బొగొట(కొలంబియా): ప్రతిష్ఠాత్మక ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో ఆకట్టుకుంది. ఓవైపు మణికట్టు గాయం వేధిస్తున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. బుధవారం జరిగిన మహిళల 49కిలోల విభాగంలో బరిలోకి దిగిన చాను..స్నాచ్‌లో 87కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కిలోలు మొత్తంగా 200కిలోల బరువెత్తింది. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ పసిడి విజేత హౌ జినుహ(89కి+109కి)ను వెనుకకు నెడుతూ కాంస్యానికి పరిమితం చేసిం ది. చైనాకు చెందిన జియాంగ్ (206కిలోలు) పసిడి పతకం దక్కించుకుంది. నేషనల్ గేమ్స్ సందర్భంగా గాయపడ్డ మీరాబాయి.. పూర్తి స్థాయిలో సత్తాచాటలేకపోయింది.