సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సారధి కోహ్లీ.. చెత్తషాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరుపై స్పందించాడు. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్లు కోహ్లీ ఫీలవుతాడని జాఫర్ అన్నాడు.
కోహ్లీ ఫామ్ కోల్పోలేదని, ఆడినంత సేపూ చాలా అందంగా బ్యాటింగ్ చేస్తున్నాడని వసీం జాఫర్ అన్నాడు. కానీ భారీ స్కోర్లు చేయకుండానే అవుటైపోతున్నాడని అభిప్రాయపడ్డాడు.
‘అవుటయ్యే వరకూ చాలా అందంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అవుటవడమే నిరాశపరుస్తుంది’ అని కామెంట్ చేశాడు. ఛటేశ్వర్ పుజారా గోల్డెన్ డక్‌గా తొలి బంతికే వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. సెంచరీ హీరో కేఎల్ రాహుల్‌కు చక్కటి సహకారం అందించాడు. 94 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేశాడు.
ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా లుంగి ఎన్గిడీ వేసిన బంతిని కవర్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన కోహ్లీ.. స్లిప్స్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తను అవుటైన విధానం చూసి కోహ్లీ కూడా చాలా బాధపడి ఉంటాడని మాజీ దిగ్గజ క్రికెటర్ షాన్ పొలాక్ కూడా చెప్పాడు.