Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తోంది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) సెంచరీ (108 బ్యాటింగ్)బాదడంతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వస్తోంది. బెన్ స్టోక్స్ ఓవర్లో బౌండరీ బాది ఖవాజా శతకం సాధించాడు. అతడు టెస్టుల్లో మూడంకెల స్కోర్ చేయడం ఇది 14వసారి. అతడి మారథాన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఖవాజా ఆసీస్ స్కోర్ రెండొందలు దాటించాడు. అంతేకాదు యాషెస్ సిరీస్‌లో ఎనిమిదేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన ఆసీస్ ఓపెనర్‌గా నిలిచాడు.
2015లో క్రిస్ రోజర్స్(Chris Rogers) లార్డ్స్ స్టేడియంలో 173 పరుగులు చేశాడు. అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో శతకం బాదిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. 1997లో మార్క్ టేలర్(Mark Taylor) 129 రన్స్ కొట్టాడు. ప్రస్తుతం అలెక్స్ క్యారీ(10) ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా స్కోర్.. 243/5. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు ఇంకా 150 పరుగులు వెనకబడి ఉంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో విఫలమైన ఖవాజా యాషెస్ సిరీస్‌లో సత్తా చాటాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. స్టీవ్ స్మిత్(16) ట్రావిస్ హెడ్(50), కామెరూన్ గ్రీన్ల(38)తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్ 14తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి సెషన్లోనే చెలరేగిన స్టువార్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్(9)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే మార్నస్ లబూషేన్(0)ను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. దాంతో, బ్రాడ్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. స్మిత్ హ్యాట్రిక్ బంతిని వదిలేసి ఊపిరి పీల్చుకున్నాడు.