Chess Championship | సింగపూర్: చదరంగ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌నకు వేళైంది. భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య సోమవారం నుంచి జరుగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సింగపూర్ ఆతిథ్యమిస్తున్నది. ఈనెల 25 నుంచి డిసెంబర్ 12 దాకా సాగే ఈ టోర్నీలో ఇరువురు 14 రౌండ్లలో తలపడతారు.
విశ్వనాథన్ ఆనంద్ (2013) తర్వాత ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో గుకేశ్ బరిలోకి దిగుతుండగా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లిరెన్ యత్నిస్తున్నాడు. అయితే గతేడాది టైటిల్ నెగ్గిన లిరెన్.. ఈ ఏడాదికాలంలో మానసిక కుంగుబాటుకు లోనై ప్రధాన టోర్నీలకు దూరమయ్యాడు. కానీ గుకేశ్ మాత్రం ఈ ఏడాదికాలంలో నిలకడగా రాణించడమే గాక ఇటీవలే ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి జోరుమీదున్నాడు.