Ishan Kishan: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో మరో రెండు రోజుల్లో మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ ఇటీవలే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు.. వికెట్ కీపర్లుగా సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌తో పాటు యువ ఆటగాడు జితేశ్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. గత రెండేండ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుతో ట్రావెల్ చేస్తున్న ఇషాన్ కిషన్‌ను మాత్రం పక్కనబెట్టారు. అసలు ఇషాన్‌ను ఎందుకు తప్పించినట్టు..? అతడికి రెస్ట్ ఇస్తున్నామని కూడా సెలక్టర్లు ప్రకటించలేదు. ఇషాన్‌ను తప్పించడానికి అతడి వ్యవహార శైలే కారణమా..?
వన్డే వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడిన ఇషాన్.. దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా వెళ్లాడు. కానీ వన్డే సిరీస్ ఆరంభానికి ముందే ఇషాన్.. వ్యక్తిగత కారణాలను చెప్పి స్వదేశానికి తిరిగొచ్చాడు. అతడు సఫారీ టూర్ నుంచి అర్థాంతరంగా ఎందుకొచ్చాడన్నదానిపై స్పష్టత లేదు. అయితే భారత్ వచ్చిన తర్వాత ఇషాన్.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ షోలో పాల్గొన్నందుకే ఇషాన్‌కు సెలక్టర్లు షాకులిస్తున్నారని తెలుస్తున్నది. బీసీసీఐ పర్మిషన్ లేకుండానే ఇషాన్ ఈ షోలో పాల్గొన్నడట. టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో బొరియా మజుందార్ ఇంటర్వ్యూ తర్వాత బీసీసీఐ.. క్రికెటర్లెవరూ మీడియాకు తమ అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. తాజాగా ఇషాన్ దీనిని ఉల్లంఘించినందుకే అతడిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అఫ్గాన్‌తో సిరీస్ నుంచి పక్కనబెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Why #IshanKishan is not part of #T20squad ?pic.twitter.com/St4LVgTism
— Bihari Hain Hum (@Bihari_HainHum) January 9, 2024
ఇక డిసెంబర్ 17న బీసీసీఐకి తన లీవ్ గురించి చెప్పిన తర్వాత ఇషాన్.. మళ్లీ బోర్డు సభ్యులకు గానీ, సెలక్టర్లకు గానీ తన సెలవుపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. జాతీయ జట్టు నుంచి విరామం తీసుకున్న తర్వాత ఇషాన్ ఏం చేస్తున్నాడు..? అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లలో జార్ఖండ్ తరఫున అతడు ఆడలేదు. రంజీలు ఆడేందుకు అతడిని పిలుద్దామనుకుని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్, క్రికెటర్లు ప్రయత్నించినా వారికి కూడా నిరాశే ఎదురైందని.. అసలు ఇషాన్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదని క్రికెటర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇషాన్‌కు ఏమైంది..? అతడు ఎక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..? జాతీయ జట్టులోకి ఎప్పుడు వస్తాడు..? అన్నది ఆసక్తికరంగా మారింది.