Agasara Nandini | పొట్ట కూటికే ఇన్ని తిప్పలు పడుతున్న ఆ తల్లిదండ్రులు ఇక పిల్లల కలలు నెరవేర్చడం అంటే మాటలా! కానీ కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న చందంగా.. పసిప్రాయం నుంచే పరుగును ప్రేమించి.. కలలను సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన ఆ చిన్నారి అంతర్జాతీయ స్థాయిలో మువ్వన్నెల పతాకన్ని రెపరెపలాడించింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో వికసించిన ఆ క్రీడా కుసుమమే.. అగసర నందిని!! ఎన్నో అవమానాలు, మరెన్నో ఆటుపోట్లను భరించి.. అడ్డంకులు దాటుకుంటూ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన నందినితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఆసియా క్రీడల్లో పతకం నెగ్గడం ఎలా అనిపిస్తున్నది?
జాతీయ స్థాయిలో పలు పతకాలు నెగ్గినా.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన తొలిసారే కాంస్యం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. పోటీలకు ముందు రోజు అసలు నిద్రే పట్టలేదు. నా మనసు నిండా మెడల్ ఆలోచనలే.
పతకం సాధిస్తారని ఊహించారా?
ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో పతకం సాధిస్తానని ముందే ఊహించడం కష్టం. అందులోనూ చైనా అథ్లెట్లతో పోటీపడుతూ ముందుకు సాగడం మరీ క్లిష్టమైన పని. కానీ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగాలనుకున్నా. అనుకున్నట్లే అన్నీ క్రీడాంశాల్లో మెరుగైన ప్రదర్శన చేశా దీంతో పతకం గెలువగలిగా.
కుటుంబ నేపథ్యం ఏంటి?
మా నాన్న ఎల్లప్ప ఫుట్‌పాత్‌పై టీ స్టాల్ నడుపుతుండే వారు. అమ్మ ఇళ్లలో పనికి పోయి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. చదివిపించడమే కష్టమైన తరుణంలో గురుకుల విద్యాలయాల రూపంలో నాకు చక్కటి వేదిక లభించింది. వ్యాయమ ఉపాధ్యాయులు నన్ను బాగా ప్రోత్సహించేవారు. అలా స్టేట్ మీట్ నుంచి సౌత్ జోన్ స్థాయి వరకు సత్తాచాటా. ఆ తర్వాత జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సార్ దృష్టిలో పడ్డా. ఇక అక్కడి నుంచి నా పరుగు మారిపోయింది. ఇప్పుడు మా నాన్న చిన్న హోటల్ పెట్టుకున్నాడు.
హెప్టాథ్లాన్పై ఎప్పటి నుంచి మక్కువ?
కెరీర్ ఆరంభంలో కేవలం పరుగే నా లక్ష్యంగా ఉండేది. రోజుకు 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించేదాన్ని అది గుర్తించిన రమేశ్ సార్.. నన్ను 800 మీటర్స్‌లో మెరుగ్గా తీర్చిదిద్దారు. దీంతో పాటు హర్డిల్స్, లాంగ్‌జంప్‌లోనూ ప్రవేశం ఉండటంతో.. ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌లో పోటీపడ్డా. నాలుగు నెలల నుంచి నిద్రాహారాలు మాని శ్రమించా. రోజుకు 10 గంటలకు పైగా ట్రాక్‌పై కష్టపడ్డా.
తొలిసారే పతకం నెగ్గడంపై కామెంట్?
గతంలో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.. అయితే సీనియర్ స్థాయిలో నా కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ. కాస్త బెరుకుగా అనిపించిన మాట నిజమే అయినా.. కోచ్ రమేశ్ సార్, భారత స్పోర్ట్స్ సమాఖ్య ప్రతినిధులు, షాజీ సార్, లక్ష్మణ్ సార్, శ్రీధర్ సార్, మృదుల మేడమ్ ప్రోత్సాహంతో ముందడుగు వేశా. ఈ పోటీల కోసం సిద్ధమవుతున్న సమయంలో మా పెదనాన్న చనిపోయినా వెళ్లలేకపోయా. ఇక ఏషియన్ గేమ్స దగ్గర పడ్డాక మా తాత కన్నుమూశారు. ఆయనను చివరిసారి చూడలేకపోయా.
కెరీర్లో గురుకులాల పాత్ర ?
చిన్నప్పుడు గురుకుల పాఠశాలలో చదవకపోయి ఉంటే ఈ స్థాయికి చేరేదాన్ని కాదు. సోషల్ వెల్ఫేర్ నుంచి ప్రోత్సాహం లభించడం వల్లే క్రీడలకు కెరీర్‌గా ఎంపిక చేసుకున్నా. గోపీచంద్ అకాడమీలో అడుగుపెట్టాక నాపై నాకు నమ్మకం పెరిగింది.
హెప్టాథ్లాన్‌లో పోటీ ఎలా అనిపించింది?
వివిధ క్రీడాంశాల సమాహారం కావడంతో ఒకదాంట్లో వెనుకబడ్డా.. మరోదాంట్లో పుంజుకోవచ్చు అనుకున్నా.. కానీ చైనా అథ్లెట్ జెంగ్ నినాలీ, ఉజ్బేకిస్థాన్ ప్లేయర్ వొరోనినా నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. షాట్‌పుట్, హైజంప్, జావెలిన్‌త్రోలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో కాస్త ఆందోళనకు గురయ్యా. అయితే 200 మీటర్లు, 800 మీటర్ల పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి లెక్కసరిచేశా.
ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ప్లేయర్లకు సీఎం కేసీఆర్ నజరానాలు అందించడం.. అథ్లెట్లలో స్ఫూర్తి నింపుతున్నది. ఈ స్థాయికి చేరేందుకు తోడ్పడిన వాళ్లందరికీ ధన్యవాదాలు .