Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా వన్డే సిరీస్ జరుగుతుండగానే వ్యక్తిగత కారణాలు అని చెప్పి స్వదేశానికి తిరిగొచ్చాడు. టెస్టు సిరీస్‌లో సభ్యుడిగా ఉన్న అతడు.. ఆ సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇషాన్ స్వదేశానికి తిరిగిరావడానికి గల కారణాలు ఏంటన్నది అటు బీసీసీఐ గానీ ఇటు ఇషాన్ గానీ వెల్లడించలేదు. అయితే ఇషాన్ స్వదేశానికి తిరిగి రావడానికి గల కారణం ‘మానసిక కుంగుబాటు’ అని తెలుస్తున్నది. ఆట నుంచి కొద్దిరోజులు విరామం తీసుకునేందుకే అతడు సఫారీ సిరీస్ నుంచి తప్పుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
ప్రయాణమెక్కువ.. ఆడేది తక్కువ..
రెండేండ్ల క్రితమే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు ఆడిన ప్రతి ద్వైపాక్షిక సిరీస్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు. తుది జట్టులో అప్పుడప్పుడు కనిపిస్తున్న అతడికి ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి బడా టోర్నీలలో కూడా జట్టులో చోటు దక్కినా ఫైనల్ లెవన్‌లో మాత్రం ఆడింది అంతంతమాత్రమే. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి అతడు భారత్ ఆడిన ప్రతి సిరీస్‌లోనూ భాగమయ్యాడు. జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన అతడికి ఫిబ్రవరి – మార్చిలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో కూడా జట్టులో చోటు దక్కింది. తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా రెండు నెలల పాటు జట్టుతోనే ట్రావెల్ అయ్యాడు. అది ముగిసిన వెంటనే రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది. ఐపీఎల్ అనంతరం జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఎంపికచేసిన జట్టులో కూడా అతడి పేరుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన ఇషాన్.. జులై 12 నుంచి ఆగస్టు 13 దాకా మూడు ఫార్మాట్ల (ఒక టెస్టు) లోనూ ఆడాడు. సెప్టెంబర్ నుంచి ఆసియా కప్, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లోనూ అతడు సభ్యుడే. అనంతరం జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గత నెలలో ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ ఇషాన్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఏడాదికాలంగా విరామం లేకుండా జట్టు ఎక్కడికెళ్తే అక్కడికి తిరుగుతూనే ఉన్నా ఆడటానికి అవకాశం వచ్చింది మాత్రం తక్కువ. కెఎల్ రాహుల్ గైర్హాజరీలో ఇషాన్‌కు అవకాశాలు దక్కాయి. అతడు తిరిగిరావడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియాలో అతడిప్పటికీ రెగ్యులర్ ప్లేయర్ అయితే కాదు..
Being Ishan Kishan is not easy…💔#Ishankishan pic.twitter.com/2tTy5n5Y1e
— ⭐ (@gillnation_) December 22, 2023
ఆ ఇద్దరి నుంచి పోటీ..
‘మోర్ ట్రావెల్ లెస్ ప్లే’ తో పాటు ఇషాన్ కు జట్టులో పోటీ కూడా అధికంగానే ఉంటోంది. తన ఫ్రెండ్ శుభ్‌మన్ గిల్ గత ఏడాది కాలంగా భారత జట్టులో ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు రెడ్‌బాల్ క్రికెట్లో కూడా అతడు తనను తాను నిరూపించుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో జులైలో జరిగిన టెస్టు, టీ20లలో ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైస్వాల్ కూడా ఓపెనర్‌గా రాణించడం.. ఇషాన్ పాలిట శాపమవుతోంది. వికెట్ కీపర్ కోటాలో చోటు దక్కించుకుందామన్నా ఆ స్థానానికి యువ ఆటగాళ్ల నుంచి ఊహించని పోటీ ఎదురవుతోంది. ఇవన్నీ ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు దారి తీస్తున్నాయని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది.