లివర్‌పూల్: ఫుట్‌బాల్ అభిమానులు అమితంగా ఇష్టపడే ‘ప్రీమియర్ లీగ్’లో విజేతగా నిలిచి విజయోత్సవ ర్యాలీ తీస్తున్న ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ విక్టరీ పరేడ్ విషాదానికి దారితీసింది. ఈ లీగ్‌లో లివర్‌పూల్ జట్టు రికార్డుస్థాయిలో 20వ టైటిల్ గెలిచిన నేపథ్యంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలసంఖ్యలో జనం తరలిరాగా.. వారిపై ఓ దుండగుడు కారుతో దూసుకురావడంతో ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. లివర్‌పూల్‌లోని వాటర్ స్ట్రీట్ వద్ద జరిగిన ఈ ఘటనలో సుమారు 47 మందికి గాయాలవ్వగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పలువురు అభిమానులు.. హుటాహుటిన కారు వద్దకు వెళ్లి దుండగుడిని దాన్లోంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇది ఉగ్రవాద చర్య కాదని తెలిపారు. ప్రమాద ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. లివర్‌పూల్ ఇలాంటి కఠిన సవాళ్లను ఎన్నో తట్టుకుని నిలబడిందని, దేశం మొత్తం వారికి అండగా ఉందని తెలిపారు. ప్రమాద బాధితులకు పూర్తి మద్దతుగా ఉంటామని లివర్‌పూల్ ఒక ప్రకటనలో తెలిపింది.