న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).. విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తితో ఇటీవల వ్యక్తిగత రిలేషన్ దెబ్బతిన్నట్లు ఓ కథనం ద్వారా తెలిసింది. టెస్టు క్రికెట్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ కొట్టిన సెహ్వాగ్.. ఆర్తిని 2004 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆర్యవీర్ 2007లో జన్మించగా, ఇక వేదాంత్ 2010లో పుట్టాడు. అయితే ఓ కథనం ప్రకారం.. సెహ్వాగ్, ఆర్తి మధ్య వైవాహిక బంధం బలహీనపడినట్లు తెలుస్తోంది.
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. సెహ్వాగ్, ఆర్తిలు.. గత కొన్ని నెలల నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. ఆ ఇద్దరు డైవర్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి వివరణ రాలేదు. గత కొంత కాలం నుంచి సెహ్వాగ్ తన భార్య ఆర్తి ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో ఆర్తిని సెహ్వాగ్ ఫాలో కావడం లేదు.
సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇటీవల కూచ్ బీహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడాడు. మెఘాలయాతో జరిగిన మ్యాచ్లో 297 రన్స్ కొట్టాడు. ట్రిపుల్ సెంచరీ మిస్ కావడంతో.. ఫెరారి కారు మిస్సైనట్లు సెహ్వాగ్ అప్పట్లో ఓ పోస్టు పెట్టాడు. టెస్టుల్లో సెహ్వాగ్ బెస్ట్ స్కోర్ 319 రన్స్. ఒకవేళ తన కుమారులు ఎవరైనా తన బెస్ట్ స్కోరును దాటితే వాళ్లకు ఫెరారీ కారు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు గతంలో ఓసారి సెహ్వాగ్ తెలిపాడు.