ముంబై : మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రెండో భార్య ఆండ్రియా హెవిట్(Andrea Hewitt) ఓ పెద్ద విషయాన్ని బయటపెట్టింది. 2023లో కాంబ్లీకి విడాకులు ఇచ్చేందుకు సిద్దపడినట్లు ఆమె వెల్లడించింది. డైవర్స్‌ను ఫైల్ చేసినట్లు పేర్కొన్నది. కానీ కాంబ్లీ నిస్సహాయ స్థితిని చూసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆమె చెప్పింది. ఇటీవల వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమానికి కాంబ్లీతో కలిసి ఆమె హాజరైంది. ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది.
తాగుడుకు బానిసైన కాంబ్లీ గురించి ఆమె అనేక విషయాలు వెల్లడించింది. ఆల్కహాల్ అడిక్షన్ వల్ల తన రిలేషన్‌కు ఇబ్బంది ఎదురైనట్లు చెప్పిందామె. రెండో భార్య ఆండ్రియాను 2006లో కాంబ్లీ పెళ్లి చేసుకున్నాడు. సివిల్ కోర్టులో జరిగిన ఓ ప్రైవేటు సెర్మనీ ద్వారా వాళ్లు ఒక్కటయ్యారు. అయితే ఇటీవల కాంబ్లీ ఆరోగ్యం మరీ క్షీణించిన విషయం తెలిసిందే. మూత్రకోశ వ్యాధితో బాధపడుతున్న అతన్ని ఆకృతి ఆస్పత్రిలో చేర్పించారు.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు సూర్యాంశి పాండేతో జరిపిన పాడ్‌కాస్ట్‌లో ఆండ్రియా తన డైవర్స్ ప్లాన్ గురించి చెప్పింది. కాంబ్లీకి విడాకులు ఇవ్వాలనుకున్నా.. కానీ అతని ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన ఉండేదన్నారు. ఒకవేళ నేను అతన్ని వదిలివెళ్తే అప్పుడు అతను ఒంటరి అవుతాడని, అతనో చిన్నపిల్లవాడని, అది తనను బాధిస్తోందని, అతని గురించి ఆందోళన చెందాల్సి వస్తోందని, ఓ ఫ్రెండ్‌ను కూడా నేను వదిలేసే వ్యక్తిని కాదు అని, అతను అంతకన్నా ఎక్కువే అని, అతను తిన్నాడో లేదో అని టెన్షన్ పడేదాన్ని అని, ప్రతిక్షణం అతన్ని చెక్ చేయాల్సిన అవసరం వచ్చేదని పేర్కొన్నది.