రెండేండ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా వరుస సెంచరీలతో విజృంభించడంతో యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే.. సిడ్నీలో మెరుగ్గానే పోరాడినా.. ఇంగ్లిష్ జట్టుకు పరాజయం తప్పేలా కనిపించడం లేదు. ఆదివారం 90 ఓవర్ల పాటు నిలిచి ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటుందా.. లేక 10 వికెట్లు కోల్పోయి వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి వైపు నిలుస్తుందా చూడాలి!
సిడ్నీ: టెస్టు క్రికెట్లో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ మిడిలార్డర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టడంతో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయంపై కన్నేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పోరులో ఖవాజా (138 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు కామెరూన్ గ్రీన్ (74) రాణించడంతో ఆసీస్ 265/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లిష్ జట్టు ముందు 388 పరుగుల లక్ష్యం నిలువగా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రూట్ సేన వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (22), హసీబ్ హమీద్ (8) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. విజయానికి ఇంకా 358 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 294 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 4, కమిన్స్, లియాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి మూడు టెస్టులు నెగ్గిన కంగారూలు 3-0తో సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
ట్రావిస్ హెడ్‌కు కరోనా సోకడంతో 2019 తర్వాత తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఉస్మాన్ ఖవాజా మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగులు బాది పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అదే జోరు కొనసాగిస్తూ రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో పరుగుల వరద పారించాడు. వర్షం కారణంగా దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టమే అనుకుంటున్న దశలో.. తన దూకుడుతో ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 258/7తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 36 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో.. ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. వార్నర్ (3), హారిస్ (27), లబుషేన్ (29), స్మిత్ (23) ఎక్కువసేపు నిలువలేకపోవడంతో ఒకదశలో ఆస్ట్రేలియా 86/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఉస్మాన్ విజృంభించాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతడికి కామెరూన్ గ్రీన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 179 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ చేసేందుకు 86 బంతులు తీసుకున్న ఖవాజా.. ఆ తర్వాత ఫిఫ్టీని 45 బంతుల్లోనే పూర్తిచేయడం విశేషం.
–ఉస్మాన్ ఖవాజా
ఈ మైదానంలో ఇప్పటి వరకు నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేదించిన అత్యధిక లక్ష్యం 288 (2006లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా) కాగా.. ఇప్పుడు దాని కన్నా వంద పరుగులు ఎక్కువ టార్గెట్‌ను ఛేదించడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పనిలా కనిపిస్తున్నది. చివరి రోజు ఇంగ్లిష్ ఆటగాళ్లు ‘డ్రా’ కోసమే ఆడుతారనేది ఇప్పటికే స్పష్టమై పోగా.. వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తే ఇంగ్లండ్ పని సులువుకానుంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 416/8 డిక్లేర్డ్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 294 (బెయిర్‌స్టో 113, స్టోక్స్ 66; బొలాండ్ 4/36), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 265/6 డిక్లేర్డ్ (ఉస్మాన్ 101, గ్రీన్ 74; లీచ్ 4/84), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 11 ఓవర్లలో 30 (క్రాలీ 22 నాటౌట్, హమీద్ 8 నాటౌట్).