Team India | గెబెహా: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆలౌరౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్.. రెండో మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమిపాలైంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి (5/17) సంచలన స్పెల్‌తో మ్యాచ్‌ను భారత్ వైపునకు తిప్పినా ఆఖర్లో తడబడ్డ టీమ్ఇండియాకు పరాభవం తప్పలేదు. మ్యాచ్ ఆఖరి వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో సఫారీలు 3 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్‌ను 20 ఓవర్లలో 124/6 పరుగులకే కట్టడిచేశారు.
హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 39 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ అయినప్పటికీ అతడు ఆఖర్లో విలువైన బంతులను వృథా చేశాడు. అక్షర్ పటేల్ (27), తిలక్ వర్మ (20) మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. సఫారీ బౌలర్లలో పీటర్ (1/20), సిమెలానె (1/20), జాన్సెన్ (1/25), కొయెట్జి (1/25) సమిష్టిగా రాణించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో వరుణ్ దెబ్బకు సఫారీలు విలవిల్లాడారు. కానీ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్, 7 ఫోర్లు), గెరాల్డ్ కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం ఆ జట్టును గట్టెక్కించింది. స్టబ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వరుణ్ తిప్పేసినా..
120 బంతుల్లో 125 పరుగులు. సౌతాఫ్రికా విజయ సమీకరణం ఇది. సొంతగడ్డపై భారీ హిట్టర్లు కలిగిన ఆ జట్టుకు ఇదేం పెద్ద లక్ష్యం కాదు. కానీ వరుణ్ దెబ్బకు ఆ జట్టు ఒకదశలో 66/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే స్టబ్స్, కొయెట్జి పోరాటం ఆ జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. ఛేదనలో రెండు ఫోర్లు కొట్టి జోరుమీద కనిపించిన ఓపెనర్ రెకెల్టన్ (13)ను అర్ష్‌దీప్ 3వ ఓవర్లో ఔట్ చేసి సఫారీలను తొలిదెబ్బ తీశాడు. ఆరో ఓవర్లో మొదలైంది వరుణ్ మాయ. సఫారీ బ్యాటర్లు బంతిని వదిలేస్తే వికెట్ల మీద ఉన్న స్టంప్స్ పడిపోవాల్సిందేనన్న రేంజ్లో అతడు మాయ చేశాడు.
సూర్య నుంచి బంతిని అందుకున్న అతడు రెండో బంతికే మార్క్మ్ (3)ను క్లీన్‌బౌల్డ్ చేసిన వరుణ్.. తన మరుసటి ఓవర్లో హెండ్రిక్స్నూ పెవిలియన్‌కు పంపాడు. 11వ ఓవర్లో జాన్సెన్ (7)ను బౌల్డ్ చేసిన వరుణ్.. 13వ ఓవర్ వరుస బంతుల్లో ప్రమాదకర క్లాసెన్ (2), మిల్లర్ (0)ను ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. మిల్లర్‌ను ఔట్ చేసిన వరుణ్.. కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదుచేశాడు. బిష్ణోయ్ 16వ ఓవర్లో సిమెలానె (7)ను వెనక్కి పంపాడు. చివరి 4 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 37 పరుగులు అవసరమవగా.. అర్ష్‌దీప్ 17వ ఓవర్లో 12 పరుగులు రాగా అవేశ్ ఖాన్ 18వ ఓవర్లోనూ కొయెట్జీ రెండు ఫోర్లు కొట్టాడు. అర్ష్‌దీప్ 19వ ఓవర్లో స్టబ్స్ మూడు బౌండరీలతో సఫారీల విజయాన్ని ఖాయం చేశాడు.
గాడి తప్పారు!
తొలి మ్యాచ్‌లో వీరవిహారం చేసి భారీ స్కోరు అందించిన భారత బ్యాటర్లు రెండో టీ20లో నిరాశపరిచారు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అలరించిన సంజూ శాంసన్.. జాన్సెన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే క్లీన్ బౌల్డ్ అవడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. కొయెట్జి రెండో ఓవర్లో అభిషేక్ శర్మ (4) మరోసారి చెత్త షాట్ ఆడి జాన్సెన్ చేతికి చిక్కాడు. సిమెలానె మూడో ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. చప్పగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు తిలక్, అక్షర్ కలిసి.. ఓ సిక్స్, రెండు ఫోర్లతో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు.
కానీ మార్క్మ్ 8వ ఓవర్లో ఆఖరి బంతిని కవర్స్ దిశగా ఆడగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మిల్లర్ అద్భుతమైన వన్ హ్యాండ్ క్యాచ్‌తో అతడిని వెనక్కి పంపాడు. క్రీజులో కుదుకుంటున్న అక్షర్.. రనౌట్ అవగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున రింకూ సింగ్ (9) కూడా విఫలమయ్యాడు. రింకూ నిష్క్రమించేటప్పటికే 23 బంతుల్లో 14 పరుగులు చేసిన హార్దిక్ ఆ తర్వాత కూడా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. జాన్సెన్ 18వ ఓవర్లో 4, 6, 4తో ఊపు మీద కనిపించినా కొయెట్జీ 19వ ఓవర్లో 4 బంతులాడి ఒక్క పరుగూ చేయలేకపోయాడు. జాన్సెన్ ఆఖరి ఓవర్లోనూ 6 పరుగులే వచ్చాయి.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 20 ఓవర్లలో 124/6 (హార్దిక్ 39 నాటౌట్, అక్షర్ 27, పీటర్ 1/20, సిమెలానె 1/20)
దక్షిణాఫ్రికా: 19 ఓవర్లలో 128/7 (స్టబ్స్ 47 నాటౌట్, హెండ్రిక్స్ 24, వరుణ్ 5/17, బిష్ణోయ్ 1/21)