టోక్యో: జిమ్నాస్టిక్స్.. అథ్లెట్లు వీటిని పర్ఫామ్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఒంటిని విల్లులా ఒంచుతూ.. గాల్లోకి స్ప్రింగ్‌లా ఎగురుతూ చేసే విన్యాసాలు ఎంతసేపు చూసినా తనివి తీరవు. అయితే వీటిని ప్రదర్శించే జిమ్నాస్ట్‌ల పరిస్థితి మాత్రం మరోలా ఉంటుంది. ఈ విన్యాసాలు ఎంత ప్రమాదకరమో వాళ్లను అడిగితే తెలుస్తుంది.
తాజాగా అమెరికన్ జిమ్నాస్ట్, ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకరిగా నిలుస్తోందనుకున్న సిమోన్ బైల్స్ (Simone Biles ) అర్ధంతరంగా టోక్యో ఒలింపిక్స్‌లోని రెండు కీలక ఈవెంట్ల నుంచి తప్పుకుంది. మానసిక సమస్యలే కారణమని చెబుతూ.. బైల్స్ ఓ మాట చెప్పింది. తాను ట్విస్టీస్తో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జిమ్నాస్టిక్స్ చేసేవారికి ఇది అలవాటైన పదమే అయినా.. అభిమానులకు మాత్రం ఇదేంటో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఆమె చెప్పిన ట్విస్టీస్ ( twisties ) అంటే ఏంటి? అవి అంత ప్రమాదకరమా అన్నవి ఇప్పుడు చూద్దాం.
ట్విస్టీస్ అంటే ఒక రకమైన మెంటల్ బ్లాక్ అని జిమ్నాస్ట్‌లు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మెదడు ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతుంది. గోల్ఫ్లాంటి గేమ్‌లోనూ ఇవి ఉంటాయి. గోల్ఫ్‌లో వీటిని యిప్స్ అంటారు. జిమ్నాస్ట్‌ల విషయంలో వాళ్లు గాల్లోకి ఎగిరినప్పుడు సడెన్‌గా వచ్చే ఈ ట్విస్టీస్ కారణంగా వాళ్లు తమ శరీరంపై నియంత్రణ కోల్పోతారు. దీంతో చేయాల్సినదాని కన్నా ఎక్కువ ట్విస్ట్‌లు లేదా ఫ్లిప్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు అనుకున్నరీతిలో ల్యాండ్ అవలేక గాయాల పాలవుతుంటారు.
ఎన్నో ఏళ్లుగా సులువుగా చేసే విన్యాసాల విషయంలోనూ జిమ్నాస్ట్‌లు ఒక్కోసారి ట్విస్టీస్లకు గురవుతారు. సరిగ్గా ఇప్పుడు అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్( Simone Biles ) కు కూడా అలాగే జరిగింది. మంగళవారం వాల్ట్ పర్ఫామ్ చేస్తుండగా.. ఒక్కసారిగా ట్విస్టీస్కు గురైంది. దీంతో సరిగా ల్యాండవలేకపోయింది.
Simone Biles, relating to gymnasts worldwide here: "They saw it a little bit in practice. Having a little bit of the twisties."
— Emily Giambalvo (@EmilyGiam) July 27, 2021
The twisties. The absolute worst.
ఈ ట్విస్టీస్ ( twisties ) ఎంత ప్రమాదకరమో బ్రిటిష్ జిమ్నాస్ట్ క్లాడియా ఫ్రాగపేన్ చెప్పింది. ఆమె 2016 రియో గేమ్స్‌లో ట్విస్టీస్కు గురై అన్ఈవెన్ బార్స్‌పై పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలాగే జరిగింది. సడెన్‌గా గాల్లో ఉన్నప్పుడు ట్విస్టీస్ కారణంగా శరీరంపై నియంత్రణ కోల్పోవడంతో కింది పడిపోయింది. తలకు గాయం కావడంతో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు బైల్స్ పరిస్థితి ఎలా ఉందో తాను అర్థం చేసుకోగలనని ఆమె చెప్పింది.
జిమ్నాస్ట్‌లకు, ప్రత్యేకంగా బైల్స్లాంటి ఎన్నో అంచనాలు ఉన్న వారిపై ఒత్తిడి చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో పర్ఫామ్ చేస్తూ మీ సామర్థ్యంపై మీకు కాస్త సందేహం వచ్చినా అది చాలా ప్రమాదకరం. నాకూ అలాగే జరిగింది అని క్లాడియా చెప్పింది. మెదడు, శరీరం మధ్య ఉండాల్సిన లింకు తెగిపోయినప్పుడు ఈ ట్విస్టీస్ ఏర్పడుతాయని మరో మాజీ జిమ్నాస్ట్, ఇప్పుడు కోచ్‌గా ఉన్న అలబామా చెప్పింది.
స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో పారాచూట్ తెరుచుకోకపోతే మన మెదడు, శరీరం ఎలా అయితే నియంత్రణ కోల్పోతాయో.. ఈ ట్విస్టీస్ కూడా జిమ్నాస్ట్‌లను అలాగే చేస్తాయని ఆమె చెప్పింది. వీటి నుంచి బయటపడటానికి మనం ఎంత బలంగా ప్రయత్నిస్తే అవి అంత బలంగా తిప్పికొడతాయని అలబామా చెప్పడం గమనార్హం.