Vinesh Phogat | బలాలి (హర్యానా): ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువుతో అనర్హత వేటుకు గురై పతకం తృటిలో చేజారినా ‘ఖాప్ పంచాయత్’ మాత్రం స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌ను ఘనంగా సత్కరించింది. ఆదివారం వినేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు ‘సర్వ్‌ఖాప్ పంచాయత్’ స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది. వినేశ్ అనర్హత వేటును కుట్రగా పేర్కొన్న బలాలి గ్రామపెద్దలు.. ఒలింపిక్ నిర్వాహకులు ఆమెకు పతకం ఇవ్వకున్నా తాము మాత్రం విజేతగానే భావిస్తామని, ఆమెకు స్వర్ణ పతకాన్ని అందిస్తామని గతంలోనే ప్రకటించారు. తాజాగా వాళ్లు వారి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. పసిడి పతకం అందుకున్న సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ.. ‘పారిస్‌లో ఫైనల్ ఆడనందుకు నేను చాలా దురదృష్టవంతురాలినని భావించా. కానీ భారత్‌కు తిరిగొచ్చి ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు పొందాక నేను అదృష్టవంతురాలినని అనిపిస్తోంది. ఈ పతకం కంటే నాకు మరేదీ గొప్పది కాబోదు’ అని తెలిపింది.
ఇదే వేదికపై వినేశ్ తన భవిష్యత్ కార్యాచరణపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పోరాటం ఇప్పుడే మొదలైందని, ఈ దేశ బిడ్డల కోసం తాను పోరాడతానని వెల్లడించింది. ‘నా పోరాటం ముగియలేదు. అది ఇప్పుడే మొదలైంది. భారత అమ్మాయిల కోసం నా పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది’ అని వ్యాఖ్యానించింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని వినేశ్ ముందుండి నడిపించిన విషయం విదితమే. కాగా త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.