మాడ్రిడ్:ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారిణి మట్రా కోస్త్యుక్ మాడ్రిడ్ ఓపెన్లో టైటిల్ నెగ్గింది. తొలిసారి డబ్ల్యూటీఏ 1000 లెవెల్ ట్రోఫీ గెలిచింది. ఈ రెండింటికంటే కోర్టులో ఆమె చేసిన మరో పని ఇప్పుడు టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శనివారం జరిగిన ఫైనల్లో కోస్త్యుక్ 6-3,7-5తేడాతో మిరా ఆండ్రీవా (రష్యా)ను ఓడించింది. మ్యాచ్ పాయింట్ నెగ్గిన వెంటనే ఈ ఉక్రెయిన్ బ్యూటీ ఒక్కసారిగా బ్యాక్ఫ్లిప్ విన్యాసం చేసింది. సాధారణంగా సాకర్ మైదానంలో గోల్ కొట్టిన తర్వాత ఫుట్బాల్ ఆటగాళ్లు ఇలాంటి సంబరాలు చేస్తుంటారు. ఓ అమ్మాయి.. పైగా మట్టి కోర్టులో అమాంతం గాల్లోకి లేచి ఇలా పల్టీ కొట్టడంతో కోస్త్యుక్ ధైర్యం, ఆమె ఫిట్నెస్కు అంతా ఫిదా అవుతున్నారు.