WTC Points Table | యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టును ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 2025-27 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) కొత్త సైకిల్ టీమిండియాకు ఇదే తొలిసిరీస్. రెడ్ బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు గిల్ నాయకత్వంలో మొదటిసారి టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను గెలుచుకోలేకపోయినా.. చివరిదైన ఓవల్ టెస్టులో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. ఈ విజయం చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడోస్థానానికి చేరుకున్నది. ఓవల్ టెస్ట్‌కు ముందు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానంలో ఇంగ్లండ్ ఉన్నది. భారత్ ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో 28 పాయింట్లతో పాటు 46.67శాతం పర్సంటేజ్ ఉన్నది. ఇక ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా మూడు మ్యాచుల్లో మూడు విజయాలను నమోదు చేసింది. శ్రీలంక జట్టు రెండోస్థానంలో ఉన్నది. రెండు మ్యాచులు ఆడగా.. అందులో ఒకటి గెలువగా.. మరొకటి డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. రెండింట్లో ఓడిపోగా.. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నది.
ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఆతిథ్య జట్టుకు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులకే కుప్పకూలింది. ఐదోరోజు ఇంగ్లండ్ గెలిచేందుకు 35 పరుగులు, భారత జట్టుకు నాలుగు వికెట్లు అవసరం. సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-2తో డ్రాగా ముగిసింది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు చేసిన అద్భుత ప్రదర్శన చేసింది. వాస్తవానికి ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా పలువురు మాజీలు పేర్కొన్నారు. విమర్శకులందరి నోళ్లను టీమిండియా తన ఆటతీరుతో మూయించింది భారతదేశం తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగుల చేసి.. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 367 పరుగుల వద్ద ముగిసింది. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) పరుగులు చేసినా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.