Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అమ్మాయిలు అదరగొడుతున్నారు. బౌట్ బౌట్‌కు తమ పంచ్‌ల్లో పదును పెంచుతూ బాక్సర్లు నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతక పోరుకు దూసుకెళ్లారు. టర్కీ ప్రదర్శనను మరోమారు పునరావృతం చేస్తూ తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీలో దడదడలాడిస్తున్నది. వరుస బౌట్లలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నది. నిఖత్‌కు తోడు లవ్లీనా, నీతూ, సవీటీ బౌట్లో శివంగుల్లా చెలరేగుతూ తమ పంచ్ పవర్ తిరుగులేదని నిరూపించారు. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలువడమే తమ లక్ష్యమంటున్నారు. నలుగురికి నలుగురు పసిడి గెలిచి కొత్త చరిత్ర లిఖించేందుకు సై అంటున్నారు.
Nikhat Zareen
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్లు రింగ్‌లో దమ్ము చూపిస్తున్నారు. తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు. బౌట్ బౌట్‌కు తమ పంచ్ పవర్‌ను పెంచుకుంటూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తున్నారు. సొంత ఇలాఖాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతక పోరులోకి దూసుకెళ్లారు. శని, ఆది వారాల్లో ఫైనల్ బౌట్లు జరుగనున్నాయి.
గురువారం జరిగిన 50కిలోల సెమీస్ పోరులో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో ఇంగ్రిట్ వాలెన్సియా(కొలంబియా)పై అద్భుత విజయం సాధించింది. తన కంటే అనుభవజ్ఞురాలైన కొలంబియా బాక్సర్‌పై నిఖత్ అది నుంచే దూకుడు ప్రదర్శించింది. వరుస బౌట్లలో బరిలోకి దిగుతున్నా..ఏ మాత్రం అలసట దరిచేరనీయకుండా ప్రత్యర్థి బలం, బలహీనతలను అంచనా వేస్తూ నిఖత్ సంధించిన పంచ్‌లకు సరైన సమాధానం లేకుండా పోయింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించి రియో ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకున్న వాలెన్సియాకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా తొలి రెండు రౌండ్లలో నిఖత్ పూర్తి ఆధిపత్యంతో కీలక పాయింట్లు కొల్లగొట్టింది.
కొలంబియా బాక్సర్ పుంజుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఓవైపు పంచ్‌లు సంధిస్తూనే ప్రత్యర్థి సవాలును దీటుగా తిప్పికొట్టేందుకు జరీన్ ప్రయత్నించి సఫలమైంది. పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో ముప్పేట దాడి చేస్తూ బౌట్‌ను అలవోకగా తన వశం చేసుకుంది. ఫైనల్లో రెండు సార్లు ఆసియా చాంపియన్ న్యుయెన్ థీ తామ్ (వియత్నాం)తో నిఖత్ తలపడుతుంది. గతేడాది ఇస్తాంబుల్‌లో 52కిలోల కేటగిరీలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఈసారి 50కిలోల విభాగంలో అదే ప్రదర్శన పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉంది.
Nithu Lovlina Saweety
నీతూ, లవ్లీనా, సవీటీ కూడా:
మెగాటోర్నీలో నిఖత్‌తో పాటు నీతూ గంగాస్, లవ్లీనా, సవీటీ ఫైనల్లోకి ప్రవేశించారు. దీంతో భారత్‌కు కనీసం నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి. 48కిలోల సెమీస్‌లో నీతూ 5-2తో అలు బాల్కిబీకోవా(కజకిస్థాన్)పై విజయం సాధించింది. 75కిలోల బౌట్లో లవ్లీనా 4-1తో లీ క్వియాన్(చైనా)పై, సవీటీ..4-3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ(ఆస్ట్రేలియా)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు.
తెలంగాణకు నిఖత్ గర్వకారణం
సాట్స్ చైర్మన్,ఆంజనేయగౌడ్
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించిన యువ బాక్సర్ నిఖత జరీన్‌ను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అభినందించారు. మీ విజయం యావత్ తెలంగాణ క్రీడాలోకానికి గర్వకారణమన్నారు. ఫైనల్లో గెలిచి మరోమారు నిఖత్ ప్రపంచ చాంపియన్‌గా నిలువడం ఖాయమన్నారు. పసిడి పతకంతో రాష్ర్టానికి తిరిగి రావాలని సాట్స్ చైర్మన్ ఆకాంక్షించారు.