Varun Chakaravarthy | ప్రపంచ క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్లకు కొదవలేదు. అయితే వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎంత త్వరగా గుర్తింపు సాధించారో అంతే త్వరగా తమ లయను కోల్పోయి కెరీర్ మధ్యలోనే కనుమరుగైపోయారు. ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్న భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. తనదైన బౌలింగ్ శైలితో 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వరుణ్.. ఆరంభంలోనే దారుణమైన అవమానాలను ఎదుర్కున్నాడు. ‘ఇలాంటి బౌలర్ మా దేశంలో గల్లీకొకడు ఉన్నాడు. చిన్నప్పుడు రబ్బర్ బాల్ క్రికెట్ ఆడినప్పుడే ఇటువంటి బౌలింగ్‌ను చీల్చి చెండాడాం’అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల వెక్కిరింతలతో అతడి కెరీర్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 2021లో దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ (వరుణ్‌కు అది అతడి కెరీర్లో నాలుగో టీ20)లో అశ్విన్, చాహల్ వంటి స్పిన్నర్లను కూడా పక్కనబెట్టిన టీమ్ మేనేజ్మెంట్.. వరుణ్‌కు అవకాశాన్నిచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో బాబర్, రిజ్వాన్ మెరుపులకు వరుణ్ తేలిపోయాడు. ఆ టోర్నీ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన అతడు.. మూడేండ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి నిలకడగా రాణిస్తూ పొట్టి ఫార్మాట్లో కీలక స్పిన్నర్‌గా ఎదుగుతున్నాడు. స్వదేశంలో బంగ్లా సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన వరుణ్.. పేస్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపైనా అంచనాలకు మించి రాణించాడు.
4 మ్యాచ్‌లలో 12 వికెట్లు తీసిన ఈ చెన్నై స్పిన్నర్.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2021లో ఆరు మ్యాచ్‌లలో 2 వికెట్లు మాత్రమే తీసిన వరుణ్.. 2024 నుంచి ఆడిన 12 మ్యాచ్‌లలో 31 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఆరంభం నుంచీ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్.. 2021లో జాతీయ జట్టుకు దూరమయ్యాక తన బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు. బంతి వేగాన్ని తగ్గించిన అతడు తన శైలికి వైవిధ్యాన్ని మేళవించి అదరగొడుతున్నాడు. సాధారణంగా లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు విసిరే బంతుల వేగం 100-110 కిలోమీటర్ల (గంటకు) వరకు ఉంటుంది. కానీ వరుణ్ ఈ ఏడాది కాలంలో వికెట్లు సాధించిన బంతుల వేగం లెగ్ స్పిన్ (94.6కి.మీ), గూగ్లీ (92.3 కి.మీ)గా ఉండటం విశేషం. ‘సైడ్ స్పిన్’తో లాభం లేదని గ్రహించిన అతడు.. ‘ఓవర్ స్పిన్’తో మాయ చేస్తున్నాడు. అతడి ఎత్తు కూడా బంతి వేగాన్ని నియంత్రిచేందుకు ఉపయోగపడుతోంది. అయితే ఈ స్థితికి రావడానికి సుమారు రెండేండ్లు నెట్స్‌లో శ్రమించాల్సి వచ్చిందని వరుణ్ తెలిపాడు. ఐపీఎల్‌తో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్, ముస్తాక్ అలీ, విజయ్ హజారే.. ఇలా ఏ టోర్నీనీ మిస్ అవకుండా తనను తాను పరీక్షించుకుంటూ తప్పులను సరిదిద్దుకున్నాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితాలే ఇప్పుడొస్తున్నాయని వరుణ్ గర్వంగా చెబుతున్నాడు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే కీలక ఆటగాడిగా మారే అవకాశముంది.
నాగ్‌పూర్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత అంచనాలకు మించి రాణిస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి బంపరాఫర్ తగిలే అవకాశముంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి భారత్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన వరుణ్.. గురువారం నుంచి మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ జట్టుతో చేరాడు. మంగళవారం వరుణ్.. నెట్స్‌లో బౌలింగ్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేగాక పాత్రికేయుల సమావేశంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం స్పందిస్తూ.. ‘అవును. వరుణ్ కూడా జట్టులో భాగం’ అని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు వరుణ్‌తో వన్డే సిరీస్ ఆడించి ఆ ప్రదర్శనల ఆధారంగా అతడిని మెగా టోర్నీలో ఆడించాలని గంభీర్ భావిస్తున్నట్టు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈనెల 12 దాకా చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ వరుణ్‌కు కీలకం కానుంది. అతడు తుది జట్టులోకి వస్తే మాత్రం కుల్దీప్, అక్షర్, సుందర్‌లో ఎవరో ఒకరి మీద వేటు పడే అవకాశాలున్నాయి.