Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్‌ను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(171) విధ్వంసక శతకంతో కొండంత స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం యూఏఈ(UAE)ని రెండొందలలోపే కట్టడి చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ సెంచరీతో విరుచుకుపడగా.. అరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69)లు అర్ధ శతకాలతో రెచ్చిపోయారు. టాపార్డర్ రాణించడంతో ప్రత్యర్థికి అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. అనంతరం బౌలర్లు విజృంభించగా 234 పరుగుల తేడాతో అదిరే బోణీ కొట్టింది ఆయుశ్ మాత్రే బృందం.
దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ రికార్డు స్కోర్‌తో బోణీ చేసింది. ఆతిథ్య యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫీల్డర్లను బౌండరీ వద్దకు పరుగులు పెట్టిస్తూ వైభవ్ సూర్యవంశీ(171: 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా.. టీమిండియా బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను గొప్పగా కట్టడి చేశారు. అన్ని విభాగాల్లో అదుర్స్ అనిపించిన టీమిండియా 234 పరుగుల తేడాతో టోర్నీలో శుభారంభం చేసింది. సూపర్ సెంచరీతో విజృంభించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
HISTORY BY VAIBHAV SURYAVANSHI 🚨
14-year-old Vaibhav Suryavanshi scored 171 runs in just 95 balls with 14 sixes and 9 fours against the UAE 🇦🇪
India 🇮🇳 scored a massive 433/6 in 50 overs in U19 Asia Cup 2025 😨
– What’s your take 🤔 pic.twitter.com/czNXNh7Xun
— Richard Kettleborough (@RichKettle07) December 12, 2025
ఇటీవలే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈపై శతకంతో కదంతొక్కిన వైభవ్ సూర్యవంశీ మరోసారి విరుచుకుపడ్డాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ఊచకోతకు తెగబడిన వైభవ్.. బౌండరీలతో హోరెత్తించాడు. కసిదీరా కొట్టిన ఈ యంగ్‌స్టర్ 56 బంతుల్లోనే సెంచరీతో భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. వైభవ్ ఇచ్చిన శుభారంభాన్ని కొనసాగిస్తూ అరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా.. నిర్ణీత ఓవర్లలో 433 పరుగులు చేసింది టీమిండియా. అనంతరం భారీ ఛేదనలో యూఏఈ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
టాపార్డర్ కుప్పకూలగా పృథ్వీ మధు(50), ఉద్దిశ్ సూరి(78) అర్ధ శతకంతో ఏడు వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసిందంతే. దుమ్మురేపే ఆటతో 234 పరుగుల విజయం సాధించిన భారత్ ‘మాతో జాగ్రత్త’ అని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. మరో మ్యాచ్‌లో మలేషియాపై 297 పరుగులతో పాకిస్థాన్ గెలుపొందింది. డిసెంబర్ 14న భారత్, పాక్ మ్యాచ్ జరుగనుంది.