హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్థిక సాయం చేస్తే సత్తాచాటుతానని తెలంగాణ యువ పవర్‌లిఫ్టర్ వైష్ణవి మహేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నది. సన్‌సిటీ(దక్షిణాఫ్రికా) వేదికగా అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో భారత జట్టుకు వైష్ణవి(84కి) ఎంపికైంది.
తెలంగాణ నుంచి వైష్ణవితో పాటు సుకన్య తేజావత్(76కి), మోడం వంశీ(66కి)జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అయితే దక్షిణాఫ్రికా టోర్నీలో పోటీపడేందుకు వైష్ణవికి ఆర్థిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఎవరైనా తోడ్పాటు అందిస్తే అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పతకాలు సాధిస్తానని ఈ యువ లిఫ్టర్ ఆత్మవిశ్వాసంతో ఉన్నది.
ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన వైష్ణవి ప్రస్తుతం స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపించి ఆర్థికంగా మద్దతుగా నిలిస్తే ప్రతిభ చాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆయా టోర్నీల్లో పతకాలు సాధించినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ప్రోత్సాహం అందలేదని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకోవాలని అభ్యర్థిస్తున్నది.