క్రైస్ట్‌చర్చ్: వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు అదరగొడుతున్నది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గిన మిథాలీరాజ్ బృందం.. మంగళవారం జరిగిన రెండో పోరులో 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికాతో పోరులో తలకు బంతి తగలడంతో గాయపడ్డ స్టార్ ఓపెనర్ స్మృతి మందన (66) చక్కటి ఇన్నింగ్స్ ఆడగా.. దీప్తి శర్మ (51), యస్తిక భాటియా (42), కెప్టెన్ మిథాలీ రాజ్ (30) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితమైంది. షిమైన్ క్యాంప్‌బెల్ (63) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో పూజ వస్ర్తాకర్ 3, రాజేశ్వరి గైక్వాడ్, మేఘన సింగ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మెగాటోర్నీ కోసం నెలన్నర ముందే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. ఆతిథ్య జట్టుతో ఏకైక టీ20తో పాటు 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. క్వారంటైన్ నిబంధనల కారణంగా స్టార్ ఓపెనర్ స్మృతి మందన అందుబాటులో లేకపోవడంతో పాటు మిడిలార్డర్లో సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవ ఫామ్ కారణంగా వరుస ఓటములు ఎదుర్కొంది. కెప్టెన్ మిథాలీ రాజ్ ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా నాలుగు వన్డేలు కోల్పోయాక చివరి పోరులో స్మృతి, మిథాలీ, హర్మన్ హాఫ్‌సెంచరీలతో రాణించడంతో విజయంతో సిరీస్‌ను ముగించింది. ఆ తర్వాత ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ బృందం చక్కటి ప్రదర్శన కనబర్చింది.