Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆకలిగొన్న పులిలా ఆసియా కప్(Asia cup 2023) కోసం ఎదురు చూస్తున్నాడు. నిరుడు ఇదే టోర్నీలో సెంచరీతో ఫామ్ అందుకున్న కింగ్ కోహ్లీ ఈసారి కూడా జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. రేపటితో ఆసియా కప్ షురూ కానున్న సందర్భంగా కోహ్లీ ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు వన్డే ఫార్మాట్(ODI Farmat) అంటే ఎంతో ఇష్టమని అన్నాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆటగాడి సత్తాకు పరీక్ష పెడతాయని, అందుకనే వన్డేలు అడేందుకు ఇష్టపడతానని ఈ స్టార్ ప్లేయర్ తెలిపాడు.
‘నాకు వన్డేలు ఆడడమంటే ఇష్టం. నా దృష్టిలో.. వన్డే క్రికెట్ అనేది ఆటగాడి సత్తాకు అన్ని విధాలా పరీక్ష పెడుతుంది. టెక్నిక్, ఓపిక, పరిస్థితులకు తగ్గట్టు ఆడడం, ఒక్కోసారి గేర్ మార్చడం.. ఇలాంటివన్నీ వన్డే ఫార్మాట్లో ఎంతో కీలకం. ఇవన్నీ ఒక బ్యాటర్‌ను పూర్తి స్థాయిలో టెస్టు చేస్తాయి. అందుకని వన్డేలు నాలోని అత్యుత్తమ ఆటను బయటకు తెచ్చాయని నమ్ముతా. సవాళ్లను స్వీకరించడం, పరిస్థితులకు తగ్గట్టు ఆడి జట్టును గెలిచడం అంటే నాకు చాలా ఇష్టం. ఎల్లప్పుడూ నేను ఇదే చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌కు సంబంధించిన అన్ని కోణాల్ని విశ్లేషించుకోవడానికి ఈ ఫార్మాట్ ఎంతో ఉపయోగపడింది. అందుకనే వన్డే మ్యాచుల్ని ఎంతో ఆస్వాదిస్తాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ సెంచరీ అభివాదం
ఛేజ్ మాస్టర్(Chase Master)గా పేరొందిన కోహ్లీకి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. అతడి ఖాతాలో 46 సెంచరీలు ఉన్నాయి. అందులో 26 శతకాలు ఛేజింగ్‌లో బాదినవే కావడం విశేషం. ఈ ఏడాది విరాట్ వన్డేల్లో అదరగొట్టాడు. 12 మ్యాచుల్లో 50.36 సగటుతో 554 పరుగులు సాధించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకు కీలకం కానున్నాడు. ముఖ్యంగా ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ స్టార్ ఆటగాడు మరోసారి చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.