ముంబై: స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం మంగళవారం భారత మహిళల జట్టును ఎంపిక చేయనున్నారు. నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మెగా టోర్నీకి జట్టును ప్రకటించనుంది. ఇటీవల టీమ్ఇండియా వరుస విజయాల నేపథ్యంలో ఇప్పటికే తుది జట్టు ఎంపికపై సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌ల్లో విజయాలు సాధించిన టీమ్ఇండియా మంచి జోష్ మీదుంది.
అయితే డాషింగ్ ఓపెనర్ షెఫాలీవర్మ, స్టార్ పేసర్ రేణుకా ఠాకూర్ ఎంపికపై ఒకింత సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటికే కుదురుకున్న బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగించడమా లేక షెఫాలీని తీసుకోవడమా అనే దానిపై సెలెక్టర్లు డైలమాలో ఉన్నారు. మెగాటోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ద్వారా ఓ అంచనాకు రానున్నారు. వచ్చే నెల 30 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది.