అయోధ్య : భారత రెజ్లింగ్ సమాఖ్య ఆదివారం తలపెట్టిన అత్యవసర సర్వసభ్య సమావేశం రద్దయింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ సమాఖ్య కార్యకలాపాలన్నీ రద్దు చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా గోండాలో జరగాల్సిన ర్యాంకింగ్ టోర్నీనికూడా రద్దు చేసింది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరన్సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో క్రీడా శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
బ్రిజ్ భూషణ్ కొందరు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, సమాఖ్య నిర్వహణలో నియంతలా వ్యవహరిస్తున్నాడని కొందరు ప్రముఖ రెజ్లర్లు జంతర్మంతర్వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడంతో మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. దీనికితోడు భారత ఒలింపిక్ సంఘం మేరీకోమ్ సారధ్యంలో ఒక విచారణ కమిటీని కూడా నియమించడం గమనార్హం. కమిటీ నివేదిక అందేవరకు సమాఖ్య కార్యకలాపాలను రద్దుచేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.