గెలుపొక్కటే లక్ష్యమైతే ఆట మరో స్థాయికి చేరుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధి విరాట్ కోహ్లీ అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కోహ్లీ సేన ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే జట్టు ఫైనల్ చేరడం జరగదు. ఈ మ్యాచ్ గెలిస్తే మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే క్వాలిఫైయర్-2 గెలవాలి. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ.. తమ జట్టుపై తమకు మంచి నమ్మకముందని చెప్పాడు.
‘‘పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో లేకపోతే, ఫైనల్స్ చేరడానికి రెండు మ్యాచులు గెలవాలంతే. మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధపడతాం. నా దృష్టిలో క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్స్ అనేవి ఈ మ్యాచ్‌లపై ఒత్తిడి పెంచడానికి పెట్టిన పేర్లంతే’’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
‘‘మనం క్రికెట్ ఆడితే గెలుస్తాం లేదా ఓడిపోతాం. ఇలా రెండు ఆప్షన్లు ఉన్నాయని ఆలోచిస్తే నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. మా ప్లాన్ ఒకటే.. వెళ్లామా, మా ప్లాన్స్ సరిగా అమలు చేసి మ్యాచ్ గెలిచామా అంతే. ఓటమి అనే ఆప్షనే లేకుండా మన లక్ష్యం కేవలం గెలుపే అయితే మన పెర్ఫార్మెన్స్ మరోస్థాయికి చేరుతుంది’’ అని కోహ్లీ స్పష్టం చేశాడు. తమ ప్లాన్స్ అమలు చేయడానికి జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని కోహ్లీ చెప్పాడు.
చివరగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టేబుల్ టాపర్ ఢిల్లీతో జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి బంతికి 5 పరుగులు కావలసి ఉండగా బెంగళూరు బ్యాట్స్‌మెన్ శ్రీకర్ భరత్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. కాగా, తొలి క్వాలిఫైయర్‌లో ఢిల్లీని ఓడించిన చెన్నై జట్టు ఇప్పటికే ఐపీఎల్14 ఫైనల్ చేరింది. బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీతో పోటీ పడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నైతో తలపడుతుంది.