ఇండోర్: ఐసీసీ మహిళా ప్రపంప కప్‌లో ఆడుతున్న ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల(Australian Woman Cricketers)ను వేధించిన కేసులో ఇండోర్‌లోని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బస చేస్తున్న రాడిసన్ హోటల్ నుంచి కేఫ్‌కు నడచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ క్రికెటర్లను నిందితుడు అసభ్యంగా తాకినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా టీమ్ మేనేజర్ డాన్నీ సిమ్మన్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అకీల్‌గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఈ ఘటన జరగ్గా.. శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు.
ఇండోర్‌లోని ఖజరానా రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. హోటల్ రూం నుంచి కేఫ్ దిశగా ఇద్దరు మహిళా క్రికెటర్లు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్‌పై వచ్చిన అకీల్ వాళ్లను వెంబడించాడు. అసభ్యకరంగా ఆ క్రికెటర్లను తాకి అక్కడ నుంచి పరారీ అయ్యాడని ఎస్ఐ నిధి రఘువంశీ తెలిపారు. ఏసీసీ హిమాని మిశ్రా ఆ ఇద్దరు క్రికెటర్లును కలిశారు. వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74, 78 కింద ఎంఐజీ పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. బైక్ నెంబర్‌ను ఓ స్థానికుడు గుర్తించాడు. దాని ఆధారంగా అకీల్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు.