RCB | బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్లోగన్ ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి సీజన్ ఆరంభం మొదలుకుని బెంగళూరు ఆడే ఆఖరి మ్యాచ్ దాకా ఆర్సీబీ అభిమానులు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటారు. అయితే బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం.. ఆ స్లోగన్‌ను వాడొద్దని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు సూచించాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
ఓ టీవీ షోలో ఏబీడీ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో నేను ఆ స్లోగన్ చెప్పా. కానీ అప్పుడే నాకు కోహ్లీ నుంచి ఓ సందేశం వచ్చింది. ఆ స్లోగన్ వాడొద్దని దాని సారాంశం. ఆ సమయంలో నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్టు అనిపించింది. నాకైతే బెంగళూరు అభిమానుల మాదిరిగానే నిత్యం దానిని అనాలని ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ మాదిరిగానే ఐపీఎల్ ట్రోఫీనీ నెగ్గడం కష్టమని, అన్ని సవాళ్లను అధిగమించిన జట్టే విజేతగా నిలుస్తుందని ‘మిస్టర్ 360’ తెలిపాడు.