Neerja Chopra : ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల ముందు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neerja Chopra) నిరాశపరిచాడు. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన నీరజ్ జురిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్లో 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్ ఈసారి అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే.. నీరజ్ ఫామ్‌పై, సత్తాపై ఆందోళన అవసరం లేదని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అడిల్లె సుమరివల్లా (Adille Sumariwalla) అన్నాడు. ముఖ్యమైన టోర్నీల్లో బడిసె వీరుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.
‘ప్రస్తుతం నీరజ్ చోప్రా ఫామ్‌లోనే ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తాడు. జురిచ్ డైమండ్ లీగ్‌లో అతడు విఫలమయ్యాడని అందరూ అంటున్నారు. కానీ, 85-86 మీటర్ల దూరం మరీ తక్కువేమీ కాదు. నీరజ్ ఇదే మార్క్‌తో ఒలింపిక్ మెడల్ సాధించాడు. కాబట్టి అతడి సత్తాపై సందేహాలు అక్కర్లేదు’ అని పీటీఐతో సుమరివల్లా వెల్లడించాడు.
World Athletics vice president Adille Sumariwalla has backed star Indian javelin thrower Neeraj Chopra to be at his best during next month’s #WorldChampionships despite finishing runner-up in the Diamond League Final.
MORE ▶️ https://t.co/ZBOLrvYotJ pic.twitter.com/hZrRW60KbZ
— Sportstar (@sportstarweb) August 30, 2025
జావెలిన్ త్రోలో రికార్డులు బ్రేక్ చేస్తున్న నీరజ్ కెరీర్లో మొదటిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్.. ఆపై సిలేసియా డైమండ్ లీగ్‌లోనూ విజేతగా నిలిచాడు. టోక్యోలో జరుగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత స్టార్ జురిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో విఫలమయ్యాడు.
జులియన్ వెబర్ (Julian Weber) (జర్మనీ) 91.57 మీటర్ల దూరంతో అగ్రస్థానం సాధించగా.. నీరజ్ 84.35 మీటర్లతో ఫస్ట్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. అయితే.. ఈ డబుల్ ఒలింపియన్ మళ్లీ పుంజుకొని ప్రత్యర్థులకు షాకిచ్చే అవకాశముంది. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ వరల్డ్ ఛాంపియన్షిప్స్ షురూ కానున్నాయి. ఈ టోర్నీలో నీరజ్ సర్వశక్కులు ఒడ్డితే దేశానికి మరో పతకం అందించడం ఖాయం.