Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాచలం వరాహ లక్ష్మీ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడేందుకు వచ్చిన విరాట్.. ఆదివారం ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో విరాట్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందించి, శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారికి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకొని ఎంతో పారవశ్యానికి లోనైనట్లు విరాట్ తెలిపాడు. దర్శనం చేయించినందుకు, తీర్థ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందించినందుకు ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2-1 తేడాతో సిరీస్‌ను నెగ్గింది. అంతకు ముందు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వన్డే సిరీస్‌ను నెగ్గడంతో టీమిండియాకు ఊరటనిచ్చింది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 39.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 121 బంతుల్లో 116 పరుగులతో నాటౌట్‌గా నిలువగా.. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు మ్యాచుల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహాయంతో.. 151.00 సగటుతో 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక విరాట్‌ను చూసేందుకు స్టేడియం నుంచి హోటల్ వరకు ప్రతిచోటా అభిమానులు తరలివచ్చారు. ఇక విరాట్ మళ్లీ జనవరిలో మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగనున్న సిరీస్‌లో ఆడనున్నాడు.