దుబాయ్: ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇండియా ఫైనల్లో గెలిస్తే, అప్పుడు ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో పీసీబీ చీఫ్ మోషిన్ నఖ్వీ ఉంటే, ఆ ట్రోఫీని అందుకోబోమని సూర్యకుమార్ అల్టిమేటం జారీ చేసినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లకు టీమిండియా ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత కెప్టెన్ సూర్య తన మరో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు.
ఆదివారం జరిగిన షేక్‌హ్యాండ్ వివాదం తర్వాత పీసీబీ పెట్టిన షరతుల్లో కొన్నింటిని ఐసీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్లు కూడా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కు కొన్ని షరతులు పెట్టారు. పాక్ అభ్యర్థన మేరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తొలగింపు విషయంలో ఐసీసీ తన ఆమోదాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో రిచీ రిచర్డ్సన్ను రిఫరీగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పాక్, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కు రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
పీసీబీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి ఇండియా ఆసక్తికరంగా లేదని కెప్టెన్ సూర్య ఏసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్లో ఇండియా గెలిస్తే, తాము నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోమని సూర్య అన్నాడు.