BCCI : భారత క్రికెట్ (Indian Cricket) లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryvamshi).. ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతోపాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలోనూ అతడికి స్థానం లభించింది. దాంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) చీఫ్ సెలక్టర్ (Chief Selector) అజిత్ అగార్కర్ (Ajit Agarker) వైభవ్ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు.
వైభవ్ కీలక టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా మారగలడని అన్నారు. యువ క్రికెటర్‌గా వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడారు. ‘ఒక యువ ఆటగాడి గురించి ఏం చెప్పగలం..? అతడు ఏం చేయగలడో మీరంతా చూశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కూడా దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. అతని బ్యాటింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లోనే కాదు, గత సీజన్లోనూ అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ, ఒత్తిడి ఉండే టోర్నమెంట్లో అతడు ఎంతో విధ్వంసకరంగా, గేమ్ ఛేంజర్‌గా మారగలడు’ అని అగార్కర్ చెప్పారు. క్రికెట్‌ను, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను చూసేవారికి వైభవ్‌పై భారీ అంచనాలున్నాయని అన్నారు. అతడు తన ప్రదర్శనతోనే జట్టులో చోటు దక్కించుకున్నాడని చెప్పారు.