుతుంది. పైగా ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్స్. అందరూ ఆ హడావుడిలోనే ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యే రాజవర్ధనే.. ఇప్పటి ఆరోగ్యశాఖ మంత్రి. అతణ్ని కలవడానికి వెళ్లారు. లోపలికి రానివ్వలేదు.
మంత్రి బయటికి వెళ్తుంటే..
“సర్.. సర్!” అంటూ చంద్రశేఖర్ అడ్డం వెళ్లాడు.
మంత్రి కాస్త చిరాకుగా చూశాడు.
“సర్.. నా కూతురు రమ్య హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నది. ఏదైనా సాయం కావాలంటే మీరే అడగమన్నారు”.. అంటూ గతాన్ని గుర్తుచేశాడు.
మంత్రి రమ్య వైపు తిరిగి..
“అటూఇటూ కాని మనిషితో హాస్పిటల్ పెట్టిస్తే.. ప్రజల ప్రాణాలు ఎటూ కాకుండా పోతయి. పోయి.. ట్రైన్లో చేతులు చరుస్తూ అడుక్కోపో.. నీవల్ల, మీ నాన్న వల్ల ఇప్పటికే నియోజకవర్గం పరువంతా పోయింది” అంటూ వెళ్లిపోయాడు.
రమ్యకు మత్తుమందు ఇవ్వకుండా, నిలబెట్టి సర్జరీ చేసినట్టు అనిపించింది. చంద్రం వెళ్తున్న మంత్రి కారునే చూస్తూ ఉన్నాడు.
“డాడీ.. నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా”.. చంద్రం ఆశ్చర్యంగా చూశాడు.
“రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలాకష్టం. పైగా ఇంకా ఎక్కువ అవమానాలు పడాల్సివస్తుంది”.
“ప్రచారంలోనే వైద్యం చేద్దాం. గెలవడం కోసం కాదు నాన్న.. వైద్యం కోసం! నా అస్తిత్వం కోసం! నాలాంటి వాళ్ల ఉనికి కోసం!”.
‘పిల్లలకు రూపంతో పాటు పోరాడే లక్షణాన్ని ఇవ్వండి. ఎందుకంటే, సమస్య ఎప్పుడూ తీరదు. అది రూపాంతరం చెందుతుంది. ఒక సమస్య తీరితే.. ఇంకో సమస్య వస్తుంది. దాన్ని ఎదుర్కొంటూనే సంతోషాన్ని వెతుక్కోవాలి. జీవితం ఒక పోరాటం. జీవితమైనా.. పోరాటమైనా.. మరణంతోనే ముగుస్తుంది!’.. ఆలోచనల్లోనే రమ్యను దగ్గరికి తీసుకున్నాడు చంద్రశేఖర్.
పిల్లలకు రూపంతోపాటు పోరాడే లక్షణాన్ని ఇవ్వాలని చెబుతున్నారు రచయిత చింతకింది శివశంకర్. ఎందుకంటే.. సమస్య ఎప్పుడూ తీరదనీ, అది ఎల్లప్పుడూ ‘రూపాంతరం’ చెందుతూనే ఉంటుందని అంటున్నారు. ‘రూపాంతరం’ కథా రచయిత శివశంకర్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లి గ్రామం. బీటెక్ (ఈసీసీ) తర్వాత సైయంట్, ఇన్ఫోసిస్ సంస్థల్లో టెలికామ్ ఇంజినీర్‌గా ఐదేళ్లు పనిచేశారు. సాహిత్యంపై మక్కువతో 2021 నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. ఈయన మొదటి కథ.. ‘స్వాతంత్య్రం’. లోక కళ్యాణం, కథలు కల్పితం కాదు, ఏ దేశమేగినా – ఎందుకాలిడినా.. అంటూ పదికి పైగా కథలు రాశారు. ‘విషనరుడు’ కవితా సంపుటిని ప్రచురించారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందడం ఇది వరుసగా మూడోసారి. ఇంతకుముందు వరకు స్వాతంత్య్రం, బొందలగడ్డ కథలకు బహుమతులు అందుకున్నారు. ‘చరిత కామాక్షి’ సినిమా, ‘గప్‌చుప్’ అనే వెబ్ సిరీస్‌కు రచయితగా పనిచేశారు. ‘అసుర తెలుగు పాడ్‌కాస్ట్’ను నిర్వహిస్తున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.చింతకింది శివశంకర్
-99123 24492 చింతకింది శివశంకర్