WPL 2024, RCB vs GG | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో బోణీ కొట్టేందుకు గుజరాత్ జెయింట్స్‌కు రెండో అవకాశం. గత సీజన్లో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన గుజరాత్.. రెండో సీజన్‌ను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. బెత్‌మూనీ సారథ్యంలోని గుజరాత్.. తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. తాజాగా ఆ జట్టు మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో గుజరాత్.. అన్ని రంగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్ ఆ జట్టు ప్రధాన లోపం. బెత్ మూనీ, ఫోబె లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నా వీళ్లంతా తొలి మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు. బౌలింగ్‌లోనూ గుజరాత్ చూపిన ప్రభావం అంతంత మాత్రమే. నేటి మ్యాచ్‌లో అయినా ఆ లోపాలను సరిదిద్దుకుని గెలుపు రుచి చూడాలని గుజరాత్ భావిస్తోంది.
మరోవైపు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను రెండు పరుగులతో చిత్తు చేసిన ఆర్సీబీ.. విన్నింగ్ జోష్ కొనసాగించాలని అనుకుంటోంది. ధాటిగా ఆడే సోఫి డివైన్, స్మృతి మంధానలు తొలి మ్యాచ్‌లో విఫలమైనా ఈ మ్యాచ్‌లో అయినా రాణించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
తుది జట్లు: ఇరు జట్లూ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాయి.
ఆర్సీబీ : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫి డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రి, రిచా ఘోష్, సోఫి మొలినెక్స్, జార్జియా వర్హెమ్, శ్రేయాంక పాటిల్, సిమ్రన్ బహద్దూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్
గుజరాత్ : బెత్ మనీ (కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఫొబె లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, డి. హేమలత, కాత్రిన్ బ్రైస్, తనూజా కన్వర్, స్నేహ్ రాణా, లీ తహుహు, మేఘనా సింగ్