లోవా(అమెరికా): యూఎస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు తన్విశర్మ, ఆయూశ్శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 16 ఏండ్ల తన్వి 21-13, 21-16తో కరుపతెవన్ లెట్సెనా(మలేషియా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన తన్వి 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆయూశ్ 22-20, 21-9తో జూనియర్ వరల్డ్ చాంపియన్న కువో కువాన్(చైనీస్ తైపి)పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం హరిహరణ్, రుబాన్కుమార్ 9-21, 19-21తో చియాంగ్ చియాన్, వీ వు(చైనీస్ తైపి) చేతిలో ఓడి నిష్క్రమించింది.