హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాలతో చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. బుడాపెస్ట్(హంగరీ) వేదికగా జరిగిన మెగాటోర్నీలో ఓపెన్ విభాగంతో పాటు మహిళల కేటగిరీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక, దొమ్మరాజు గుకేశ్, వైశాలి, కెప్టెన్ శ్రీనాథ్‌కు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో హారికకు తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్, పలువురు చెస్ క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాల ద్వారా భారత ప్లేయర్ల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చిందని పేర్కొంది.