చట్టోగ్రమ్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్లు టోనీ డి జార్జి (141 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (106) శతకాలతో మెరవడంతో బంగ్లాదేశ్‌తో చట్టోగ్రమ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు భారీ స్కోరు దిశగా సాగుతున్నారు. తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికాకు జార్జి, సారథి మార్క్మ్ (33) తొలి వికెట్‌కు 69 పరుగులు జతచేసి శుభారంభాన్ని అందించారు.
వన్ డౌన్లో వచ్చిన స్టబ్స్‌తో కలిసి జార్జి బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ ఇద్దరూ టెస్టుల్లో తొలి శతకాలతో పాటు 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.