ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్(IPL Final) జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనున్నది. అయితే ఆ ఫైనల్ కు త్రివిధ దళాలకు చెందిన అధిపతులను ఆహ్వానించినట్లు బీసీసీఐ ఇవాళ చెప్పింది. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతీయ రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ఆపరేషన్ సింధూర్‌తో ధ్వంసం చేశారు. వాస్తవానికి ఆ ఆపరేషన్ చేపట్టి సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ దశ ప్రారంభంకానున్నది. ఇవాళ తుది లీగ్ మ్యాచ్ జరగనున్నది. గురువారం క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనున్నది. ఆపరేషన్ సింధూర్‌లో ధైర్యసాహసాలను ప్రదర్శించిన సైనికులకు నివాళి అర్పించేందుకు బీసీసీఐ ప్లాన్ వేసింది. దీనిలో భాగంగా ఐపీఎల్ ఫైనల్‌కు త్రివిధ దళాధిపతులను ఆహ్వానించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన టాప్ ఆఫీసర్లను, సైనికులను కూడా ఫైనల్‌కు ఆహ్వానించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
సైనిక దళాల ధైర్యం, తెగువ, నిస్వార్ధ సేవ పట్ల బీసీసీఐ సెల్యూట్ చేస్తుందని సైకియా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో చూపిన సైనికుల తెగువను ఆయన ప్రశంసించారు. సైనికులు తమ సత్తాతో దేశాన్ని రక్షించినట్లు చెప్పారు. యావత్ దేశ ప్రజలకు ప్రేరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మన సైనిక దళాలను, హీరోలను గౌరవించాలన్న ఉద్దేశంతో.. ముగింపు వేడుకలను వారికి అంకితం ఇచ్చేందుకు నిర్ణయించామని ఆయన చెప్పారు.